29, ఆగస్టు 2021, ఆదివారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*982వ నామ మంత్రము* 28.8.2021


*ఓం యోనిముద్రాయై నమః*


శ్రీచక్రంలోని కేంద్రబిందువు యొక్క వికాసం కొరకు సూచించే యోనిముద్రయే తన స్వరూపంగా గల పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *యోనిముద్రా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం యోనిముద్రాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి ఆత్మానందానుభూతిని ప్రసాదించును.


*దశముద్రా సమారాధ్యా* యను 977వ నామ మంత్రంలో వివరించినట్లు శ్రీచక్రార్చనలో వేయు దశముద్రలలో తొమ్మిదవ ముద్ర అయిన *సర్వయోనిముద్ర* బిందువును ఆచ్ఛాదించి యున్నది. అటువంటి బిందువును ఆచ్ఛాదించిన యోని (త్రికోణచక్రము) స్వరూపముగా జగన్మాత యున్నది. గనుకనే అమ్మవారు *యోనిముద్రా* యని అనబడినది. ఈ యోనిముద్ర దశముద్రలలో ఉత్తమమైన ముద్ర. ఈ యోనిముద్రాప్రదర్శనమువలన శ్రీచక్రార్చనలో సాధకుడు ఉచ్చరించు మంత్రదోషములు నశించును. ఈ దశముద్రలు వేయుక్రమమును కేవలం గురుముఖతా మాత్రమే తెలియనగును. ఈ యోనిముద్రయే సమస్త సృష్టి ఆవిర్భావానికి కారణమయిన మూలప్రకృతి. ఈ యోనిముద్ర మహాత్రికోణాకారంలో ఉంటుంది. శ్రీచక్రార్చనలో అన్ని ఆవరణల అర్చనపూర్తయిన పిదప బిందువు వద్ద నమస్కారం నిమిత్తం యోనిముద్ర ప్రదర్శన చేయడం జరుగుతుంది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం యోనిముద్రాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: