*28.08.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - మూడవ అధ్యాయము*
*భగవదవతారముల వర్ణన*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*రాజోవాచ*
*3.17 (పదిహేడవ శ్లోకము)*
*యథైతామైశ్వరీం మాయాం దుస్తరామకృతాత్మభిః|*
*తరంత్యంజః స్థూలధియో మహర్ష ఇదముచ్యతామ్॥12262॥*
*నిమి మహారాజు ఇట్లు అనెను* "మహర్షీ! మనోనిగ్రహము లేనివారు భగవంతుని మాయను దాటుట మిక్కిలి కష్టము. కనుక మావంటి సామాన్య మానవులు ఈ మాయనుండి సులభముగా బయటపడు ఉపాయమును గూర్చి తెలుపుము.
*ప్రబుద్ధ ఉవాచ*
*3.18 (పదునెనిమిదవ శ్లోకము)*
*కర్మాణ్యారభమాణానాం దుఃఖహత్యై సుఖాయ చ|*
*పశ్యేత్పాకవిపర్యాసం మిథునీచారిణాం నృణామ్॥12263॥*
*ప్రబుద్ధుడు ఇట్లు వచించెను* "నిమిమహారాజా! మానవులు ఐహికములగు కోరికలలో చిక్కుకొని దుఃఖనివృత్తికై, సుఖప్రాప్తికై వివిధకర్మలను ఆచరించుచుందురు. కాని వాటి పరిణామమున దుఃఖములే మిగులును. మాయనుండి బయటపడుటకు తపనపడుచుండెడి మానవుడు తన కర్మలఫలితముగా కలుగుచున్న విపరీత పరిణామములను చూచి, కామ్యకర్మలనుండి నివృత్తుడు కావలెను.
*3.19 (పందొమ్మిదవ శ్లోకము)*
*నిత్యార్తిదేన విత్తేన దుర్లభేనాత్మమృత్యునా|*
*గృహాపత్యాప్తపశుభిః కా ప్రీతిః సాధితైశ్చలైః॥12264॥*
ధనమువలన నిత్యము దుఃఖమే ప్రాప్తించుచుండును. దానిని సంపాదించుటయు కష్టమే. ఒకవేళ అది ప్రాప్తించినను అది ఆ వ్యక్తికీ మృత్యురూపమే యగును. ఆ ధనమోహములో పడినవాడు ఆ ధనవ్యామోహములోనే తలమునకలై యుండును. అట్లే అనిత్యములైన గృహము, భార్యాపుత్రులు, స్వజనులు, పశువులు మొదలగువాటిని సాధించుకొన్నను (పాందినను) అవన్నీ నశ్వరములే, కనుక వాటివలన కష్టములు మిక్కుటమగును. అప్పుడు అతనికి సుఖశాంతులు శూన్యములు అగును.
*3.20 (ఇరువదియవ శ్లోకము)*
*ఏవం లోకం పరం విద్యాన్నశ్వరం కర్మనిర్మితమ్|*
*సతుల్యాతిశయధ్వంసం యథా మండలవర్తినామ్॥12265॥*
ఈ రీతిగనే సకామకర్మలను అనుష్ఠించుటవలన లభించెడి స్వర్గాది లోకములుగూడ అనిత్యములు, నశ్వరములు. ఈ భూతలమున సామంతరాజులమధ్య పరస్పర స్పర్ధలు ఉన్నట్లే అచ్చటగూడ స్వర్గ వాసుల మధ్య పరస్పర ఈర్ష్యాద్వేష భావములు కొనసాగుచుండును. ఈ విధమైన రాగద్వేషవాతావరణమునందు సుఖశాంతులకు తావెక్కడ? కర్మలఫలములుగా ప్రాప్తించెడి భోగ్యవస్తువులు గూడ పరిమితమైనవే. పుణ్యానుభవము పూర్తియైన పిమ్మట జీవుడు మనుష్యలోకమునకు రాక తప్పదు. మఱల ఇచట జననమరణచక్రములో పరిభ్రమించుట అనివార్యము.
*3.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*
*తస్మాద్గురుం ప్రపద్యేత జిజ్ఞాసుః శ్రేయ ఉత్తమమ్|*
*శాబ్దే పరే చ నిష్ణాతం బ్రహ్మణ్యుపశమాశ్రయమ్॥12266॥*
పరమశ్రేయోమార్గమును తెలిసికొనదలచిన సాధకుడు ఒక ఉత్తమగురువును ఆశ్రయించవలెను. ఆ గురువు వేదపారంగతుడై పరబ్రహ్మానుభవమును గలిగిన తత్త్వజ్ఞానియై, ప్రశాంతచిత్తముగల స్థితప్రజ్ఞుడై యుండవలెను. ఇట్టి గురువును చేరినప్పుడే జిజ్ఞాసువు పరమశ్రేయస్సును పొందగలడు.
*3.22 (ఇరువది రెండవ శ్లోకము)*
*తత్ర భాగవతాన్ ధర్మాన్ శిక్షేద్గుర్వాత్మదైవతః|*
*అమాయయానువృత్త్యా యైస్తుష్యేదాత్మాఽఽత్మదో హరిః॥12267॥*
అట్టి గురువును ఆశ్రయించిన పిదప అతడు ఆ గురువును పరమదైవముగా భావింపవలెను. ఆ మహాత్మునకు నిష్కపటబుద్ధితో సేవలొనర్చి, ఆయననుండి భాగవత ధర్మములను తెలిసికొని ఆచరింపవలెను. అప్పుడు సర్వాంతరాత్మయైన శ్రీహరి ప్రసన్నుడై అనుగ్రహించును.
*తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా|*
*ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః॥* (గీత 4.34)
నీవు తత్త్వమును దర్శించిన జ్ఞానుల కడకేగి, ఆ జ్ఞానమును గ్రహింపుము. వారికి దండప్రణామములాచరించుటవలనను, సేవలొనర్చుటవలనను, కపటము లేకుండ భక్తిశ్రద్ధలతో సముచితరీతిలో ప్రశ్నించుటవలనను, పరమాత్మతత్త్వమును చక్కగానెఱింగిన జ్ఞానులు సంప్రీతులై, నీకు ఆ పరమాత్మతత్త్వజ్ఞానమును ఉపదేశించెదరు.
*3.23 (ఇరువది మూడవ శ్లోకము)*
*సర్వతో మనసోఽసంగమాదౌ సంగం చ సాధుషు|*
*దయాం మైత్రీం ప్రశ్రయం చ భూతేష్వద్ధా యథోచితమ్॥12268॥*
అంతేగాక, అట్టి భక్తునకు పరమాత్ముడు తనను తానే ఇచ్చివేయును. మొట్టమొదట శరీరముపైనను, భార్యాపుత్రాదుల యెడలను, ఆ పైన సర్వమునందును అనాసక్తిని పెంపొందించు కొనవలెను. భగవద్భక్తుల యొక్క, సాధుఫురుషుల యొక్క సాంగత్యము చేయవలెను. సకలప్రాణులయెడ (ముఖ్యముగా దీనులయెడ) దయను, సమానులతో మైత్రిని, ఉత్తముల (పెద్దల) యెడ వినయము యథాయోగ్యముగా, త్రికరణశుద్ధిగా కలిగి యుండవలెను.
*3.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*
*శౌచం తపస్తితిక్షాం చ మౌనం స్వాధ్యాయమార్జవమ్|*
*బ్రహ్మచర్యమహింసాం చ సమత్వం ద్వంద్వసంజ్ఞయోః॥12269॥*
మజ్జలాదులతో (మట్టి, జలము మొదలగువానితో) బాహ్యశౌచము, డాంబికము లేకుండా దైవచింతనము ద్వారా అంతశ్శుద్ధి, తపస్సు (ఉపవాసాది వ్రతములు వర్ణాశ్రమోచిత ధర్మానుష్ఠానము) సహిష్ణుత, మౌనము, వేదాధ్యయనము, ఆర్జవము (త్రికరణశుద్ధి), ఇంద్రియ నిగ్రహము, బ్రహ్మచర్యము, అహింస, శీతోష్ణ, సుఖదుఃఖాది ద్వంద్వములయెడ సమత్వబుద్ధి కలిగియుండుట (ఇవి భాగవత ధర్మములు).
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235g
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి