☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్రీమద్ భాగవతం*
*(పదవ రోజు)*
*(నిన్నటి భాగం తరువాయి)*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*విదురుడు-మైత్రేయుడు*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*‘‘పరీక్షన్మహారాజా! చావు తప్పదని, చేసేదేమీ లేదని దిగులు పడకు. భక్తి కుదిరితే ముహూర్త కాలం చాలు, మోక్షం లభిస్తుంది.*
*నీకింకా ఏడు రోజులు ఆయుః పరిమాణం ఉంది. సునాయసంగా మోక్షసాధన సమకూర్చుకోగలవు.’’ అన్నాడు శుకుడు. ఆశగా చూశాడు పరీక్షిత్తు.*
*‘‘నా తండ్రి వ్యాసమహర్షి నాకు మాత్రమే ఉపదేశించిన మహాభాగవతం నీకు బోధిస్తాను. విని, శుభపరంపరలు అందుకో.’’ అన్నాడు శుకుడు.పరీక్షిత్తునకు భాగవతాన్ని చెప్పాడు.*
*భక్తియోగం:~*
*భాగవత తత్త్వానికి భక్తియోగమే ప్రధానం. ఇంద్రియాలను జయించి, మనస్సును విషయ వాంఛల వైపునకు పోనీయకుండా జాగ్రత్త వహించాలి. గుర్రాన్ని కళ్ళెంతో పట్టినట్టుగా చెలరేగే భావనలన్నిటినీ నిగ్రహించుకోవాలి. భగవంతుని మీదే మనస్సును లగ్నం చెయ్యాలి. ఉరుకుల పరుగుల నది సముద్ర సంగమంతో శాంతించినట్టుగా మనస్సు ఎక్కడైతే స్థిరపడి శాంతి పొందుతుందో అదే వైకుంఠం.*
*మనస్సు చెదిరితే శ్రీహరి నామ సంకీర్తనంతో దాన్ని నిరోధించాలి. సంకీర్తన ప్రియుడు శ్రీహరి భక్తియోగానికే పట్టుబడతాడు అన్నాడు శుకుడు.*
*ఈ అఖిలాండకోటి బ్రహ్మాండం అంతా విరాట్పురుషుని స్థూలరూపం అన్నాడు. విశ్వం యావత్తూ విష్ణుమయం. బ్రహ్మాదులంతా విష్ణువును ధ్యానించే కృతార్థులయినారు. నారదునికి బ్రహ్మ బోధించిన తత్త్వాన్ని వివరించి, సమస్త లోకాల సృష్టి పరిణామాన్ని కూడా పరీక్షిత్తుకి చెప్పాడు శుకుడు. భగవంతుని అనంతకోటి అవతారాల్లో కృష్ణావతారమే గొప్పదన్నాడు. కాల స్వరూపం, యుగధర్మాల గురించి కూడా చెప్పాడు.*
*విదురుడు-మైత్రేయుడు*
*వ్యాసునికీ-దాసికీ పుట్టిన కుమారుడు విదురుడు. ఇతడు ధృతరాష్ట్రునికి తమ్ముడు. ధర్మమూర్తి యముడు మాండవ్యు ముని శాప కారణంగా భూలోకంలో విదురునిగా జన్మించాడు. ధర్మమూర్తే విదురుడవడంతో అతను నీతికీ, న్యాయానికీ, ధర్మానికీ మారుపేరుగా నిలిచాడు. పాండవులకు కౌరవులు చేసిన అన్యాయాలను నిరసించాడితను. కౌరవుల అన్యాయాల గురించి ధృతరాష్ట్రునికి చెప్పి, ముందే హెచ్చరించాడు. అయినా పాండవులకూ కౌరవులకూ యుద్ధం తప్పలేదు. యుద్ధాన్ని తప్పించడానికి, సంధి కోసం ఎంతగానో ప్రయత్నించాడు. ఫలించలేదు. కురుక్షేత్ర సంగ్రామం మొదలయింది. విదురుడు ఎవరి పక్షానా నిలవలేదు. దాయాదుల మధ్య యుద్ధం చూడలేనంటూ తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు.*
*తిరిగి వచ్చే వేళకి యుద్ధం ముగిసింది. కౌరవలంతా చనిపోయారు. అప్పుడు ధృతరాష్ట్రునికి వైరాగ్యాన్ని బోధించింది విదురుడే! అతన్ని తపోవనానికి పంపింది కూడా విదురుడే! ఉద్దవుని ముఖతః శ్రీకృష్ణ నిర్యాణాన్ని తెలుసుకున్నాడు. ఇక జీవించడం చాలనుకున్నాడు. హిమవత్పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ తనువు చాలించాడు. విదురుడు మహా నీతివేత్త కావడంతో అతను బోధించిన నీతి ‘విదురనీతి’గా ప్రసిద్ధి చెందింది. అందరికీ ప్రమాణమయింది.*
*విదురుడు తీర్థయాత్రలు చేస్తున్న సమయంలోనే అతను, మైత్రేయుడనే మహామునిని సందర్శించాడు. ఆయన చెప్పగా భగవంతుని తత్త్వాన్ని తెలుసుకున్నాడు. ఆత్మజ్ఞానం పొందాడు. యోగులెవరూ తెలుసుకోలేని సంగతులెన్నో విదురునికి మైత్రేయుడు తెలియజేశాడు. బ్రహ్మదేవుని జన్మ వృత్తాంతం, కాల లక్షణం, సృష్టి విధానం... చాలా చెప్పాడతనికి.*
*శ్రీమన్నారాయణుని నాభి కమలం నుండే బ్రహ్మ ఉద్భవించాడు. సమస్త లోకాల్నీ ఏకకాలంలో చూసేందుకు వీలుగా అతనికి నాలుగు ముఖాలు ఏర్పడ్డాయి. అలా ఏర్పడిన నాలుగు ముఖాలతో ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మ. అప్పుడు నారాయణుని అనుగ్రహం పొందాడు. పరమేశ్వర తత్త్వాన్ని తెలుసుకున్నాడు. సమస్త లోకాలనూ, సకల జీవరాసులనూ సృష్టించే శక్తి సామర్థ్యాలు సాధించాడు.*
*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం)*
*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి