2, నవంబర్ 2020, సోమవారం

దొంగలైనా వీరికి శిక్ష లేదుట

 దొంగలైనా వీరికి శిక్ష లేదుట 

(ప్రాచీన శ్లోకాల వెనుక దాగిఉన్న కథల సంపుటి)


రచయిత : డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు 

భోజరాజు తరచుగా రాత్రివేళల్లో మారువేషంలో నగర సంచారం చేసి ప్రజల పరిస్థితిని గమనిస్తూండేవాడు. ఒకనాటి రాత్రి ఆలా సంచారం చేస్తున్నప్పుడు ఒక ఇంట్లో దొంగతనం జరుగుతున్నట్లుగా అనిపించింది. ఆ ఇంటిలోని వారు కొన్నిరోజులుగా ఇంట్లో లేనట్టుంది. దొంగలు తాము దొంగిలించిన సొమ్మును ఊరివెలుపల ఉన్న మామిడి తోటలోకి తీసుకెళ్లి పంచుకుందాం అనుకుంటారు. కానీ ఈ లోపుగానే నగరంలో గస్తీ తిరుగుతున్న రక్షక భటులు చేస్తున్న నగారా ధ్వనులు వినిపించాయి. దాంతో ఆ ఇంటిలోనే కూర్చుని ఆ సొమ్మును పంచుకుందాము అని ఆ ఇద్దరు దొంగలు నిర్ణయించుకుంటారు. కానీ వారు భోజరాజుని గమనించలేదు. వారు మాట్లాడుకునేవి భోజరాజుకి వినిపించసాగాయి. 

"శకుంతా! ఎప్పుడు దొరకనంత డబ్బు ఈరోజు మనకు లభించింది కదా! నీ వాటా సొమ్ముతో ఎం చేయాలి అనుకుంటున్నావు?" అని మరాలుడు అడిగాడు. 

"మరాలా! వేదాలు నాలుగు అనే మాటను ఎప్పుడైనా విన్నావా? ఒక పుస్తకమంటూ లేక ఒక గురువు చెప్తుంటే దాన్ని అలా బుద్ధిలో పెట్టుకుని మననం చేసుకుంటూ రోజు లేచి వల్లెవేసుకుంటూ తన గురువునుండి తానూ, తన నుండి తన శిష్యునికి ... ఇలా పరంపరంగా ఆ విద్యని తెస్తూ ఆ వేద సంపదని లోకం నుండి నిష్క్రమించకుండా శ్రమిస్తున్న వేదపండితులకి ఈ ధనాన్ని పంచుదామనుకుంటున్నాను. ఇంకేదైనా పనిచేస్తే రాగల ఎక్కువ ధనాన్ని దృష్టిలోపెట్టుకోకుండా, తమ జీవితాన్ని ఆ వేదాలకే అంకితం చేసిన ఆ పండితులకు, వారు నష్టపోతున్న ధనాన్ని ఈ విధంగా ఈయడం ధర్మమే అని నా అభిప్రాయం" అన్నాడు శకుంతుడు. 

"శకుంతా! నువ్వన్నది నిజమే కావచ్చు. అయితే నువ్వు సొంతంగా ఆర్జించిన సొమ్ముని దానం చేయడం సరి ఔతుందేమో కానీ, ఇలా తస్కరించిన ద్రవ్యాన్ని ఇవ్వడం ధర్మమౌతుందా? అదీ వేదపండితులకి?" అని సందేహం వెలిబుచ్చాడు మరాలుడు. 

మరాలా!

"దానం భోగో నాశ స్థి స్రో భవంతి గతయో హి విత్తస్య!

యో న దదాతి, న భుంక్తే, తస్య తృతీయా గతి ర్భవతి!!

అంటే, ఏ వ్యక్తయినా ధనాన్ని సంపాదించవలసిందేనట, తన కుటుంబాన్ని నడుపుకోవడానికి మించి ఆర్జించవలసిందేనట. ఆ మిగిలిన ద్రవ్యాన్ని అర్హులైనవారికి దానం చేయాలట. లేదా తానే సక్రమమైన పద్దతిలో అనుభవించాలట. ఈ రెండూ చేయలేని వాని ధనానికి - ఇదిగో! ఈ విధంగానే నష్టం జరుగుతుందట."

"ఈ ఇంటివాడున్నాడే! పిల్లికి బిచ్చం పెట్టడు. ఎక్కడ అదిలిస్తే ఒక అన్నం మెతుకు నేలను పడి కాకి తినిపోతుందో అని కాకిని కూడా ఎంగిలి చేత్తో అదిలించడు. అలాగని తాను అనుభవిస్తాడా! అదీలేదు. త్రోవను పోతుంటే ఎవరైనా వీణ్ణి చూచి 'పాపం బిచ్చం వేద్దాం' అనుకునేలా కనిపిస్తాడు. అందుకే వీని ఇంటికి ముహుర్తాన్ని పెట్టి నిన్ను పిలిచాను."

ఇక "సొంతంగా ఆర్జించి దానం చేస్తే ఫలితం దక్కుతుంది కానీ ఇలా దొంగసొమ్మును దానం చేయడమా?" అన్నావె! విను ఇలాంటి నికృష్టుని ఇంట దొంగతనం చేసేది నా కోసం కాదు. వేదాన్ని ఉద్ధరిస్తున్న వేదపండితులకోసం. దురదృష్టవశాత్తు దొంగగా దొరికితే శిక్ష మాత్రం వారికి కాదు. నేననుభవించడం కోసం. ఈ అపహరించిన ద్రవ్యంలో చిల్లి గవ్వ కూడా నేను తీసుకోను" అన్నాడు శకుంతుడు. 

మరి నువ్వేం చేస్తావు అని శకుంతుడు అడుగగా మారాలుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. 

"మరణం మంగళం యాత్ర దర్శనం పాపనాశనం!

కౌపీనం యాత్ర కౌశేయం సా కాశీ కేన మీయతే?!!

 అంటే, "ఎక్కడైనా ఎవరైనా మరణిస్తే అది అశుభమే కానీ కాశీ లో మరణిస్తే అది పుణ్యప్రదం. అలాగే స్మశానాన్ని ఎక్కడైనా మనం చూస్తే అది అశుభమే కానీ మహాశ్మశానమనే పేరున్న కాశీని చూస్తే అది పాపాలని నశింపచేస్తుంది. ఎక్కడైనా గోచి ధరించిన వ్యక్తి కనిపిస్తే, మనం అతన్ని పేదవాడుగా నిరాదరణ చేస్తాంగానీ, కాశి లో గోచిపెట్టిన ఏ సిద్ద యోగి కనిపించినా అతడు పట్టు పీతాంబరాలు ధరించిన విష్ణువుతోను, అష్టైశ్వర్యాలకి అధిపతి అయినా శివుడు తోను సమానం. అలంటి కాశీ క్షేత్రాన్ని మారె క్షేత్రము పోలేదు."

"నా తల్లిదండ్రులు బాగా వృద్దులు. నేను వారిని కాశికి తీసుకుపోగలిగేంతటి స్థోమతతో లేను. మాకెఱిఁగిన ఒక కుటుంబం కాశీకి పోతోందని తెలిసింది. మా తల్లిదండ్రుల్ని, ఆ కుటుంబాన్ని కాశీకి పంపడానికి ఈ మొత్తం ద్రవ్యాన్ని వినియోగించాలి అనుకుంటున్నాను. ఆ కుటుంబం కూడా కాశీకి వెళ్లగలిగేంతటి స్థోమతలో లేదు. అందుకే ఈ ద్రవ్యాన్ని వినియోగిస్తాను" అన్నాడు. 

ఇదంతా చాటుగా విన్న భోజుడు ఆ ఇంటి యజమాని ఎవరా అని కాసేపు ఆలోచించగా, ఇంటి పన్ను కట్టలేదని పలుమార్లు రాజదండన విధించినట్టుగా జ్ఞాపిక వచ్చింది. ఆ ఇంటి యజమాని మంచి సంపన్నుడే అయినా నిరుపేదల తిరుగుతున్నాడని గ్రహించాడు భోజుడు. ఇదంతా బుద్దితో గమనించి ధర్మకార్యాలు నిమిత్తమై దొంగతనాన్ని చేస్తున్న ఆ ఇద్దరినీ అసలు విచారించనక్కరలేదని నిర్ణయించుకుని అక్కడనుండి వెళ్ళిపోతాడు. 

సద్భుద్ది గల దొంగలుండడం విశేషం అయితే, వారి సద్భుద్ధిని గమనించి శిక్షలేకుండా చేయడం భోజరాజులోని మరొక విశేషం.


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: