2, నవంబర్ 2020, సోమవారం

కనపడుట లేదు

 🌸           *కనపడుట లేదు*           🌸


*మాయమై పోతున్న తెలుగు అమ్మాయి.*


ఏమండి ఈ మద్యన ఎవరైనా మా తెలుగు అమ్మాయిని చూసారా? చూస్తే చెప్పండి. అయ్యా! మీకు పుణ్యం ఉంటుంది.


ఓహో! మా తెలుగు అమ్మాయి గురించి మీకు తెలియదుకదూ! ఆనవాలు చెపుతా, వినండీ.


✔️ మా అమ్మాయి అమాయకంగా ఉంటుంది.


✔️ చేతినిండా గాజులు వేసుకుని లక్ష్మీదేవి లాగ ఉంటుంది.


✔️ రెండు చేతులకూ గోరింటతో *(మెహెంది కాదు),* పాదములకు పారాణితో అందంగా ఉంటుంది.


✔️ మా అమ్మాయి నిండుగా పరికిణి కట్టుకుని ఓణి వేసుకుని ఉంటుంది.


✔️ తలకు చమురు రాసుకుని చక్కగా దువ్వి రొండు జడలు వేసుకుంటుంది.


✔️ తలనిండా పూలు పెట్టుకుని, వాలు జడకు జడ కుప్పులు వేసుకుంటుంది.


✔️ చారడేసి కళ్లకు కాటుక పెట్టుకుని, నుదుటిన పావళా కాసంత చంద్రబింబం లాంటి *ఎఱ్ఱటి కుంకుమ బొట్టు* పెట్టుకుంటుంది (బొట్టు బిళ్ళ కాదు).


✔️ కాళ్లకు మువ్వల అందెలతో *(కాలి పట్టీలు అనకూడదు)* ఘల్లుఘల్లు మంటూ ఇల్లంతా సందడిగా తిరుగుతుంది.


✔️ ముద్దబంతి పువ్వులా, చిదిమి దీపము పెట్టుకునే లాగున, ఇంటికి కళగా ఉంటుంది.


🌸 ఇలాంటి అమ్మాయి మీకేక్కడైనా కనిపించిందా? అగుపించినదా? మాకైతే గత పాతిక సంవత్సారాలుగా కనిపించడం లేదు. పండక్కో, పబ్బానికో, అక్కడ్డక్కడ తళుక్కున మెరిసి మాయమైపోద్ది అంతే !!!


😢

..........


దానికి నేను రాసిన సమాధానం ఇది 👇


ఆమె ఉంది కానీ కనిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగబ్బాయిని వెతుకుతూ వెళ్ళి, ఇంతవరకూ రాలేదు. 

తెలుగబ్బాయి ఎవరా అనా?

ఆనవాళ్ళు చెపుతాను. 


ధైర్యంగా ముందుకు పోయే తత్వం.


ఠీవిగా, పంచె, లాల్చీ, కండువాలతో ఉంటాడు. 


నడిచొచ్చే విష్ణుమూర్తిలా ఉంటాడు. 


కోరమీసంతో, కోటేరు ముక్కుతో ఉంటాడు. 


అందరినీ వరసలు కలిపి, నవ్వుతూ పలకరిస్తుంటాడు.


తెలుగు వారితో తెలుగులోనే మాట్లాడుతుంటాడు. 


చక్కని కుంకుమబొట్టుతో మెరిసిపోతుంటాడు.


తల్లిదండ్రులను అమ్మా నాన్నా అని నోరారా పిలుస్తాడు. అత్తా, మామా,  బాబాయ్ లాంటి భారతీయమైన పిలుపులే వాడుతాడు. అనవసరంగా మ్లేచ్ఛభాష వాడడు. 


అడగకుండానే తోటివారికి తోచిన విధంగా సాయం చేస్తుంటాడు.


చూడటానికి రెండు కళ్ళూ, చెప్పటానికి మాటలూ చాలవు అన్నట్టుగా ఉంటాడు. 


చూసి చాలా కాలమైంది. తననే వెతుకుతూ వెళ్ళి ఉంటుంది తెలుగమ్మాయి. ఒక్కటి మాత్రం నిజం. వస్తే ఎప్పటికైనా వీళ్ళు కలిసే వస్తారు. రావాలనే ఆశిద్దాం.

కామెంట్‌లు లేవు: