5, జనవరి 2025, ఆదివారం

*శ్రీమద్ భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

             *(పదవ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*బ్రహ్మ సృష్టి* - *కాల పరిమాణం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడలేనంటూ, తట్టుకోలేనంటూ విదురుడు తీర్థయాత్రలకు తరలిపోయాడు. అప్పుడు అతనికి మైత్రేయ మహాముని సందర్శనభాగ్యం సంభవించింది. ఆ మహర్షి చెప్పగా భగవంతుని తత్త్వాన్ని తెలుసుకోగలిగాడు విదురుడు.*


*బ్రహ్మదేవుని జన్మవృత్తాంతాన్ని కూడా అప్పుడే తెలుసుకున్నాడతను.*


*బ్రహ్మనాలుగు ముఖాల నుండి ప్రధానమైన నాలుగు వేదాలూ ముందు పుట్టాయి. తర్వాత ఉపవేదాలూ, పురాణ ఇతిహాసాలయిన పంచమవేదం పుట్టాయి.*


*బ్రహ్మ తూర్పు ముఖం నుండి ఋగ్వేదం పుట్టింది. దక్షిణ ముఖం నుండి యుజుర్వేదం పుట్టింది. పశ్చిమ ముఖం నుండి సామవేదం పుడితే, ఉత్తర ముఖం నుండి అధర్వణ వేదం పుట్టింది. ఇలాగే ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వవేదం, శిల్పశాస్త్రం తదితరాలు పుట్టాయి. ఊర్ధ్వ రేతస్కులయిన సనకసనందన, సనత్కుమార, సనత్సు జాతులనూ, మునీంద్రులనూ బ్రహ్మే పుట్టించాడు. అయితే వారంతా సృష్టికి తోడ్పడక, మోక్షాన్ని ఆశించి మరలిపోయారు.*


*దాంతో బ్రహ్మ ఆత్మసమానులయిన పదిమంది మానస పుత్రులను పుట్టించాడు. బ్రహ్మ బొటనవేలు నుండి దక్షుడు పుట్టాడు. తొడ నుండి నారదుడు పుట్టాడు. నాభి నుండి పులహుడు పుడితే, కళ్ళ నుండి క్రతువు, ముఖం నుండి అంగిరసుడు, ప్రాణం నుండి వసిష్ఠుడు, హృదయం నుండి మరీచి పుట్టారు. బ్రహ్మ కుడి చేతి నుండి ధర్మం పుడితే, వెన్ను నుండి కర్దమ ప్రజాపతి పుట్టాడు. ఈ కర్దముడే తర్వాత దేవహూతికి భర్త అయినాడు. ఇలా బ్రహ్మ మనస్సు నుండి, శరీరం నుండి ఎందరు పుట్టినా సృష్టి వృద్ధి కాలేదు. ఏం చేయాలో పాలుపోలేదతనికి.*


*అప్పుడు బ్రహ్మ శరీరం రెండు భాగాలుగా చీలిపోయింది. కుడి భాగం నుండి స్వాయంభువ మనువు పురుషుడుగా పుడితే, ఎడమ భాగం నుండి శతరూప స్త్రీగా పుట్టింది. వారిద్దరూ దంపతులయ్యారు. వారు దంపతులు కావడంతో సృష్టి కొనసాగింది.*


*స్వాయంభువ మనువుకూ, శతరూపకూ ఇద్దరు కుమారులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడుతో పాటు ముగ్గురు కుమార్తెలు ఆకూతి, దేవహూతి, ప్రసూతి జన్మించారు.*


*ఆకూతి రుచికుణ్ణి పెళ్ళాడింది. దేవహూతి కర్దముని పెళ్ళాడింది. ప్రసూతి దక్షుణ్ణి పెళ్ళాడింది. ఈ పెళ్ళిళ్ళతో, వారి సంతతితో జగత్తు అంతా నిండిపోయింది.*


*కాలపరిమాణం:~*


*పరమాణువు కంటే చిన్న వస్తువూ, విరాట్టు కంటే పెద్ద వస్తువూ లేవు. సమస్త కార్యాచరణ అంతా పరమాణు సంకల్పమే! పరమాణువులు ఒకటికొకటి కలియడంతోనే చర్య సిద్ధిస్తోంది. కాలపరిమాణానికీ, పరిణామానికీ కూడా పరమాణువులే కారణం.*


*సూర్యగమనంతో ఈ కాలాన్ని విభజిస్తున్నారు. సూర్యుడు ఎంతకాలంలో పరమాణువుని చేరగలుగుతాడో ఆ కాలాన్ని పరమాణువుగా పేర్కొంటున్నారు. కాల పరిమాణంలో స్వల్పమైనది పరమాణుకాలం. ఈ విధంగా సూర్యుడు ద్వాదశరాశులతో తేజరిల్లే భువనాన్ని దాటేందుకు ఎంత కాలం పడుతుందో దాన్ని ‘సంవత్సరం’ అంటున్నారు.*


*ఇలాంటి సంవత్సరాలు అనేకానేకం కలిస్తేనే మన్వంతరాలు ఏర్పడుతున్నాయి. రెండు పరమాణు కాలాల్ని కలిపి ‘అణుకాలం’ అంటున్నారు. మూడు అణువుల కాలాన్ని ‘త్రసరేణువు’ అని పేర్కొంటున్నారు. కిటికీ రంధ్రాల నుంచి ప్రసరించే సూర్యకిరణాల్లో కనిపించి, ఆకాశానికి ఎగసిపోయే పరాగకణమే త్రసరేణువుగా గుర్తించాలి. ఈ త్రసరేణువు ఉన్న ప్రదేశాన్ని సూర్యుడు ఎంత సేపట్లో అతిక్రమిస్తాడో అదే త్రసరేణు కాలం. ఇలాంటి మూడు త్రసరేణు కాలాల్ని కలిపి ఒక ‘త్రుటి’ అంటున్నారు. నూరు త్రుటుల కాలం ఒక ‘వేధ’. మూడు వేధల కాలం ఒక లవం. మూడు లవాల కాలం ఒక నిమేషం. మూడు నిమేషాలు ఒక క్షణం. అయిదు క్షణాలు ఒక కాష్ఠ. పది కాష్ఠలు ఒక లఘువు. పదిహేను లఘువులు ఒక నాడిక. రెండు నాడికలు లేదా రెండు ఘడియలు ఒక ముహూర్తం. ఆరేడు నాడికల కాలాన్ని ‘జాము’ అంటున్నారు.*


*పగటి పరిమాణాన్ని తెలుసుకునేందుకు ఓ సాధనాన్ని కనుగొన్నారు. పన్నెండున్నర పలము(మూడు తులాల బరువు)ల గల రాగిపాత్రను తయారు చెయ్యాలి. నాలుగు మినపగింజల ఎత్తుగల బంగారంతో నాలుగు అంగుళాల పొడవుండే ఒక కణిక తయారు చెయ్యాలి. ఈ కణికతో ఆ రాగిపాత్రకు ఒక రంధ్రం చెయ్యాలి. ఈ రంధ్రం ద్వారా నీరు లోపలికి ప్రవేశిస్తే, పాత్ర ఎంత సేపట్లో నిండుతుందో ఆ కాలాన్ని ఒక ‘నాడిక’ అంటారు. ఈ నాడికకే ‘ఘడియ’ అని మరో పేరు కూడా ఉంది.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం)*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: