.: *
_అక్షరమే ఆయుధమై..!_*
🙏🙏🙏🙏🙏🙏🙏
*_ఆయన.._*
నడిచే అక్షరాల ఉద్యమం..
కలం యోధుడు..
మాటల మాంత్రికుడు..
*నవయుగ వైతాళికుడు..!*
*వాడుక భాష..*
*గురజాడ గుండెఘోష..*
మనం మాట్లాడే భాషను..
జనం మాట్లాడే భాషను
ప్రశస్తం చేసేందుకు
ఎన్ని పాట్లు...ఆటుపోట్లు..
భాషాచాందసులపై.. ఛందస్సులపై..
చండశాసనులపై తిరుగుబాట్లు..
బుడుగుగా ఉన్ననాడు జట్టుకట్టిన గిడుగుతో కలిసి
ఎన్ని ప్రయత్నాలు..
ఇప్పుడు ఆ భాషే
'గురజాడ'య్యింది..
*_నీ కాలాన్ని..నా కలాన్ని.._*
*మన కలల్ని_*
ఆ గురజాడ అడుగుజాడే
నడిపిస్తోంది..!
*కలానికి ఇంత బలం ఉంటుందా..*
అక్షరాల పేర్పు ఇంతటి మార్పునకు కా"రణం'
కాగలుగుతుందా..
*ఈ ప్రశ్నలకు అప్పారావు*
*రచనలే సమాధానం..*
సాంఘిక దురాచారాలపై
పెన్నే గన్నుగా ఎక్కుపెట్టిన *_ఆయన తెగువ.._*
*_కన్యాశుల్కం నుంచి_* *_విముక్తం_*
*_అయింది మగువ.._*
వేశ్యావృత్తిపైనా పీఠికలు..
బీగాలు వేసుకున్న
నాటి వాటికలు..!
గురజాడ పాత్రలు
ఏ కాలంలోనైనా ఎలాంటి సమాజంలో అయినా
*కళ్ళ ముందు కదిలే*
*సజీవ మూర్తులు...*
ఒక్క గిరీశంలోనే
ఎన్నెన్ని కోణాలు..
అతగాడి మాటలు
రుగ్మతలపై ఎక్కుపెట్టిన బాణాలు...
ప్రతి పాత్రలో ఓ ప్రయోజనం
ఉబ్బితబ్బిబ్బైన జనం..
మధురవాణి..
రామప్పపంతులు..బుచ్చమ్మ
నిజంగా ఉన్నారా..
*ఇప్పటికీ మన మధ్య..*
*కాదనిపిస్తూ మిథ్య..*
ఎన్నో సంస్కరణలకు
*_గురజాడ రచనలేగా తొలిసంధ్య..!_*
*దేశమంటే మట్టికాదోయ్*
*దేశమంటే మనుషులోయ్..*
ఈ గీతమే
భరతజాతి అవగతం
మానవజాతి మనోగతం..
మనిషన్నవాడి ఇంగితం..
మరో జాతీయగీతం..!
సొంతలాభం కొంత మానుకుని
పొరుగువాడికి సాయపడవోయ్..
ఇంతకు మించిన నీతిసూత్రమున్నదా..
జాతికిది వేదమంత్రమే కదా!
ఇలా రాశాడు గనకనే
గురజాడ అప్పారావు ఆరాధ్యుడయ్యాడు సదా!
++++++++++++++++++
_మహాకవి గురజాడ_ _జయంతి..(21.09.1862)_
_సందర్భంగా_
_అక్షర నివాళి.._
_______________________
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
9948546286
[21/09, 21:29] Eck Murali.: నేడు గురజాడ జయంతి
బుచ్చమ్మను అమ్మింది ఎంతకు?
– మహమ్మద్ ఖదీర్‌బాబు
‘ఈ ఊళ్లో నారదుడు వచ్చి పాడితే నాలుగు దమ్మిడీలివ్వరు’ అంటుంది మధురవాణి ‘కన్యాశుల్కం’లో కాసేపు వీణ సాధన చేసి, పక్కన పడేస్తూ.
తెలుగువారి కళాపోషణను గురజాడ అప్పుడే పసిగట్టి ఆ మాట అనిపించినట్టున్నారు. దమ్మిడీ అంటే అరపైసా. నాలుగు దమ్మిడీలు– రెండు పైసలక్కూడా ఆ రోజుల్లో విలువ.
గత కొన్నాళ్లుగా ‘కన్యాశుల్కం’ పారాయణం చేస్తున్నాను. ప్రతిసారీ కొత్తగా ఉంది. ప్రతిసారీ రుచిగా ఉంది. ప్రతిసారీ విభ్రమంగా ఉంది. గురజాడ జీవించి ఉండగా ఆయనతో నేస్తు కట్టినవారు ధన్యులు. నాటకంలోని ప్రతి పాత్రలోని వ్యంగ్యం ఆయనదే కనుక అటువంటి కోత పెట్టే వ్యంగ్యం కలిగినవాడితో ప్రతి సంభాషణ ఎంత రంజుగా ఉండేదో. అయితే– లోక స్వభావాలను కాచి వడబోసిన ఇటువంటి మేధావి, సూక్ష్మగ్రాహి ఎవరినైనా దగ్గరకు రానిచ్చి ఉంటాడా అని మరో సందేహం.
‘కన్యాశుల్కం’లో మాట్లాడాల్సిన విషయాలు చాలా కనిపించాయి. కాని ముందుగా నన్ను ఆకర్షించింది అందులోని ‘ద్రవ్య ప్రస్తావన’. ఈ రోజు మనం నాటకం చదువుతూ అందులో కనిపించే రూపాయలను, పైసలను ఉపేక్షిస్తూ వెళితే కన్యాశుల్కంలో జరిగిన ఆర్థిక లావాదేవీల విశ్వరూపం అర్థం కాదేమో అనిపించింది. అసలు కన్యాశుల్కంలో ‘డబ్బు ప్రస్తావన’ గురించే ఒక పిహెచ్.డి చేయవచ్చు. ఎవరైనా చేశారో లేదో.
‘కన్యాశుల్కం’ కథ జరిగిన కాలం 1890 – 1910 అనుకుందాం. దమ్మిడీలకు కూడా విలువ ఉన్న కాలం అది. మనం నాటకం చదివేటప్పుడు ఈ ‘విలువ’ను గుర్తించాలి.
నాటకంలో రామప్ప పంతులు కొండుభొట్టుకు ‘విచ్చ బేడ’ఇస్తాడు. అంటే 12 పైసలు కావచ్చు.
‘పది అణాలు పెట్టి శేరు కాశీమిఠాయి’ తెమ్మంటాడు గిరీశం. పది అణాలు 60 పైసలు. (ఆ 60 పైసలు నేటి రూ.400 కు సమానం. కిలో స్వీటు కనీసం నాలుగు వందలు).
‘నీ దగ్గర కాపర్సు ఏమైనా ఉన్నాయా’ అంటాడు గిరీశం చుట్టల కోసం. కాపర్స్ అంటే కాణీలు. ఒక కాణి ఒకటిన్నర పైసా. ఆ ఒకటిన్నర పైసాకు చుట్టలు వచ్చేవి. (నేడు ఒక కింగ్ సిగరెట్ రూ.20)
తన కుమార్తెను (అంటే మారువేషంలో ఉన్న శిష్యుణ్ణి) లుబ్ధావధాన్లకు కట్టబెడితే రామప్ప పంతులికి 10 వరహాలు ఇస్తానంటాడు కరటక శాస్త్రి. ఒక వరహా మూడున్నర రూపాయలు. అందుకే రామప్ప పంతులు ‘నేను నలభై యాభై రూపాయల వ్యవహారాల్లో జొరబడను’ అంటాడు.
ఇదే నాటకంలో ‘కాసు’ ప్రస్తావన ఉంది. ‘పెద్ద కాసు’ ప్రస్తావన ఉంది. కరటక శాస్త్రి ‘నేను పది రాపాషాణాలు ఇస్తాను’ అంటాడు. రాపాషాణాలు ఎంతో మరి. పులి మొహరు ప్రస్తావన ఉంది. దాని విలువ ఎంతో.
విషయం ఏమిటంటే 1925 నాటికి మన దేశంలో 10 గ్రాముల బంగారం విలువ 18 రూపాయలని గెజిట్‌లు చెబుతున్నాయి. మరి ‘కన్యాశుల్కం’ కాలంనాటికి 10 గ్రాముల బంగారం 10 రూపాయలు అయి ఉండదా?
ఈ లెక్కన అగ్నిహోత్రావధాన్లు తన కూతురు బుచ్చెమ్మను 1500 రూపాయలకు అమ్మాడంటే నేటి ఎంత మొత్తానికి సమానం? 1500 గ్రాముల బంగారం నేటి లెక్క– సుమారు 75 లక్షలు.
బుచ్చమ్మను అగ్నిహోత్రావధాన్లు అమ్మింది 75 లక్షలకు!
ఆ డబ్బు చాలక ఇదే అగ్నిహోత్రావధాన్లు తన చిన్న కూతురు సుబ్బిని అమ్మజూపింది అక్షరాలా 1800 రూపాయలకు. అంటే దాదాపు 90 లక్షలకు! ఇది భారీ మొత్తం కనుకనే కొనుక్కోదలచిన లుబ్ధావధాన్లు ‘అంత డబ్బు ఏనాడైనా అగ్నిహోత్రావధాన్లు చూశాడా?’ అంటాడు.
ఇంకా గుండెలవిసే విషయం ఏమిటంటే ‘నాకే మధురవాణి వంటి కూతురు ఉంటే మూడు నాలుగు వేలకు అమ్ముకుని సెటిలైపోయేవాణ్ణి’ అంటాడు కరటక శాస్త్రి. అంటే ఏకంగా రెండు మూడు కోట్లకు అమ్మడమే!
కనుక ‘కన్యాశుల్కం’ ఏదో ఆకలికి ఆడపిల్లల్ని అమ్ముకున్న దురాచారం కాదు. కొంతమంది అత్యాశాపరుల భారీ వ్యాపారం. బానిసల వ్యాపారం వలే ఆడపిల్లల వ్యాపారం.‘బాలికా విక్రయం’. గురజాడ ఇది గమనించి ఈ అత్యాశాపరుల వినా తక్కిన అగ్రహారాలను కాస్తయిన గట్టున పడేయడానికి హాస్యాన్ని ఎంచుకుని ఉంటాడు. లేక ఏడవలేక నవ్వి ఉంటాడు. జరిగింది నవ్వులాట విషయం మాత్రం కాదు.
ఇంకోటి గమనించారా? పూటకూళ్లామె నుంచి గిరీశం కొట్టేసిన 20 రూపాయల నేటి విలువ లక్ష రూపాయలు. ఈ లక్ష పట్టుకెళ్లి మధురవాణికి ఇచ్చి ఆమెను ఉంచుకున్నాడు.
అయితే మధురవాణి కూడా ‘విటుణ్ణి’ బట్టి రేటు పెట్టేలా ఉంది. రామప్ప పంతుల దగ్గర ‘నెల జీతం’ (ముప్పై రోజులకు) 200 రూపాయలు ముందే తీసుకుంది. అంటే నేటి విలువ 10 లక్షలు. సరైన ‘కొమ్మ’ దొరకాలే గాని ఆమె నెలకు పది లక్షలు సంపాదించగలదు!
‘కన్యాశుల్కం’ ఆ కాలం ప్రజలకు సంబంధించిన ఆర్థిక దస్తావేజు అనుకుంటే అదే కాలంలో ఇతర వర్గాల జీవనం ఎలా ఉండేది? బేడకూ అర్థకూ బీదా బిక్కీ జనాలు ఎలా అలమటించేవారు? వారి ఆర్థిక లావాదేవీలు ఎట్టివి? అని తెలిపే సాహిత్యం వెతికి బేరీజు వేయడం విమర్శకుల పని. అది జరిగితే ఒక కాలంలో తెలుగువారి అన్ని వర్గాల అర్థిక జీవనం తెలుసుకునే వీలుంటుంది.
కన్యాశుల్కంలో ఎంతో ఉంది. వెతికినంత వాడికి వెతికినంత.
– సెప్టెంబర్ 21, 2023.
పి.ఎస్: 1891లో లెక్చరర్‌గా గురజాడ నెల జీతం 125 రూపాయలు. సరిగ్గా వందేళ్ల తర్వాత 1991లో నేను ఈవెనింగ్ ట్యూషన్ టీచర్‌గా నెలకు 150 రూపాయలకు పని చేశాను. 25 రూపాయలే తేడా!
పి.ఎస్ 2: ‘కన్యాశుల్కం’లో నామౌచిత్యం ఉందా? కన్యలయ్యే వరకూ ఆగి, వివాహం జరిగే పరిస్థితి నాడు లేదు. ‘రజస్వలా ముండని చూస్తూ చూస్తూ యలా పెళ్లాడావురా? మరి నీకు గతులు లేవు‘ అని లుబ్ధావధాన్లు తనను తాను తిట్టుకుంటాడు. ‘మన దేశంలో మెయిడన్సు (సంపర్కం ఎరగని కన్యలు) వుండరోయి. యంతసేపూ లమ్మేకింగ్ విడోజ్కి చెయ్యాలిగాని మరి సాధనాంతరం లేదు’ అని గిరీశం అంటాడు. ఈడేరక ముందే పెళ్లి చేసేస్తారు కనుక ఇది ‘వధువు శుల్కం’.
గమనిక: కన్యాశుల్కం నాటకాన్ని ‘చదువు’ యాప్‌లో చదవొచ్చు. వినొచ్చు. యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ట్రై చేయండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి