*28.08.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - మూడవ అధ్యాయము*
*భగవదవతారముల వర్ణన*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*3.9 (తొమ్మిదవ శ్లోకము)*
*శతవర్షా హ్యనావృష్టిర్భవిష్యత్యుల్బణా భువి|*
*తత్కాలోపచితోష్ణార్కో లోకాంస్త్రీన్ ప్రతపిష్యతి॥12254॥*
అప్పుడు నూరు సంవత్సరములవరకు భయంకరమైన అనావృష్టి ఏర్పడును. భూతలము అంతయును దుస్సహమైన వేడికి లోనగును. ప్రళయకాల శక్తివలన సూర్యతాపము అధికమై ముల్లోకములను అత్యధికమగ తపింపజేయును.
*3.10 (పదియవ శ్లోకము)*
*పాతాళతలమారభ్య సంకర్షణముఖానలః|*
*దహన్నూర్ధ్వశిఖో విష్వగ్వర్ధతే వాయునేరితః॥12255॥*
ఆ సమయమున సంకర్షణుని (ఆదిశేషుని) ముఖమునుండి ప్రచండమైన అగ్నిజ్వాలలు బయలుదేరును. భయంకరమైన వాయువులు తోడుకాగా ఈ అగ్నిజ్వాలలు మొదట పాతాళలోకమును కాల్చివేయుటకు ఆరంభించును. అవి క్రమముగా ఊర్ధ్వదిశగా చెలరేగి విశ్వమునందు అంతటను వ్యాపించును. ఇదియంతయును భగవంతుని మాయ.
*3.11 (పదకొండవ శ్లోకము)*
*సాంవర్తకో మేఘగణో వర్షతి స్మ శతం సమాః|*
*ధారాభిర్హస్తిహస్తాభిర్లీయతే సలిలే విరాట్॥12256॥*
తీవ్రమైన ఉష్ణముయొక్క పరిణామస్వరూపముగా సంవర్తము లనెడి ప్రళయకాలమేఘములు విజృంభించి, ఏనుగు తొండముల ప్రమాణములో వర్షధారలను క్రుమ్మరించును. అంతట ఈ బ్రహ్మాండము అంతయును జలమయమగును.
*3.12 (పండ్రెండవ శ్లోకము)*
*తతో విరాజముత్సృజ్య వైరాజః పురుషో నృప|*
*అవ్యక్తం విశతే సూక్ష్మం నిరింధన ఇవానలః॥12257॥*
నిమిమహారాజా! ఇంధనము సమాప్తమైనప్ఫుడు అగ్ని తన అవ్యక్తస్వరూపమలో లీనమైయున్నట్లు పరమాత్మ తన విరాట్ బ్రహ్మాండమును త్యజించి, తన సూక్ష్మమైన అవ్యక్తస్వరూపములొ విలీనమైయుండును.
*3.13 (పదమూడవ శ్లోకము)*
*వాయునా హృతగంధా భూః సలిలత్వాయ కల్పతే|*
*సలిలం తద్ధృతరసం జ్యోతిష్ట్వాయోపకల్పతే॥12258॥*
*3.14 (పదునాలుగవ శ్లోకము)*
*హృతరూపం తు తమసా వాయౌ జ్యోతిః ప్రలీయతే|*
*హృతస్పర్శోఽవకాశేన వాయుర్నభసి లీయతే॥12259॥*
*3.15 (పదునైదవ శ్లోకము)*
*కాలాత్మనా హృతగుణం నభ ఆత్మని లీయతే|*
*ఇంద్రియాణి మనో బుద్ధిః సహ వైకారికైర్నృప|*
*ప్రవిశంతి హ్యహంకారం స్వగుణైరహమాత్మని॥12260॥*
ప్రళయకాల సమయమున పృథ్వియొక్క గంధతన్మాత్రను వాయువుహరించును. అప్పుడు పృథ్వి జలములో మునిగిపోవును. అట్లే జలముయొక్క రసతన్మాత్రనుగూడ వాయువు హరించును. అప్పుడు జలము తన కారణమైన అగ్నిలో లీనమగును. అంధకారముద్వారా అగ్నియొక్క రూపతన్మాత్ర వాయువు హరించుటచే జ్యోతి (అగ్నితత్త్వము) వాయువులో లీనమగును. అదే విధముగా వాయువుయొక్క గుణమైన స్పర్శతన్నాత్ర ఆకాశముద్వారా హరింపబడుటచే వాయువు ఆకాశములో లీనమగును. కాలస్వరూపుడైన పరమేశ్వరుడు ఆకాశముయొక్క గుణమైన శబ్దతన్మాత్రను హరించివేయును. అప్పుడు ఆకాశము అహంకారములో లీనమగును. అదే సమయమున ఇంద్రియములు, మనస్సు, బుద్ధి తమ తమ అధిష్ఠానదేవతలతో సహా అహంకారములో లీనమగును. పిదప అహంకారముగూడ తన మూలస్వరూపమైన మహత్తత్త్వములో విలీనమగును.
*3.16 (పదహారవ శ్లోకము)*
*ఏషా మాయా భగవతః సర్గస్థిత్యంతకారిణీ|*
*త్రివర్ణా వర్ణితాస్మాభిః కిం భూయః శ్రోతుమిచ్ఛసి॥12261॥*
సృష్టి, స్థితి, సంహారములను జరుపునట్టి త్రిగుణాత్మకమైన మాయాస్వరూపమును మేము మీకు వివరించితిమి. ఇంకను నీవు ఏమి వినగోరుచున్నావు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235g
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి