29, ఆగస్టు 2021, ఆదివారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*399వ నామ మంత్రము* 28.8.2021


*ఓం వ్యక్తాఽవ్యక్త స్వరూపిణ్యై నమః* 


వ్యక్తమూ, అవ్యక్తము రెండూ తానే అయిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *వ్యక్తాఽవ్యక్తస్వరూపిణీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం వ్యక్తాఽవ్యక్త స్వరూపిణ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు సాధకులకు వ్యక్తావ్యక్తస్వరూపిణియైన పరమేశ్వరి కరుణతో భౌతికసంపదలతోబాటు ఆధ్యాత్మిక జ్ఞానసంపదలు కూడా ప్రసాదించును.


జగన్మాత అవ్యక్తమునుండి వ్యక్తమైనది. అనగా సృష్టికి పూర్వము అమ్మవారు అవ్యక్తస్వరూపిణి. సృష్టితో అనంతకోటి జీవులను వ్యక్తముచేయుటకు ముందు తానే వ్యక్తమయినది. అన్నిటికంటె మహతత్త్వము కలిగియుండుటచేత వ్యక్తావ్యక్తమయినది. వ్యక్తమనగా మహత్తత్త్వము అని అర్థము. సృష్టికి పూర్వము అవ్యక్తస్వరూపిణి అయితే, సృష్టిలో ఆ అవ్యక్తము నుండి మహతత్త్వము, తరువాత ఆ మహతత్త్వము నుండి అహంకారము ఉద్భవించాయి. దీనిని బట్టి అమ్మవారు అహంకారరూపురాలు. అలాగే ఆ తల్లి అవ్యక్తస్వరూపురాలు కూడా. అనగా వ్యక్తావ్యక్తస్వరూపములు రెండును ఆ దేవియే. ఇంకోవిధంగా చెప్పాలంటే షడ్భావ వికారములు ఉండుట లేకపోవుట అను రెండుగుణములు గలదని భావము. ఇదే విషయం లింగపురాణంలో "ప్రథమావస్థలో గుణత్రయవిభాగమగును. ద్వితీయావస్థలో పంచమహాభూతములకు సంబంధించిన షడ్భావవికారములు కలుగును. ఈ షడ్భావవికారములు కలుగియుండుటయే వ్యక్తరూపమని యనబడును. ఇవి ఏమియు లేకుండుటయే అవ్యక్తము" . భూతభావ వికారములుగా క్రిందికి జారిపోయిన దానిని క్షరమనియు, అట్లులేనిది అక్షరమనియు చెప్పుటచే శ్రీమాత క్షారాక్షరస్వరూపురాలు. మత్స్యపురాణములో అవ్యక్తమును అక్షరముగాను, వ్యక్తమును క్షరముగాను చెప్పబడినది. 


నృసింహపురాణములో అవ్యక్తమును బిందువుగాను, సమిష్టిగాను, వ్యక్తమును వ్యష్టిగాను వివరింపబడినది. ఇంకను శ్రీమాత ఇరువదిమూడు తత్త్వములును, ప్రకృతియు స్వరూపముగా గలిగినది అని చెప్పబడినది. బ్రహ్మాండ పురాణమందు "ఇరువదిమూడు తత్త్వములను వ్యక్తమనియు, ప్రకృతిని అవ్యక్తమనియు పండితులు చెప్పియున్నారు" అని ఉన్నది. బ్రహ్మ వైవర్తపురాణంలో 1. వ్యక్తము, 2. అవ్యక్తము, 3. వ్యక్తావ్యక్తము అను త్రివిధలింగములు (శివలింగములు) గలవు. ఈ లింగములనే 1. స్వాయంభువ లింగము (తనంత తాను పుట్టినది), 2. బాణలింగము (నదిలో పుట్టినది), 3. శైలలింగము (రాతితో చేయబడినది). ఈ మూడింటిలో రెండవది అయిన బాణలింగము (అవ్యక్తము) మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అలాగే బాణలింగమును పూజించువారు అభివృద్ధిని పొందుదురు. నాశనము ఉండదు. మొదటిది (స్వాయంభువలింగము) ఇహపర సుఖాలను ఇస్తుంది.

 

జగత్తులో అనంతకోటి జీవరాసులు అవ్యక్తముసుండే ఉద్భవించాయి. అదియే మహతత్త్వస్వరూపము. ఇక వ్యక్తము అనేది కార్యరూపము. అవ్యక్తమనేది కారణరూపము. అమ్మవారు కార్యరూపంలోను, కారణరూపంలోనూ కూడా ఉంటుందిగనుక ఆ తల్లి *వ్యక్తాఽవ్యక్తస్వరూపిణీ* యని అనబడినది. 


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం వ్యక్తాఽవ్యక్తస్వరూపిణ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: