29, ఆగస్టు 2021, ఆదివారం

దక్ష యజ్ఞ విధ్వంస

 ప్ర: 'దక్ష యజ్ఞ విధ్వంస' గాథలోని ఆంతర్యం తెలుపగలరు.


జ: అన్నీ కలిసొచ్చినంతకాలం అంతా తన నిర్వాకమేననుకుంటాడు మనిషి. అప్పుడు మర్యాద, మన్ననవంటివేమీ పట్టవు. 


'తాను బ్రహ్మగారి పుత్రుడు, ప్రజాపతి. దేవతలందరూ తన మాట వింటారు. యజ్ఞకర్మలాచరించి కావలసిన ఫలాన్ని తాను పొందగలడు.

మధ్యలో ఈశ్వరుడెవడు? తన కర్మే (పనియే) తనకు ఫలాన్నిస్తుంది. ఈశ్వరుని ప్రస్తావనే తన కక్కర్లేదు' - ఈ అహంకారంతో ఈశ్వరావమానానికే సిద్ధపడ్డాడు దక్షప్రజాపతి.


ఈశ్వరునే కాదని యజ్ఞాన్ని ప్రారంభించాడు.


ద్వేషంతో, దైవాన్ని అవమానించే ఉద్దేశంతో సాగే ఆ యజ్ఞంలో అన్ని వనరులూ సమకూర్చుకున్నాడు. ఎంతైనా ప్రజాపతి కదా!


అసలు - ఈ ప్రజాపతిత్వం ఈశ్వరుని కృపవల్లనే బ్రహ్మ ద్వారా తనకు లభించింది. కానీ అహంకారం అసలు సత్యాన్ని గ్రహించనివ్వదు. కేవలం బాహ్య దృష్టినీ, అలంకారాల ఆడంబరాలనీ వదలలేని భౌతికునికి - పరమాత్ముని పరమార్ధ వేషం అర్థమవుతుందా!


ప్రజాపతి మాట తీసేయలేక దేవతలు యజ్ఞంలో పాల్గొన్నారు. అవమానించడం దక్షుని అసలు ఉద్దేశమైనా, ఏ మానావమానాలూ ఈశ్వరునికి అంటవు. అందుకే ఆయన చలించలేదు. నిర్వికారుడై ఆయన కదలక పోయినా, ఆయన శక్తి చూస్తూ ఊరుకోదు.


అందుకే తాను కదిలివచ్చింది, హెచ్చరించింది.

వినాశకాలం దాపురించిన దక్షునికి ఆ హెచ్చరిక చెవిన పడలేదు. దానితో ప్రకృతి (సతీదేవి) తాను 'దక్షుని పుత్రిక'గా (దాక్షాయణిగా) మనదలచుకోలేదు. శివనిందాపరుని కూతురు అనిపించుకొనే ఇష్టంలేక భౌతిక శరీరాన్ని త్యాగం చేసింది.


అప్పుడు విజృంభించింది ఈశ్వరాగ్రహం. ఏ భౌతిక శక్తులూ, దేవతాశక్తులూ ఈశ్వరాగ్రహాన్ని ఎదుర్కొనలేక పోయాయి. ఆ ఆగ్రహశక్తి వీరభద్రుడు. అందులో అధర్మపరుల్ని శిక్షించే 'వీరత్వం' ఉంది. ధర్మాన్ని రక్షించే 'భద్రత్వం' ఉంది.


వీరభద్రుని వీరావేశం దక్షుని అహంకారపుటజ్ఞానయజ్ఞాన్ని ధ్వంసం చేసింది.


'దక్షత' అంటే సమర్థత. ప్రకృతిని తన శాసనానుగుణంగా నడచుకొనే శక్తి అని (కూతురిగా) భ్రమించాడు. అంతా తన సమర్ధతేనని భ్రమించే భౌతికదృష్టి కలిగి ఉండడమే 'దక్షత'. తనకు, ప్రకృతికీ కూడా శాసకుడొకడున్నాడనే వివేకంలేని అహంకారానికి ప్రతీక అతడు.


సర్వకర్మలకీ బలాన్నిచ్చి, ఫలాన్నిచ్చే పరమేశ్వరుని విస్మరించి, ధర్మపు హద్దుల్ని అతిక్రమిస్తే, ఆ ఈశ్వరుని శక్తి అయిన ప్రకృతి క్షమించదు. అది వీరభద్ర విజృంభణ తాండవానికి వీలు కల్పిస్తుంది. సంక్షోభించిన ప్రకృతి నుంచి సర్వేశ్వరుని రౌద్రం వీరతాండవం చేస్తుంది. దానితో స్వయంసమర్థుడననే మానవాహంకారం మట్టి కరుస్తుంది.


ఈ శాశ్వత సత్య బోధనను దక్షయజ్ఞ విధ్వంసగాథ నుంచి గ్రహించాలి.

కామెంట్‌లు లేవు: