ॐ వినాయక చవితి శుభాకాంక్షలు
సందేశం 10/11
వినాయకుడు - కంచి పరమాచార్య స్వామి
గాణాపత్యంపై కంచి పరమాచార్య స్వామివారు ఒకసారి,
క్రింది విధంగా సమీక్షిస్తూ భక్తులను అనుగ్రహించారు.
వినాయకుణ్ణి ధారణచేసి మనం కొంచెం యోచిస్తే, ప్రతి చిన్న విషయంలోనూ అయనను గూర్చి మన కొక తత్త్వం నయన పర్వంగా దీపిస్తుంది.
వినాయకునికి మనం కొబ్బరికాయలు కొడతాం. ఎందుకు?
ఒకప్పుడు విఘ్నేశ్వరుడు తండ్రియైన పరమశివుని చూచి, 'నాకు నీ తలను బలిగా ఇవ్వు' అని అడిగాడట.
తలను ఉత్తమాంగం అని అంటారు. మనకున్న వస్తువులో పరమ శ్రేష్ఠమైన వస్తువును త్యాగంచేసి అర్చిస్తే కదా అది భక్తి.
ఈశ్వరుడు త్రయంబకుడు - మూడుకళ్ళవాడు. తన తలకు ఈడైన వస్తువునొకటి ఈశ్వరుడు సృష్టించాడు. ఆ వస్తువే మూడుకళ్ళుకల కొబ్బరికాయ.
"వినాయకునికి మీరు కూడా మూడుకళ్ళ కొబ్బరికాయ కొట్టండి" అని ఈశ్వరుడు అనుగ్రహించినట్లున్నది.
తమిళనాడులో కొబ్బరికాయ జుట్టును పూర్తిగా తీసివేసి ఒక్కవ్రేటులో పగిలేటట్లు కొట్టడం ఒక అలవాటు. దానిని వాళ్ళు "సిదిర్ తేంగాయ్" అని వ్యవహరిస్తారు.
ఒకప్పుడు నేను చాతుర్మస్యదీక్షలో నాగపట్నంలో ఉన్నాను. అక్కడ వినాయకుని ముందు విస్తారంగా కొబ్బరికాయలు కొట్టేవారు. ఆలయం ముందు ఒకటే పిల్లల సందడి. కాయను కొట్టీ కొట్టకముందే పిల్లలు మూగి చెదిరే కొబ్బరిముక్కలకై పోట్లాడుకునేవారు. కొందరు పెద్దలు వారిని గద్దించారు.
"కొబ్బరి ముక్కలను ఏరుకోవద్దని గద్దించారు.
"కొబ్బరి ముక్కలను ఏరుకోవద్దని గద్దించడానికి మీకేవరు అధికారం ఇచ్చారు?" అని పిల్లలు తిరగబడ్డారు .
ఔను, ఆ చిట్టిదైవానికి ఆ చిట్టిపిల్లలే సొంతం అని నాకు అనిపించింది.
కొబ్బరికాయను పగలకొడితే అందులొని నారికేళ జలం లభించినట్లు, అహంకారం అణిగితే ఆత్మానుభూతి కల్గుతుంది.
స్థూలం
గణపతిది స్థూలదేహం. ఆయన నామాలలో స్థూలకాయుడు అన్నదొకటి. ఆయన పర్వతంవలె ఉన్నాడు. కాని అతడేమో చిన్నబిడ్డ.
బిడ్డలకు పుష్టియే అనందం. చిక్కిపోయిన శిశువూ, బొద్దుగా వున్న సన్యాసీ ఒక విరోధాభాసం. వయసు ముదిరే కొద్దీ ఉపవాసం వుండి శరీరాన్నికొంచెం శుష్కింపచేయడం మంచిది.
చిన్న బిడ్డలు ఉపవాసముండనక్కర్లేదు.
వాహనం
గణపతి వాహనం ఎలుక. ఈయన ఎంత స్దూలకాయుడో, అది అంత సూక్ష్మమైన దేహం కలది. ఈయనకు వాహనం వలన వచ్చే గౌరవం ఏమిలేదు.
స్థూలకాయుడైనా, తన వాహనానికి ఏ విధమైన శ్రమా ఉండరాదని, అయన లఘిమాసిద్ధితో బెండువలె తేలికగా ఉంటాడు. అదొక విశేషం.
దంతం
ఒక్కొక్కప్రాణికీ, ఒక్కొక్క విషయంలో ప్రీతి.
చమరీమృగానికి తోక అంటే ప్రీతి.
నెమలికి దాని ఫింఛమే బంగారం.
ఏనుగుకు దంతాలంటే ప్రాణం.
కానీ మన గణపతి మహాభారత రచనా సందర్భంలో తన ప్రాణప్రదమైన దంతాన్ని ఊడబెరికి, దానిని కలంగా చేసుకొని, వ్యాసులవారు గంగా స్రవంతిలా భారతాన్ని కవనం చేస్తుంటే, పద్దెనిమిది పర్వాలు చకచకా వ్రాసిముగించి వేశాడు.
ఆదిదంపతుల ఆనందం
"ఆనందాద్థ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే"
పార్వతీ పరమేశ్వరుల ఆనందార్ణవంలో నుంచి ఉద్భవించిన వీచికలాంటివాడు మన గణపతి.
భండాసుర వధ
శ్రీదేవి సేనలను ప్రతిఘటించడానికి భండాసురుడు ఒక విఘ్నయంత్రాన్ని రణమధ్యంలో స్థాపించాడు.
ఆ సమయంలో లలితాదేవి కామేశ్వరుని చూచి ఆనందంగా ఒక చిరునవ్వు నవ్వింది. ఆ హాసచంద్రికలనుంచి ఒక దేవుడు, మదజలాక్త కుంభస్థలంతో గజానుడై పుట్టాడు. ఆ దేవుడు ఇరువదెనిమిది అక్షరములు మంత్రానికి అధిపతి.
ఆయన భండాసురుని విఘ్నయంత్రాలను క్షణంలో భగ్నంచేసి తల్లికి ఎనలేని సహాయం చేశాడు.
గాణాపత్యులు
గణపతినే ప్రధానమూర్తిగా ఉపాసించేవారిని గాణపత్యులని అంటారు.
గుంజిళ్ళు
వినాయకుని ముందు మనం గుంజిళ్ళు తీస్తాం. సంస్కృతంలో దానిని 'దోర్భి:కర్ణ'మని అంటారు.
దోర్భి: అంటే చేతులు.
కర్ణమంటే చెవులు.
దోర్భి:కర్ణమంటే చేతులతో చేవులని పట్టుకొని గుంజిళ్ళు తీయటం.
ఒకప్పడు మహావిష్ణువు వైకుంఠం నుండి కైలాసానికి వెళ్ళారట. అక్కడ మేనల్లుడైన గణపతి కనపడి ఆయన సుదర్శన చక్రాన్ని లాక్కోని ఎంతవేడినా తిరిగి ఇవ్వలేదట. మహవిష్ణువుకు ఏమి చేయడానికీ తోచక తన రెండు చెవులనూ, నాలుగు చేతులతో పట్టుకొని గుంజిళ్ళు తీశారట.
ఈ విచిత్ర చర్యకు వినాయకుడు దొర్లిదొర్లి నవ్వాడట. చిన్నబిడ్డకదా!సుదర్శన చక్రం విషయం మఱచిపోయాడు! అంతటితో అమ్మయ్యా! అని చక్రం తో బాటు విష్ణువు బయటపడ్డాడట.
విఘ్న నివారకుడు
ఏకార్యం తలపెట్టినా మనం ముందు, విఘ్నేశ్వరుని తృప్తి పరచాలి. ఆయన అనుగ్రహం ఉంటే ,అన్నీ అనుకూలంగా సమాప్తమౌతాయి. అన్నిటికీ ఆది దైవం ఆయనే.
ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరగాలంటే,
విఘ్నేశ్వరుని అనుగ్రహంతో జరగాలంటే,
విఘ్నేశ్వరుని అనుగ్రహం అక్షయంగా ఉండాలి.
అందుకే ఆయనకు,
"యన్నత్వాకృతకృత్యాశు తం నమామి గజాననం" అన్న ప్రశస్తి.
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి