*||ఏకాదశి వ్రతం అనగానేమి?||* అసలు ఏకాదశి రోజున ఉపవాస దీక్ష ఎలా చేయాలి? ఏకాదశి రోజున, ఉపవాస దీక్షలో ఉన్నవారు, స్మరించవ లసిన ప్రత్యేకమైన మంత్రము లు ఏమైనా ఉన్నవా? ఇది ఎవరికి ఉద్దేశించబడింది?
సమాధానం:
ఉత్సవములకన్న కొంచెం కఠినమైన నియమాలతో కూడినవి వ్రతములు..... వ్రతము లన్నీ అభీష్ట సిద్ధినిస్తాయి.... వీటిలో ఏకాదశీ వ్రతాలు చాలా శ్రేష్ఠమైనవి....
ఏకాదశీ వ్రతాలు
౧. మనలో ఉత్తమ సంస్కారా లను కలుగచేస్తాయి....
౨. కోరిన కోరికలను సిద్ధింప చేస్తాయి....
౩. ఆత్మోన్నతికి ఉపకరిస్తాయి.....
౪. జన్మాంతలో విష్ణులోకానికి చేరుస్తాయి.....
ఈ ఏకాదశీ వ్రతాలు ప్రతీ నెలలో రెండుసార్లు (శుక్లపక్ష ఏకాదశినాడు, కృష్ణపక్ష ఏకాదశినాడు) వంతున సంవత్సరంలో ఇరవైనాలుగు సార్లు సంభవిస్తాయి....
ప్రతి ఏకాదశికి ఒకపేరు ఉన్నది.... పన్నెండు నెలలలో చైత్రం నుంచి ఫాల్గుణం వరకూ శుక్లపక్షంలొ వచ్చే ఏకాదశుల పేర్లు క్రమంగా –
చైత్రం -కామదా,
వైశాఖం – మోహనీ,
జ్యెష్థం – నిర్జలా,
ఆషాఢం – శయనీ,
శ్రావణం – పుత్రదా,
భాద్రపదం – పద్మా,
ఆశ్వియుజం – పాపాంకుశా,
కార్తికం- ప్రబోధినీ,
మార్గశీర్షం- మోక్షదా,
పుష్యం – పుత్రదా,
మాఘం – జయా,
ఫాల్గుణం – ఆమలకీ – అని పేర్లు
అలాగే – ప్రతినెలలలో కృష్ణపక్ష ఏకదశులపేర్లు క్రమంగా –
చైత్రం -పాపమోచనీ,
వైశాఖం – వరూథినీ,
జ్యెష్థం – అపరా,
ఆషాఢం – యోగినీ,
శ్రావణం – కామికా,
భాద్రపదం -అజా,
ఆశ్వియుజం – ఇందిరా,
కార్తికం- రమా,
మార్గశీర్షం- ఉత్పన్నా,
పుష్యం – సఫలా,
మాఘం – షట్ తిలా,
ఫాల్గుణం – విజయా – అని పేర్లు
ఈ ఏకాదశీ వ్రతములను ముఖ్యంగా యతీంద్రులు, వానప్రస్థులు, గృహస్థులు అందరూ ఆచరించవలెనని ధర్మ శాస్త్రములు బోధిస్తున్నవి.....
ఆషాఢశుక్ల ఏకాదశి నుంచి కార్తికశుక్ల ఏకాదశివరకూ యతీంద్రులు, ధర్మాచార పరాయణులైన గృహస్థులు చాతుర్మాస్య దీక్షను కూడా ఆచరిస్తారు....
ఈ ఏకాదశీ వ్రతాలు ముఖ్యంగా ఉపవాస దీక్షాప్రధానాలు -అందుచేతనే –
ఉపోష్యైకాదశ్యాం నిత్యం పక్షయోరుభయోరపి|
కృత్వా దానం యథాశక్తి కుర్యాచ్చ హరిపూజనమ్||
అని గరుడపురాణం చెబుతున్నది.... కనుక ఉపవాసం, దానములు, హరిపూజ ఇవి ఏకాదశీ వ్రతంలో ముఖ్య విశేషాలుగా గ్రహించదగిన వన్నమాట....
అలాగే ఉపవాస విషయంలో –
ఏకాదశీ సదోపేష్యా పక్షయో: శుక్లకృష్ణయో:
అని సనత్కుమారసంహితా,
ఏకాదశ్యాముపవసేన్నకదాచిదతిక్రమేత్ –
అని కణ్వస్మృతి,
ఏకాదశ్యాం న భుంజీత కదాచిదపి మానవ: –
అని విష్ణుస్మృతి చెబుతున్నవి....
కనుక ఏకాదశీ వ్రతములలో ఉపవాసానికి అంత ప్రాధాన్య మున్నది. ...
ఆశ్రమభేదంలేకుండా మానవులందరూ ఈ వ్రతాన్ని ఆచరించవలెనని విష్ణుస్మృతి చెబుతున్నది....
ఈ ఉపవాసదీక్షలో నిరాహారం గా జలం మాత్రమే తీసుకుని కొందరూ, నిర్జలంగా అంటే నీరుకూడా త్రాగకుండా కొందరూ పాటిస్తూంటారు. ...
ఏకాదశీ తిథిలో ఇలా ఉపవాసం చేసి ద్వాదశితిథి ప్రవేశించగానే విష్ణుపూజనం చేసి విష్ణునైవేద్యాన్ని ఆహారంగా స్వీకరించాలి. ....
అనివేదిత భోజనం చేసేవారు దొంగలతో సమానమని శాస్త్రం చెబుతున్నది. ....
ఇది సంగ్రహంగా ఏకాదశి వ్రత పరిచయం.....
—————————————————————————
ఏకాదశి తిధి రెండు రోజులు ఉన్నప్పుడు ఉపవాసం ఏరోజున చెయ్యాలి ?? చాలా సందర్బాలలో ఏకాదశి తిధి ఒక రోజు సాయంత్రమో లేక మధ్యాహ్నమో వచ్చి తరువాతి రోజు మధ్యాహ్నం వరకు వుండే సమయాలలో ఉపవాసం ఏరోజు చెయ్యాలి మొదటి రోజా లేక రెండోరోజా?
సమాధానం: ధర్మనిర్ణయచంద్రికా –
అరుణోదయవేధోత్ర వేధః సూర్యోదయే తథా |
ఉక్తాద్వౌదశమీవేధౌ వైష్ణవఃస్మార్తయోః క్రమాత్ ||
వైష్ణవులకు అరుణోదయము నకు దశమీ వేధయున్ననూ ...
స్మార్తులకు సూర్యోదయము నకువేధయున్ననూ అట్టి ఏకాదశి ఉపవాసమునకు పనికిరాదు...
భృగుః – సంపూర్ణైకాదశీయత్రప్రభాతే పునరేవసా |
తత్రోపోష్యద్వితీయాత్ పరతో ద్వాదశీయది ||
ఒకరోజు ఏకాదశీ పూర్తిగా నుండి మరునాడు సూర్యోదయమునకు ఏకాదశీ మిగులుండి త్రయోదశినాడు ఉదయం ద్వాదశి మిగులున్న చో ఏకాదశీమిగులున్ననాడే ఉపవాసము చేయాలి
త్రయోదశ్యాం కియన్మాత్రా ద్వాదశీనలభేద్యది |
పూర్వాకార్యా గృహస్థైస్తు యతిభిః చోత్తరా యదా ||
మొదటిరోజు ఏకాదశి పూర్తిగా నుండి మరునాడుమిగులుండి త్రయోదశి నాడు ద్వాదిశి మిగులుకాకున్న, మొదటి రోజు గృహస్థులు, రెండవరోజు సన్యాసులు ఉపవాసము ఉండవలెను. ...
మరింత వివరములకై “ధర్మసింధు”, “ధర్మనిర్ణయచంద్రిక” లను గ్రంథములను పరిశీలించగలరు....
ఏకాదశి నాడు ఉపవాసం ఎందుకు చేయాలి:
శాస్త్రము-శాస్త్ర విజ్ఞానము
శాస్త్రము (పురాణము):
అసలు ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందంటే, మహా విష్ణువులోని స్త్రీ తేజం ‘ముర’ అను రాక్షసిని సంహరించి దేవతలను రక్షిస్తుంది.... ఆ స్త్రీ మూర్తికి విష్ణువు ఏకాదశి అని పేరు పెట్టి, ఆ రోజు ఏకాదశిని పూజించిన వారు వైకుంఠము చేరేదరని వరం యిస్తాడు....
మురని హరించడం వలన శ్రీ హరి ‘మురహర’ లేదా ‘మురహరి’ లేదా ‘మురారి’ అయినాడు....
అంతే కాదు ఈ దినం ఉపవాసం ఉన్నవారికి పుణ్యము లభిస్తుందని హిందువుల నమ్మకము....(దశేంద్రియములను జయించడం కోసమే ఏకాదశి ఉపవాసం)
విష్ణు పురాణం ప్రకారం వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే మిగిలిన ఇరవైమూడు ఏకాదశులు ఉపవాసం చేసినంత ఫలం....
అయితే ఈ ఏకాదశే కాదు ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని చాల మంది భక్తుల నమ్మకం....
ఈ రోజు వైష్ణవ ఆలయాలలో విష్ణు సహస్ర నామ పారాయణం, వేదాన్తిక చర్చలు, పూజలు విశేషంగా చేస్తారు.....
శాస్త్ర విజ్ఞానము:
అదలా ఉంచితే చాంద్రమాన తిథుల ప్రకారం ఏకాదశి పక్షం లో 11 వ రోజు......
ప్రతి నెలలో రెండు సార్లు ఏకాదశి వస్తుంది......
అయితే చాల మంది గమనించే ఉంటారు భూమిపైన, అందు నివసించే మన మనస్సుల మీద చంద్రుని ప్రభావం ఉంది......
ఏకాదశి నుండి మొదలుకొని పౌర్ణమి లేదా అమావాస్య దాటిన ఐదు రోజుల (పంచమి) వరకు క్రమంగా చంద్రుని ప్రభావము మన శరీరములోని ద్రవ పదార్థములు
(ఉదాహరణకు - రక్తము),
మెదడు, జీర్ణ వ్యవస్థల మీద క్రమక్రమంగా అధికము అవుతుంది....
ఈ ప్రభావము పౌర్ణమి నాడు అత్యధికంగా వుంటుంది.....
అందుకే పౌర్ణమి నాడు సముద్ర కెరటాలు మిగిలిన రోజులలో కన్నా ఉవ్వెత్తుగా లేస్తాయి....
అందు వలన పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేయడానికి వెళ్ళే వాళ్ళను వారిస్తారు...
(పౌర్ణమి సముద్ర స్నానాలు విశేషమే!!?)
లేదా చాల జాగ్రత్తగా ఉండాలని చెబుతారు.....
అంతే కాదు, కొందరు మానసిక రోగులకు పున్నమి రాత్రులలో మానసిక రుగ్మతలు విజృంభిస్తాయి. మన వాళ్ళు అంటుంటారు “వీడికి అమావాస్యకు, పున్నమికి పిచ్చి ఎక్కువ అవుతుంటుంది జాగ్రత్త” అని.... నిజానికి ఇదంతా చంద్రుని ప్రభావమే అంటున్నారు శాస్త్రజ్ఞులు....
అయితే ఉపవాసానికి ఏకాదశికి ఏమిటి సంబంధం? ఏకాదశి నాడే ఎందుకు ఉపవాసం చేయాలి? వేరే రోజులలో చేయవచ్చును కదా! దీనికి శాస్త్ర విజ్ఞానము ఇంకొక విశ్లేషణ ఇస్తోంది....
చంద్రుడు 24 గంటలలో 12 డిగ్రీల దూరం ప్రయాణిస్తాడు....
ఈ కాలం ఒక తిథితో సమానం. సూర్యుని నుండి 180 డిగ్రీలు చలించాక పౌర్ణమి వస్తుంది, మరో 180 డిగ్రీలు తిరిగాక అమావాస్య వస్తుంది.....
అయితే ఏకాదశి నాడు (కృష్ణ పక్షం గాని, శుక్ల పక్షం గాని)
సూర్యుడు, చంద్రుడు, భూమి ఒక నిర్నీతమైన అమరికలో ఉంటారు.....
ఈ ఏకాదశి రోజు చంద్రునికి భూమి మీద, ముఖ్యంగా నీటి మీద ఆకర్షణ అతి తక్కువగా ఉంటుంది.... అది మన శరీరంలో ఉండే ద్రవ పదార్ధాల మీద కూడా అతి తక్కువ ప్రభావం ఉంది వాటి ప్రసరణ లేదా చలనం మంద కొడిగా ఉంటుంది..... ఉదాహరణకు - మన ప్రేగులలో ఆహార పదార్ధాలు కూడా అతి నెమ్మదిగా కదులుతాయి.... తత్ఫలితంగా జీర్ణక్రియ మంద గించి మలబద్ధానికి దారి తీస్తుంది.... మలబద్ధకం అనేది అన్ని వ్యాధులకు మూల కారణము... అందువలన ఈ రోజు
(ఏకాదశి రోజు)
ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం వలన మరుసటి రోజుకు ఆంత్ర చలనం క్రమ పద్ధతిలోనికి వచ్చి శరీరం తేలిక పడుతుంది....
ఈ రకమైన చర్య మన ఆరోగ్యానికి మంచిది....
దీని కోసం ఏకాదశి నాడు కేవలం నీరు (అందులో చిటికెడు ఉప్పు, ఒక అర చెంచా నిమ్మ రసం కలిపి) రోజంతా తీసుకోవాలి.....
ఈ విధంగా చేయడం వలన మన జీర్ణ వ్యవస్థ నుండి మలినాలు తొలగించబడి అది చక్కబడు తుంది....
అందు వలన ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే పురాణ శాస్త్రరీత్యా పుణ్యము వస్తుంది, విజ్ఞాన శాస్త రీత్యా ఆరోగ్యకరం గా ఉంటుంది....
** సర్వం శ్రీకృష్ణార్పణమస్తు **
*************************************************************
ముఖ్యంగా ఏకాదశి ఉపవాసం చేసేప్పుడు తినకూడనివి:
ధాన్యం సంబంధించిన అనగా వరి, గోధుమ, జొన్న, రాగులు, సజ్జలు ఇత్యాది వాటితో చేసినవి
పప్పు దినులు అంటే కంది, పెసర, మినప, శనగ, పెసర్లు, బబ్బెర, పుట్నాలు, ఓట్స్ ఇత్యాదివి తీసుకోకూడదు....
ఇక తీసుకునే పదార్థాలు:
పండ్లు , సగ్గుబియ్యం (పాయసంగా కానీ లేద కూరగాయలు వేసుకుని కిచిడీ కానీ చేసుకోవచ్చు , ఆవాలు వాడకూడదు) , పాలు, మజ్జిగ , పెరుగు
ఉప్పు మాత్రం సాధారణంగా వాడేది కాక సైంధవ లవణం లేదా rock salt వాడాలి
ఏకాదశి ఉపవాసం ఆడవారికి ఎక్కువ వంట పని లేకుండా ఆ రోజు ఎక్కువ సమయం భగవద్ధ్యానం, నామ జపం మరియు పురాణ పారాయణం చేయడానికి అవకాశం కల్పించబడింది!! మామూలు రోజుల్లో ఆడవారికి వీలుపడదు కదా!! వంట పనే చాలా పెద్దపని వారికి !! ఇదండీ ఏకాదశి సంగతులు....
*||ఓం నమో నారాయణాయ||*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి