5, జనవరి 2025, ఆదివారం

వేద వాఙ్మయం

 🙏వేద వాఙ్మయం -- వేదాంగములు 🙏

వేదం అంటే ఙ్ఞానం అని అర్థం. బుద్ధి సూక్ష్మతను పెంచుకోవాలంటే వ్యక్తులు వేదాలను ఆశ్రయించాలి. ఇవి కేవలం ఒక మతానికి పరిమితమైనవి కాదు. ఙ్ఞానాభివృద్ధి కోసం ఉద్దేశించిన గ్రంథాలు. భగవంతుడి గురించి ముఖ్యంగా పరమ ఙ్ఞానం గురించి మనిషి తెలుసుకోవాలి. ఎందుకంటే అసంపూర్ణమైన ఇంద్రియాల వల్ల ఇతర ప్రాణులు ఈ ఉత్తమమైన ఙ్ఞానాన్ని గ్రహించలేవు. దేహా పోషణకు అవసరమైన ప్రాథమిక ఙ్ఞానం మాత్రమే అంటే ఆహారం, నిద్ర, భయం, లైంగిక చర్యలకు సంబంధించిన తెలివి మాత్రమే వాటికి ఉంటుంది. వాటికి పైన ఉండే ఙ్ఞానం మానవులకు కావాలి. అది భగవంతుడు, ప్రకృతి మనకు ప్రసాదించిన విశేషమైన వరం. దీనిని ఉపయోగించుకుని మనుషులందరూ ఙ్ఞాన మార్గంలో ముందుకు సాగాలి

వేదములను శ్రుతులు (వినబడినవి) అనీ, ఆమ్నాయములు అనీ అంటారు. "విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను ద్రష్టలు అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్ధం. హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వీటిని శ్రుతులు అని కూడా అంటారు.


వేదాలకు పేర్లు

వేదాలకు (1). శ్రుతి, (2). అనుశ్రవం, (3). త్రయి, (4). సమమ్నాయము, (5). నిగమము, (6). ఆమ్నాయము, (7). స్వాధ్యాయం, (8). ఆగమం, (9). నిగమం అని తొమ్మిది పేర్లున్నాయి.


శ్రుతి - గురువు ఉచ్చరించినదాన్ని విని అదేవిధముగా శిష్యుడు ఉచ్చరిస్తూ నేర్చుకుంటాడు.

అనుశ్రవం - గురువు ఉచ్చరించినదాన్ని సరిగా తిరిగి అదేవిధముగా శిష్యుడు ఉచ్చరిస్తూ ఉంటాడు.

త్రయి - ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదములను కలిపి "త్రయి" అని పేరు.

సమమ్నాయము - ఎల్లప్పుడూ అభ్యసింపబడునవి.

నిగమము - భగవంతుని నిశ్వాస రూపములో బయలు పడేవి. యాస్కుడు నిగమము అని వీటిని వ్యవహరించాడు.

ఆమ్నాయము - ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్చుకోబడే విద్య.

స్వాధ్యాయం - స్వాధ్యాయం అంటే—స్వ అధ్యయనం అంటే మనల్ని మనం విశ్లేషించుకోవడం

ఆగమం - భగవంతుని నిశ్వాస రూపములో బయలు పడేవి.

నిగమం - యాస్కుడు నిగమము అని వ్యవహరించాడు.

వేదాలు సంఖ్య


వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది. ఎవరయినా వేదం నేర్చుకునేవారు చేయాలంటే మొత్తం వేదరాశిని అధ్యయనము చేయాల్సిందే. కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చేసరికి వేదరాశిని అధ్యయనము చేయవలెనంటే బహుకష్టమని ఎక్కువ మంది అంతగా ఉత్సాహము చూపించే వారు కాదు. మొదట కలగలుపుగా ఉన్న వేదరాశి (వేదాలను) ని వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడు. ఈ వేదరాశిని వ్యాసుడు ఋక్కులు అన్నింటిని ఋక్సంహితగాను, యజస్సులు అన్నింటిని యజుస్సంహితగాను, సామలన్నింటినీ సామసంహితగాను విడదీసి అలాగే అథర్వమంత్రాలన్నీ ఒకచోట చేర్చి అథర్వసంహితగా తయారు చేసాడు. కనుకనే ఆయన భగవానుడు వేదవ్యాసుడు అయ్యాడనీ చెబుతారు. అలా నాలుగు వేదాలు మనకు లభించాయి.


ఋగ్వేదము

యజుర్వేదము

సామవేదము

అధర్వణవేదము

వ్యాసుడు అలా వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేవారికి ఉపదేశించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్యపరంపరగా ఈ నాలుగు వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలకూ సంక్రమిస్తూ వచ్చాయి. వేదాలను ఉచ్ఛరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు.

మళ్ళీ ఒక్కొక్క వేదంలోను నాలుగు ఉపవిభాగాలున్నాయి. అవి


మంత్ర సంహిత

బ్రాహ్మణము

ఆరణ్యకము

ఉపనిషత్తులు


మంత్ర సంహిత:

సంహిత" అంటే మంత్రాల సంకలనం. నాలుగు వేదాలకు నాలుగు సంహితలున్నాయి. అసలు వేదం అంటే సంహితా విభాగమే. అంటే మంత్రాల సముదాయం. ఋక్సంహితలోని మంత్రాలను ఋక్కులు అంటారు. యజుర్వేదంలో యజుస్సులు, సామవేదంలో సామాలు, అధర్వవేదంలో అంగిరస్‌లు అనబడే మంత్రాలుంటాయి. యజ్ఞంలో నలుగురు ప్రధాన ఋత్విజులు ఉంటారు. ఋగ్వేద మంత్రాలను పఠించే ఋషిని "హోత" అని, యజుర్మంత్రాలు పఠించే ఋషిని "అధ్వర్యుడు" అని, సామగానం చేసే ఋషిని "ఉద్గాత" అని, అధర్వాంగిరస్సులను పఠించే ఋషిని "బ్రహ్మ" అని అంటారు. ఈ నలుగురూ యజ్ఞ వేదికకు నాలుగు వైపుల ఉంటారు.

వేద సంహితలలో యజుస్సంహితలో మాత్రమే గద్యభాగం ఎక్కువగా ఉంది. ఋక్సంహిత, సామ సంహిత పూర్తిగా గద్యభభాగమే అయినా వాటిని కూడా మంత్రాలలా పఠిస్తారు.[2]

చతుర్వేద సంహితలు

ఋగ్వేద సంహిత దేవతల గుణగణాలను స్తుతిస్తుంది.

యజుర్వేద సంహిత వివిధ యజ్ఞాలను నిర్దేశిస్తుంది.

సామవేద సంహిత దేవతలను ప్రసన్నులను చేసుకొనే గానవిధిని తెలుపుతుంది.

అధర్వవేద సంహిత బ్రహ్మజ్ఞానం సహితంగా అనేకానేక లౌకిక విషయాలను వివరిస్తుంది.

యజుర్వేద సంహితలో మళ్ళీ రెండు భాగాలున్నాయి. (1) వాజసనేయ మాధ్యందిన శుక్ల యజుర్వేద సంహిత (2) కృష్ణ యజుర్వేద తైత్తరీయ సంహిత.


బ్రాహ్మణము:

బ్రాహ్మణాలలో పురాణాలు, తత్వశాస్త్రం, వేదాల ఆచారాలు గురించి వ్యాఖ్యానాలు ఉంటాయి. వేదసంహితలు తదుపరి మహోన్నత స్థానం బ్రాహ్మణాలు కలిగి ఉన్నాయి. ఇవి వేదాలలోని అంతర్భాము. చతుర్వేదాలలోని సంహిత (శ్లోక, మంత్ర) భాగములకు బ్రహ్మ పదాన్ని, వ్యాఖ్యాన రూపంగా ఉన్నదానికి బ్రాహ్మణం అని చెప్పబడు తున్నది. ఈ నాలుగు వేదాలలో గల మంత్రాలను, ఎక్కడెక్కడ, ఏఏ యజ్ఞములకు ఈ మంత్రాలను ఎలా వినియోగించాలి, ఆయా వాటిని అవసరమైన చోట వ్యాఖ్యానిస్తూ ఉన్నటువంటి గ్రంథాలకు బ్రాహ్మణాలు అని అంటారు. బ్రాహ్మణాల గ్రంథాలందు సంహితలలోని శ్లోకాల నిగూఢ అర్థాన్ని చెబుతూ అనేక వివరణలతో పాటుగా, ఉపాఖ్యానలు కూడా తెలియజేస్తాయి

బ్రాహ్మణాలనేవి సంహితలకు వ్యాఖ్యాన రూపాలు. వేద రాశిలో సంహితలు, బ్రాహ్మణాలు వరుసగా ఒకటి, రెండు స్థానములు కాగా అరణ్యకాలు మూడవ స్థానమును పొందినవి. అరణ్యకాలు అంటే అనేకమంది ద్వారా ఈ క్రింది విధముగా అనేక అర్థాలు ప్రతిపాదించబడినవి.

అరణ్యకాలు:

అరణ్యంలో దీక్షతో అధ్యయనము చేసిన గ్రంథాలే అరణ్యకాలు.

గృహస్థాశ్రమము వదలి సన్యాసము లేదా సన్యసించుట వలన అరణ్యాలకు వెళ్ళి ప్రశాంత వాతావరణములో తపదీక్షతో వేదాధ్యయనము చేయటకు కావలసిన గ్రంథాలే అరణ్యకాలు.

కర్మఫలంతో పాటు జ్ఞానం సంపాదించు మేలు కలయిక అరణ్యకాలు.

యజ్ఞాలలోని రహస్యాలను అరణ్యాలలోనే మహర్షులు చర్చించారు.

బ్రాహ్మణములలో ఉండే గృహస్థాశ్రమ కర్మకాండలు, జ్ఞానం మాత్రము ప్రధానముగా ఉండే ఉపనిషత్తు ల మేలు కలయికయే అరణ్యకాలు.

అరణ్యాలలో మాత్రమే ఆచరించవలసినవి కావున అరణ్యకాలు.

వేదాల సారమే అరణ్యకాలు.


ఉపనిషత్తులు:

సంహితలు - మంత్ర భాగం, స్తోత్రాలు, ఆవాహనలు

బ్రాహ్మణాలు - సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు.

అరణ్యకాలు - వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి.

ఉపనిషత్తులు - ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడా అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు. వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదహరించారు.

ఈ విభాగాలలో మొదటి రెండింటిని "కర్మకాండ" అనీ, తరువాతి రెండింటిని "జ్ఞానకాండ" అనీ అంటారు.

వేదముల అర్ధాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఆరు అంగాలను వేదాంగములు అంటారు. వేదాంగాలు ఏవి? అన్న దానికి సమాధానంగా ఉపయోగపడే శ్లోకం ఇది:


శిక్షా వ్యాకరణంఛందో నిరుక్తం జ్యోతిషం తథా

కల్పశ్చేతి షడంగాని వేదస్యాహు ర్మనీషిణః

ఒక్కొక్క వేదాంగాన్ని గురించి క్లుప్తంగా ఇక్కడ వ్రాయబడింది.


శిక్ష: పాణిని శిక్షాశాస్త్రమును రచించెను. ఇది వేదమును ఉచ్ఛరింపవలసిన పద్ధతిని బోధిస్తుంది. వేదములలో స్వరము చాలా ముఖ్యము.

వ్యాకరణము: వ్యాకరణ శాస్త్రమును కూడ సూత్రూపమున పాణినియే రచించెను. ఇందులో 8 అధ్యాయాలున్నాయి. దోషరహితమైన పదప్రయోగమునకు సంబంధించిన నియమాలు అన్నీ ఇందులో చెప్పబడ్డాయి.

ఛందస్సు: పింగళుడు "ఛందోవిచితి" అనే 8 అధ్యాయాల ఛందశ్శాస్త్రమును రచించెను. వేద మంత్రములకు సంబంధించిన ఛందస్సులే కాక లౌకిక ఛందస్సులు కూడా ఇక్కడ చెప్పబడినవి.

నిరుక్తము: నిరుక్త శాస్త్రమునకు కర్త యాస్కుడు. వేదమంత్రములలోని పదముల వ్యుత్పత్తి ఇందులో చెప్పబడింది. పదములన్నీ ధాతువులనుండి పుట్టినవని యాస్కుని అభిప్రాయము.

జ్యోతిషము: వేదాలలో చెప్పిన యజ్ఞాలు చేయడానికి కాలనిర్ణయం చాలా ముఖ్యం. ఆ కాలనియమాలు జ్యోతిషంలో ఉంటాయి. లగదుడు, గర్గుడు మున్నగువారు ఈ జ్యోతిష శాస్త్ర గ్రంథాలను రచించారు.

కల్పము: కల్పశాస్త్రంలో యజ్ఞయాగాదుల విధానము, వాటిలోని భేదాలు చెప్పబడ్డాయి. అశ్వలాయనుడు, సాలంఖ్యాయనుడు ఈ శాస్త్ర సూత్రాలను రచించారు

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: