2, నవంబర్ 2020, సోమవారం

వెటకారాల దారిలో గోదారి

 వెటకారాల దారిలో గోదారి

(ఎల్లాప్రగడ రామకృష్ణ)


ఒరేయ్‌ అబ్బాయ్‌! అల్లం జీలకర్ర పెసరట్టు చెప్పు... అల్లమ్ముక్కలు నేవళీకంగా తరిగి ధూమాగా వేయించమను..’’

      ‘‘ఆయ్‌! అలాగేనండి...ఉల్లిపాయి ముక్కలు తగిలించొచ్చంటారా?’’

      ‘అలక్కానీయ్‌...కాకపోతే కాస్త లౌక్యంగా జతపడేలా చూడు..’’

      కాలువ గట్టున కాకా హోటల్లో అతిసాధారణంగా వినిపించే పై సంభాషణ ముఖ్యంగా ఆఖరి వాక్యం సరిగ్గా బోధపడిన వారందరికీ ‘ఇది గోదారి జిల్లాల యాస’ అని తెలిసిపోయే ఉంటుంది. ఈ దృశ్యాన్ని కళ్లతో చూసిన వాళ్లకి - పెసరట్టు ఎలాక్కావాలో ఓపిగ్గా విన్నట్టు నటించిన సర్వరు చివరో ‘ఒక పెసరాయ్‌’ అని అరుచుకుంటూ వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగించే ఉంటుంది.

      ‘‘గోదారి జిల్లా వోళ్లు సామాన్యులు కారొరోయ్‌! ఆళ్ల మాటల్లో మమకారం, చమత్కారం, ఎటకారమే కాదు, ఆ మాటకొస్తే కాసింత సూరేకారం కూడా కలగలిసుంటాదని అందరనుకుంటారహే’’ అని గోదారోళ్లే అనేసుకోడం కూడా కద్దు. ఆ ఊసులెలాఉన్నా గోదారి జిల్లావోళ్లు పరమ లౌక్యులన్న అభిప్రాయం లోకంలో ఎందుకో మరి స్థిరపడిపోయింది. సినిమావోళ్లు ఈ మాటని బాగా ప్రచారం చేయడమేకాక ‘ఆళ్లకి ఎకసెక్కాలు, ఎటకారాలు ఎక్కువ’ అనే అభిప్రాయాన్ని లోకం మీద రుద్దేశారు. లౌక్యుడనే మాట ఆంగ్లపదం ‘లిటిగెంటు’కి తెలుగు అర్థంలా కనిపిస్తుంది కాని, ‘లౌకిక జ్ఞానం తెలిసినవాడు’ అనేది ఆ మాటకు నిజమైన అర్థం. నన్నయ్య గారిని ‘లోకజ్ఞుడు’ అని ఏ అర్థంలో అన్నారో అదే అర్థంలో లౌక్యుడనే మాటను గ్రహించాలని గోదారి జిల్లా వాళ్ల నిశ్చితాభిప్రాయం!


వెనకటికి బులుసు పాపయ్యశాస్త్రిగారని గొప్ప వేద విద్వాంసులు ఉండేవారు. ఆయన విద్వత్తును మెచ్చి పిఠాపురం రాజావారు గంగాధర రామరాయణింగారో సందర్భంలో ‘‘అయ్యా! మన ఇలాకాలో మీకు ఎక్కడ ఎంత భూమి కావాలో కోరుకోండి... దానపట్టా రాసిస్తాం’’ అన్నారు. వెంటనే       పాపయ్యశాస్త్రి గారొక ఆశీర్వచనం చేసి, నెలకో పుట్టి భూమి చొప్పున ఇప్పించమని కోరారట. పుట్టి అంటే సుమారు ఎనిమిదెకరాల లెక్క. నెలకు ఎనిమిది ఎకరాల వంతున పన్నెండు నెలలకు పన్నెండెనిమిదులు తొంభైయ్యారు ఎకరాల భూమిని రాజావారు రాసిచ్చేశారు. పాపయ్య శాస్త్రిగారే చక్రం తిప్పారో, లేక వేదపండితుడికిచ్చే దానం కదా అనుకుని ఠాణేదారే కావాలని కొలిపించాడోగాని, గోదావరి లంక భూమి పన్నెండుకు బదులు పద్దెనిమిది పుట్లు శాస్త్రిగారికి దఖలు పడింది. ఈ సంగతి కొన్నాళ్లకి రాజుగారి చెవిని పడింది. ఠాణేదారుని పిలిపించి, కూకలేసి, ఉద్యోగంలోంచి పీకేశారు.

      పాపాయ్యశాస్త్రిగారికి ఈ విషయం చేరింది. ఆయన నేరుగా రాజుగారి దగ్గరకొచ్చి తనకు దానం చేసిన భూమిని తిరిగి తీసేసుకోమని కోరారు. అది రాజుగారికి పెద్ద తలవంపుల వ్యవహారం కనుక శాస్త్రి గారికి నచ్చచెప్పబోయారు. తనెంత చెబితే అంత చెయ్యాలి. ఏం చెబితే అదే చెయ్యాలి! తప్ప ఇలాంటి సొంత పెత్తనాలు గుమాస్తాలకు తగునా? అన్నది రాజావారి వాదన! ఠాణేదారు ఉద్యోగ ధర్మాన్ని అతిక్రమించేడంటాడు రాజు. లేదంటారు శాస్త్రిగారు!

      ‘‘తమరు ఈ భూమిని ఎందుకు ఇప్పించారు?’’

      ‘‘మీరు మహాపండితులు, మీకిస్తే మేం తరిస్తాం కనుక!’’

      ‘‘మేం ఎందులో పండితులం?

      ‘‘వేదశాస్త్రాలన్నింటా మీరు మహాపండితులే’’

      ‘‘వేదశాస్త్రాలనగా ఏ భాష?

      ‘‘గీర్వాణ భాష’’

      ‘‘గీర్వాణులంటే దేవతలు! దేవతలు దేవమానంలో కాక, మనుషుల కొలతల్లో ఎలా కొలిపించుకుంటారు? కాబట్టి ఠాణేదారు లెక్క సరైనదే! గజానికి గజంన్నర చొప్పున సరిపెట్టాడు!’’ అని తేల్చారు శాస్త్రిగారు.

      ఇంకేం అంటాడు రాజుగారు? శాస్త్రిగారిటు భూమీ దక్కించుకున్నారు, అటు ఠాణేదారు ఉద్యోగమూ నిలబెట్టారు. అదీ లౌకిక ప్రజ్ఞ అంటే! లౌక్యుడు కాబట్టే ఠాణేదారును రక్షించగలిగాడాయన. (చెళ్లపిళ్ల వెంకట శాస్త్రిగారి ‘కథలు గాథలూ’లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.)



      ఈ కథ చదివాకా గోదారోళ్లంతా ఇలాంటి లౌక్యులే అని తీర్మానించబోతే - అది చాలా అన్యాయం. మనిషి మనుగడకొక వ్యాకరణాన్ని నిర్దేశించిన గోదావరీతీరాన్ని అది అవమానించడం అవుతుంది. ఈనాటికీ పల్లెల్లో ‘‘చెవిలో చుట్టెట్టుకుంటారు’’ అని లోకం ఎగతాళి చేసే పరమ అమాయక చక్రవర్తులకూ కొరతలేదు. ఓసారేం జరిగిందంటే - మహాకవి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారికి - ఆ ఊరి పేరెందుకులెండి - ఓ గ్రామంలో కనకాభిషేకం తలపెట్టారు. అధ్యక్షులుగా కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ గారిని పిలిస్తే - సభకు ఘనత చేకూరుతుందనితోచి, మొత్తానికి ఎలాగో వారిని ఒప్పించారు. తమ ఊరికి రప్పించారు. తీరాచూస్తే అక్కడ కనకమూ లేదు, అభిషేకమూ లేదు. బుట్టలతో పువ్వులు తెచ్చి నెత్తిన పోశారు. బంగారంతో చేసిన పువ్వులు పదో పరకో లేకుండా వట్టి చేమంతి పూలతో కనకాభిషేకం ఏమిటని విశ్వనాథ వారు విస్తుపోయి, కార్యకర్తలను కూకలేశారు. దాంతో పాపం వాళ్లు తమ అజ్ఞానాన్ని బయట పెట్టారు. కనకాభిషేకమంటే బంగారంతో వ్యవహారమని వారికి నిజంగా తెలియదు. పదం బాగుంది కదా అని ఓ మాట అనేసుకున్నారు. మన నగరాల్లో ‘సమ్‌’ (sum) చిత సత్కారమని చెప్పి ఉచిత సత్కారాలతో సరిపెట్టి, ‘‘చంద్రుడికో నూలుపోగు’’ అంటూ శాలువా కప్పుతారు చూశారా! ఆ బాపతు గడుసుదనం కూడా తెలియని సత్తెకాలం జనం కనుక - విషయం తెలిశాక ఎంతో నొచ్చుకున్నారు. మధునాపంతులవారు వారి నిజాయతీని గ్రహించారు. ‘‘మీరు చేసింది కనకాభిషేకమే’’ అని బాహాటంగా ప్రకటిస్తూ తమ ప్రసంగం ఆరంభించారు. ‘‘మీరంతా ఇంత ఆప్యాయంగా ఆహ్వానించారు ‘కనక’, విశ్వనాథ వారిని సైతం రప్పించారు ‘కనక’, ఇదంతా తెలియకచేసింది ‘కనక’ తీరా తెలిశాక ఇంతగా నొచ్చుకుంటున్నారు ‘కనక’ - ఇన్ని రకాల ‘కనక’లు జతపడ్డాయి ‘కనక’ - నాకు జరిగింది అక్షరాలా కనకాభిషేకమే. లోటేం లేదు.’’ అంటూ ఆ మర్యాదా పురుషోత్తముడు సభను, సన్నివేశాన్ని తేలిక చేశారు. శాస్త్రిగారి అబ్బాయి వెంకటాచలపతి స్వదస్తూరితో ఆ ఊరి పేరుతో సహా ఇచ్చిన సాక్ష్యం నా దగ్గర ఉంది కనక, గోదావరి పల్లెల్లో ఇప్పటికీ అలాంటి అమాయకులున్నారన్నది పచ్చి నిజం కనక, ఒక మహాకవి విషయంలో ఇలాంటి అపచారం చేసే దుర్బుద్ధిగాని, వెటకారం ఆడే కొంటెతనం గాని గోదావరి జిల్లాల్లో ఇంటావంటా లేవు కనక, గోదారోళ్ల పలుకుబళ్లలోని ‘చిలిపికారం’ చెప్పాలి కనక, ఇలా ఈ కనకాభిషేక ఉదంతాన్ని వెల్లడి చేశాను, ఆయ్‌!

      నాగరీకం ముదిరాకా, సాగతీత కాసింత తగ్గింది గాని, మాట తీరును బట్టి పోల్చుకోవాలనుకుంటే - ఒకట్రెండు ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఆలుమగలిద్దరూ విడాకులకోసం కోర్టుకెక్కారు. వారికి ముగ్గురు పిల్లలు, నాక్కావాలంటే, నాక్కావాలని తగవులాట! న్యాయమూర్తి దూరం ఆలోచించి ఓ రాజీ మార్గం సూచించాడు. ‘‘మీరిద్దరూ మరో ఏడాది కాపరం చెయ్యండి ఇంకో బిడ్డ కలిగితే చెరో ఇద్దర్నీ తీసుకోవచ్చు కదా!’’ అన్నాడు. అప్పుడు గనక ఆ అమ్మడు ‘‘కవల పిల్లలు పుట్టుకొస్తేనో’’ అని అడిగిందనుకోండి - ఆ పిల్లది ఏ జిల్లానో గుర్తు పట్టేయొచ్చు. 

      లేదా దారినపోతూ ‘‘బాబు! సుబ్బయ్య గారిల్లెక్కడా? - అని మీరడగ్గానే ‘‘ఎక్కడండి! ఇల్లెక్కడానికి ఆయనకేం పని? పైగా పెద్దవయస్సువాడు’’ అన్న జవాబు ఠక్కున మొహాన తగిలిందంటే - మీరే జిల్లాలో ఉన్నారో తెలిసిపోతుంది. కావాలంటే ఓ పాలిటొచ్చి పలకరించి చూడండి. ఇలా చెప్పుకుంటూ పోతే శానా సంగతులుంటాయి గాని, ఇప్పటికి ఇక్కడితో ఆపేద్దారి.

కామెంట్‌లు లేవు: