5, జనవరి 2025, ఆదివారం

పిల్లలు - పెద్దలు - సభ్యతా - సంప్రదాయము*

 *పిల్లలు - పెద్దలు - సభ్యతా -  సంప్రదాయము*


ఈ రోజుల్లో చాలా మంది తాత, అమ్మమ్మ, నానమ్మ,  తల్లిదండ్రులకు ఒక వేదన కలుగుతుంటుంది. తమ  పిల్లలకు మన సంప్రదాయాల మీద గౌరవం లేదు. వినయం, విధేయత  లాంటివి లేవు. తమ మాట వినడం లేదు అని. ఇలా దిగులుచెందే వారెందరో! దానికి తోడు  'గ్లోబలైజేషన్' పేరుతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నో విలువలు తారుమారౌతున్నాయి. మార్పుని తట్టుకోలేని వారి హృదయం కించిత్తు బాధకి గురౌతోంది.


 కాలంలో వస్తున్న సాంకేతిక పరిణామాల ప్రభావం, దూరాలు తగ్గి దేశాలు సైతం గ్రామాలంత దగ్గర కావడం... ఇలాంటి ఎన్నో నేపథ్యాలలో 'వేగం’ పెరుగుతోంది. ఇది వరకు పాతికేళ్ళు పట్టే మార్పుకి, ఈ రోజు రెండు రోజులు చాలు.

 మార్పుని ఆహ్వానించడం మంచిదే. కానీ ఆ మార్పులు తరతరాల సంస్కృతి విలువలను ధ్వంసం చేసేటంతగా జరగడం ఆహ్వానించదగినది కాదు. ఆధునీకరణను 'పాశ్చాత్యీకరణ'గా భ్రమిస్తున్న యువత మనదైన ఘనతను తెలుసుకోకపోవడం విచారకరమైతే, దానిని ఉపేక్షించడం మరియు తృణీకరిచడం మరీ మరీ దౌర్భాగ్యం.

         

మానవ సంబంధాలు, తరతరాల నుండి సంక్రమిస్తున్న కొన్ని ముఖ్యమైన విలువలు - వీటిని పదిలపరచుకుంటూనే, ఆధునికంగా కూడా ఎంతో ఎదగవచ్చు. అయితే వీటిపై అవగాహన, గౌరవం కలిగించాల్సిన బాధ్యత మాత్రం పెద్దలదే.  దీనికి రెండు పద్ధతులున్నాయి. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ మన సంస్కృతి పట్ల గౌరవం కలిగించే అంశాలను తెలియజేయాలి. ఒక పాఠ్యాంశాల బోధనలా కాకుండా, వారికి పరిసరాలలో కలిసిపోయేలా పరిచయానికి రావాలి. సంస్కృతితో కలిసి జీవింపజేయాలి. ఈ రోజుల్లో పాఠశాలల ద్వారా సంస్కృతి బోధన జరుగుతుందని ఆశించడం పొరపాటే. కేవలం ర్యాంకుల లక్ష్యంగా సాగే పోటీ చదువుల పోరులో *ఈ విలువల పరిరక్షణను విద్యాసంస్థల నుండి ఆశించడం పొరపాటు.* పౌష్టికాహారాన్నిచ్చి పోషించే బాధ్యతతోపాటు, సంస్కృతి - నాగరికతల వివేక సంస్కారాలను పిల్లలకు అలవరచడం కూడా తల్లిదండ్రుల కర్తవ్యమే.

        

 ముఖ్యంగా తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు తల్లిదండ్రులు కూడా గౌరవంగా వాటిని పాటిస్తుండాలి, *పిల్లలకు నేర్పుతూ ఉండాలి* వివిధ సంస్కృతి సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో పిల్లలతో పాటు తాము పాల్గొనడం చేయాలి. వారి ముందు *మంచి పద్ధతులు* కనిపిస్తుంటే అనుకరించడం పిల్లల సహజం.

         

కుటుంబంలోని పెద్దలు ముందు సమన్వయంతో ఉండాలి. భార్యలను చిన్న చూపు చూసే భర్తలు, భర్తలను గద్దించే భార్యలు. అత్త మామలను కించపర్చే కోడళ్ళు, ఈలా సంసారంలో ఎన్నెన్నో అవకతవకలు. *ముందు పెద్దలే  ఇతర పెద్దలపట్ల వినయ విధేయతల్నీ, సంస్కారాన్నీ కనబరుచుతుంటే పిల్లలకీ అది అవగతమవుతుంది*.

         

ప్రధానంగా ‘గౌరవం' కలిగించడం అత్యావశ్యకం. పరిజ్ఞానం కన్నా ముందు 'గౌరవం’ కావాలి. *అన్నీ తెలిస్తేనే గాని చేయను*' అని మొండికేస్తే నష్టపోయేది వారే. ముందు  *పూర్వాచారాలను పాటిస్తూ ఉంటే క్రమేణ అవగాహన మరింత చక్కని అభ్యాసం సిద్ధిస్తుంది*.

 

ఇటువంటి నైతిక విలువలను ఒక తరం తరువాతి తరానికి అందించాలి. ఆస్తినే కాదు, తమదైన ప్రాచీన విలువల్నీ, విద్యలనీ ప్రబోధించాలి' అనే బాధ్యతను పెద్దలు తీసుకోవాలి.


*ప్రస్తుత పరిస్థితి ఎంతగా దిగజారి పోయిందంటే...* *పెద్ద వాళ్ళను పలకరించక పోవడము, రహస్య జీవితాలు, తమ జీవిత దారులను తామే ఎన్నుకోవడం*

*ఇంకా ఇంకా ఎన్నెన్నో*

          

జీవితానికి పనికొచ్చే భౌతిక విద్యలను నేర్చుకోవడంతో పాటు, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ప్రాచీన ధర్మవిద్యలు మొదటి నుండీ నేర్పాలి.  సెలవు రోజుల్లో తీరిక వేళల్లో సంబంధంలేని ఏవో విదేశీభాషల కోసమో, కొత్త కోర్సుల కోసమో పిల్లల్ని పంపిస్తుంటారు, వాటితో పాటు మనదైన ఉత్తమ విలువల్నీ, ప్రాచీన కళల్నీ,  వేదానికి సంబంధించిన విద్యల్నీ కూడా నేర్పించగలగాలి.

    

సూర్యోదయానికి ముందే నిద్రలేవడం, ధ్యానం, యోగాభ్యాసం, ప్రవర్తనా సరళి  ఇంటి పనుల్లో చేయూత, అవసరంలో ఉన్న వారికి సహాకారం..పూర్వ గ్రంథాలలోని విలువలు, విశేషాలు, వాటి కథలు, బోధనలు, నైతికత... ఇలాంటి అభ్యాసాలను బాల్యం నుండి తాము అందించే ప్రయత్నం పెద్దలు చేపట్టాలి. అటువంటి పరిసరాలలో సంచరించేలా చేయాలి. పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది కదా!

          

          

 *విలువల్నీ, ధర్మాన్ని బోధించడం చేత ఆరోగ్యవంతమైన, సత్సంస్కారం కలిగిన ఉత్తమ పౌరులు ఏర్పడతారు*.


 అవినీతి, బాధ్యతా రాహిత్యం వంటివి సమాజంలో తగ్గాలంటే నాటి సంస్కారాలని, నైతికతని బాల్యం నుండే అందించాల్సిన అవసరముంది.


 ముందుగా పెద్దలే వాటి పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ, పిల్లల ముందు పాటిస్తూ, పాటిస్తున్నట్లు కన్పిస్తూ, వాటిపై గౌరవం కలిగిన కుటుంబాల స్నేహసంబంధాలను పిల్లలతో కొనసాగింపజేస్తూ జాగ్రత్తపడడం బాధ్యత.

           

మనదైన ఘనచరిత్ర, కట్టడాలు, పవిత్ర స్థలాలు దేవాలయాలు వాటి పురాణ సాంఘిక నేపథ్యం, చారిత్రక ఔన్నత్యం - ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ బోధించాలి. అదే వారికి వినోదంతో కూడిన విజ్ఞానాన్నీ, విజ్ఞానంతో కూడిన దేశభక్తినీ, సంస్కారాన్నీ ప్రసాదిస్తుంది.


ధన్యవాదములు.


*సేకరణ*

కామెంట్‌లు లేవు: