సేకరణ 👇
చేసిన కర్మము చెడని పదార్థము..
“అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం
కృత కర్మ క్షయో నాస్తి కల్పకోటి శతైరపి"
“చేసిన కర్మ మంచిదైనా, చెడ్డదైనా దాని ఫలం తప్పక అనుభవించి తీరాలి. చేసిన కర్మ వందకోట్ల కల్పాల కైనా (కల్పం అంటే 432కోట్ల సంవత్సరాలు) అనుభవించనిదే నశించదు " అని ఈ శ్లోకానికి భావం.
ధ్వనికి ప్రతిధ్వని, బింబానికి ప్రతిబింబం, చర్యకు ప్రతి చర్య అన్నట్టుగా మనం ఏ కర్మ చేసినా దాని ఫలం అనుభవించటం నిశ్చయమనేది మన ఆధ్యాత్మిక విశ్వాసం.“శుభేన కర్మణా సౌఖ్యం, దుఃఖం పాపేన కర్మణా " (సత్కర్మల వలన సౌఖ్యం, పాప కర్మల వలన దుఃఖము కలుగుతాయి)అంటుంది శాస్త్రం. దీనితో మానవులకు పాపభీతి ఏర్పడి, చెడు పనులకు దూరంగా ఉండాలన్న ఆలోచన కలుగుతుంది. మంచి పనులపై ఆసక్తి పెరుగుతుంది. ఇది వ్యక్తికీ, వ్యవస్థకూ కూడా భద్రమైన మార్గం.
పురాణగాథల్లో శాపాలు, వరాలు, పూర్వజన్మ వృత్తాంతాలు, తదనంతర జన్మలు ఈ కర్మల వల్లనే సంభవించినట్లు తెలుస్తుంది.“యథా ధేను సహస్రేషు వత్సో విందతి మాతరం, తథా పూర్వ కృతం కర్మ కర్తార మను గచ్ఛతి " ( వేల సంఖ్యలో ఉన్న ఆవుల్లో సైతం లేగదూడ తన తల్లిని ఏవిధంగా వెదకి పట్టు కుంటుందో, అలాగే గతంలో చేయబడిన కర్మలు కర్తను అనుసరిస్తూ ఉంటాయి) అనేది సత్యం.
“యాదృశంవపతే బీజం తాదృశం లభతే ఫలమ్"
(ఎట్టి బీజాన్ని నాటితే అట్టి ఫలం లభిస్తుంది),
“పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ బాధతే"
( పూర్వజన్మలో చేసిన పాపం ప్రకృత జన్మలో వ్యాధి రూపంలో బాధిస్తుంది), “అక్షరద్వయమభ్యస్తం నాస్తి నాస్తీతి యత్పురా, తదిదం దేహి దేహీతి విపరీత ముప స్థితమ్"
(గతంలో నాస్తి, నాస్తి అనే రెండు అక్షరాలు నేర్చిన ఫలం ఇపుడు దేహి, దేహి అనటంగా పరిణమించింది ) మొదలైన సందేశాలు ఈ కర్మసూత్రాన్ని బలపరుస్తాయి.
నిత్యవ్యవహారంలో కూడా“చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవ"అనే వాడుక ఉంది.మన కర్మ ఫలం- మనం నడిస్తే, తానూ నడిచి, మనం కూర్చుంటే తానూ కూర్చొని, మన నీడయే తానై ఉంటుందట. ఎప్పటికైనా తత్ఫలం స్వీకరించక తప్పదు. ఈ స్పృహతో మనం కర్మలను ఆచరించాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి