రామాయణమ్.112
...
ఎవరి మాట వారిదే ఎవరి పట్టుదల వారిదే !
ఈ రాజ్యము నాది కాదు నీవే ఏలుకో అని భరతుడు ! తండ్రి కిచ్చిన మాట మీద నుండి రవ్వంతైనా జరగను అని రాముడు ! ఎవరి పట్టు వారిదే ! ఈ ధర్మమూర్తులను చూసి అక్కడ చేరిన ఋషిగణమంతా ప్రశంసించింది.
.
కానీ ! వారికి తెలుసు రావణ సంహారం జరగాలంటే రాముడు అడవిలో ఉండాల్సిందే ! లోక కళ్యాణం కోసం వనవాసిగా రాముడు జీవించాల్సిందే .
.
అందుకే వారంతా ముక్తకంఠంతో భరతా నీవు ఉత్తమకులసంజాతుడవు,గొప్ప బుద్ధిమంతుడవు ,మంచి ఆచారము తెలిసిన వాడవు ,గొప్ప కీర్తికలవాడవు ,నీకు నీ తండ్రిపై గౌరవ భావమున్నచో రాముడు చెప్పినట్లుగా చేయి.
.
దశరధుడు కైక ఋణము తీర్చుకున్నందువలననే స్వర్గమునకు వెళ్ళగలిగినాడు.ఇప్పుడు రాముడు వెనుకకు మరలెనా !దశరథునకు అనృతదోషం కలిగి ,
స్వర్గంనుండి నెట్టివేయబడతాడు.
.
భరతుడు గజగజవణికిపోతూ మాటలు తొట్రుపడుతుండగా రామా ! రాజ్యము పాలించే సమర్ధత నాకు లేదయ్యా! అని అన్నాడు.
.
అందరూ నీ కోసమే ఎదురు చూస్తున్నారు.నీవు రావలసినదే అని ప్రార్ధిస్తూ రాముడి కాళ్ళమీద పడ్డాడు.
.
భరతుడిని దగ్గరకు తీసుకొని ! భరతా నీవు సమర్ధుడవు కావని ఎవరన్నారు? నీకు గురు శిక్షణ ,ఉత్తమమైన బుద్ధి వున్నాయి ,బుద్ధిమంతులైన అమాత్యులతో కలిసి ఎంత గొప్ప కార్యాన్నైనా చేయగల సమర్ధుడవు నీవు.
.
నీ తల్లి కైక కోరిక వల్లనో ,ఆశవల్లనో ,నీ కొరకు ఇంత చేసినది. నీవు దానిని మనసులో ఉంచుకొనక ఆవిడను గౌరవించు.
.
రాముడి దృఢసంకల్పానికి భరతుడు తలవొగ్గక తప్పలేదు .
.
బంగరు పాదుకలు రెండు రామునికిచ్చి ఇవి నీవు నీ కాళ్ళతో తాకి నాకు ఇవ్వు! ఈ పాదుకలే ఇక నుండీ రాజ్యమేలుతాయి.
.
అంత రాముడు ఆ పాదుకలను ఒకసారి తొడుగుకొని విడిచి భరతునకు ఇచ్చాడు.
.
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి