29, ఆగస్టు 2021, ఆదివారం

సంస్కృత మహాభాగవతం*

 *29.08.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - మూడవ అధ్యాయము*


*భగవదవతారముల వర్ణన*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*3.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*సర్వత్రాత్మేశ్వరాన్వీక్షాం కైవల్యమనికేతతామ్|*


*వివిక్తచీరవసనం సంతోషం యేన కేనచిత్॥12270॥*


*3.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

 

*శ్రద్ధాం భాగవతే శాస్త్రేఽనిందామన్యత్ర చాపి హి|*


*మనో వాక్కర్మదండం చ సత్యం శమదమావపి॥12271॥*


చేతనాచేతనములయందు పరమాత్మభావమును కలిగియుండుట, ఏకాంతముగా పవిత్రప్రదేశమునందు ఉండుట, ఇండ్లువాకిండ్లయెడ మమకారము లేకుండుట, పవిత్రమైన శుభ్రవస్త్రములను ధరించుట (సన్న్యాసియైనచో వల్కలములను ధరించుట) లభించినదానితో సంతుష్టిచెందుట, భగవత్స్వరూప గుణములను ప్రతిపాదించు శాస్త్రములయందు శ్రద్ధ కలిగియుండుట, అన్యశాస్త్రములను (అన్యదైవములను) నిందింపకుండుట, మనస్సు, వాక్కు, శరీరములకు సంబంధించిన కర్మలనిగ్రహము (ప్రాణాయామముల ద్వారా మనస్సును, మౌనమువలన వాక్కును, ఉపవాసాది వ్రతములచేత శరీరమును నిగ్రహించుట), సత్యభాషణము, మనశ్శాంతిని కలిగియుండుట, అంతఃకరణ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము అనునవి భాగవత ధర్మములు.


*3.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*శ్రవణం కీర్తనం ధ్యానం హరేరద్భుతకర్మణః|*


*జన్మకర్మగుణానాం చ తదర్థేఽఖిలచేష్టితమ్॥12272॥*


*3.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*ఇష్టం దత్తం తపో జప్తం వృత్తం యచ్చాత్మనః ప్రియమ్|*


*దారాన్ సుతాన్ గృహాన్ ప్రాణాన్ యత్పరస్మై నివేదనమ్॥12273॥*


అద్భుతలీలలను ప్రదర్శించిన శ్రీహరియొక్క అవతారములను గూర్చియు, ఘనకార్యములను గుఱించియు, దివ్యగుణములను గూర్చియు వినుట, కీర్తించుట, ధ్యానించుట మఱియు అన్నివిధములుగా ఆ స్వామినే సేవించుట సత్కర్మలను నెఱపుట, యజ్ఞయాగాదులను, జపములను, దానధర్మములను, కర్మలను, ఇంకను తనకు ఇష్టమైన పదార్థములను , అట్లే దారాపుత్రాదులను, గృహములను, కడకు ప్రాణములను సైతము భగవత్సేవలకై అంకితము చేయవలెను.


*3.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*ఏవం కృష్ణాత్మనాథేషు మనుష్యేషు చ సౌహృదమ్|*


*పరిచర్యాం చోభయత్ర మహత్సు నృషు సాధుషు॥12274॥*


*3.30 (ముప్పదియవ శ్లోకము)*


*పరస్పరానుకథనం పావనం భగవద్యశః|*


*మిథో రతిర్మిథస్తుష్టిర్నివృత్తిర్మిథ ఆత్మనః॥12275॥*


సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణుని తమ ఆత్మగా, స్వామిగా భావించెడి సత్పురుషులను శ్రద్ధగా సేవించుట, ఇతర మానవులకును సేవలు చేయుట, వారికిని నిష్కామభావ పూర్వకముగా భక్తిశ్రద్ధలతో సేవలొనర్చుట, పవిత్రమైన భగవద్వైభవమును గూర్చి పరస్పరము సంభాషించుకొనుట, అట్లే సాధకులయెడ అనురాగమును కలిగియుండుట, సాధుపురుషులతో సమావేశమగుచు పరస్పరము ఆదరాభిమానములను కలిగియుండుట, నిత్యసంతుష్టులై యుండుట, సాంసారిక విషయములనుండి నివృత్తులై పరస్పరము ఆధ్యాత్మిక శాంతిని అనుభవించుట అనునవి భాగవతధర్మములు.


*3.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*స్మరంతః స్మారయంతశ్చ మిథోఽఘౌఘహరం హరిమ్|*


*భక్త్యా సంజాతయా భక్త్యా బిభ్రత్యుత్పులకాం తనుమ్॥12276॥*


శ్రీకృష్ణుడు తనను సేవించిన మానవులయొక్క పాపరాసులను భస్మమొనర్చును. కనుక ఆ స్వామిని సంతతము స్మరించుచుండవలెను, ఒకచోటగూడి సామూహికముగా కీర్తించుచుండవలెను. ఈ విధముగా సాధనభక్తిని అనుష్ఠించుచుండుటవలన ఆయనయెడ అనన్యభక్తి ఏర్పడును. అట్లు పారవశ్యముతో సేవించినవారు, పులకాంకితులగుదురు.


*3.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*క్వచిద్రుదంత్యచ్యుతచింతయా క్వచిద్ధసంతి నందంతి వదంత్యలౌకికాః|*


*నృత్యంతి గాయంత్యనుశీలయంత్యజం భవంతి తూష్ణీం పరమేత్య నిర్వృతాః॥12277॥*


భక్తులు ఒక్కొక్కప్పుడు భగవత్సాక్షాత్కారమునకై విలపించుచుందురు. ఆ పరమేశ్వరుని చింతలో పరవశించిపోవుచు నవ్వుచుందురు. అప్పుడప్పుడు పరమానందభరితులగుచుందురు. లోకోత్తరమైన భావమునందు తేలియాడుచు భగవంతునితో సంభాషించెదరు. ఆ పరమాత్ముని లీలలను అనుసరించి ఆడుచుండెదరు, పాడుచుండెదరు. ఆ పరమపురుషునిలో లీనమై, బాహ్యప్రపంచమునే మరచి, మౌనముగా ఉండిపోవుదురు. ఇవి యన్నియును భాగవతధర్మములు.


*29.08.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - మూడవ అధ్యాయము*


*భగవదవతారముల వర్ణన*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*3.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*ఇతి భాగవతాన్ ధర్మాన్ శిక్షన్ భక్త్యా తదుత్థయా|*


*నారాయణపరో మాయామంజస్తరతి దుస్తరామ్॥12278॥*


భక్తులు ఈ విధముగా భాగవత ధర్మములను ఆచరించుటవలన భక్తి ఏర్పడును. తద్ద్వారా వారు శ్రీమన్నారాయణుని ఆరాధనలో నిమగ్నులై తత్పరాయణు లగుదురు. భక్తిప్రభావమువలన వారు దుస్తరమైన మాయను అవలీలగా దాటుదురు. ఇదియే భగవద్భక్తి మహిమ.


*రాజోవాచ*


*3.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*నారాయణాభిధానస్య బ్రహ్మణః పరమాత్మనః|*


*నిష్ఠామర్హథ నో వక్తుం యూయం హి బ్రహ్మవిత్తమాః॥12279॥*

హహహజ

*నిమి మహారాజు ఇట్లు నుడివెను* మహర్షులరా! పరమాత్మయొక్క యదార్థస్వరూపమును ఎరిగినవారిలో (బ్రహ్మవేత్తలలో) మీరు సర్వ శ్రేష్ఠులు. కనుక పరమపురుషుడైన శ్రీమన్నారాయణునియొక్క నిశ్చయ స్వరూపమును గూర్చి దయతో విశదపఱుచుడు.


*పిప్పలాయన ఉవాచ*


*3.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*స్థిత్యుద్భవప్రలయహేతురహేతురస్య యత్స్వప్నజాగరసుషుప్తిషు3 సద్బహిశ్చ|*


*దేహేంద్రియాసుహృదయాని చరంతి యేన సంజీవితాని తదవేహి పరం నరేంద్ర॥12280॥*


*అంతట ఐదవ యోగీశ్వరుడైన పిప్పలాయనుడు ఇట్లు పలికెను* "నిమి మహారాజా! శ్రీమన్నారాయణుడు ఈ విశ్వముయొక్క సృష్టి, స్దితి, లయములకు కారణుడు. (నిమిత్తకారణము, ఉపాదానకారణము అతడే. కానీ ఆయనకు ఎట్టి కారణము లేదు). ప్రాణులయొక్క జాగ్రత్స్వప్నసుషుప్త్యవస్థలలో ఉండి, బాహ్యమున కూడా ఉండును *(అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యనారాయణః స్థితః)*. ఆ స్వామి కారణముగనే ప్రాణియొక్క దేహము, ఇంద్రియములు, ప్రాణములు, మనస్సు చైతన్య వంతము లగుటయేగాక అవి తమ తమ కార్యములను నిర్వహించును. అట్టి పరమ సత్య వస్తువునే నారాయణునిగా నీవు ఎరుగుము.


*3.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*నైతన్మనో విశతి వాగుత చక్షురాత్మా ప్రాణేంద్రియాణి చ యథానలమర్చిషః స్వాః|*


*శబ్దోఽపి బోధకనిషేధతయాఽఽత్మమూలమర్థోక్తమాహ యదృతే న నిషేధసిద్ధిః॥12281॥*


వాక్కు మొదలగు కర్మేంద్రియములకు, చక్షురాది జ్ఞానేంద్రియములకు, ప్రాణములకు, అంతఃకరణములకు ఆ స్వామియే ఆధారమైనను, అగ్నిజ్వాలలు తమకు ఆధారమైన అగ్నినిగూర్చి వర్ణింపలేనట్లు, అవి ఆ పరమాత్మను గురుంచి వివరింపజాలవు. వేదములకు కారణము ఆ పరమాత్మ తత్త్వమేయైనను, అవి ఆ సర్వేశ్వరునిగూర్చి *నేతి-నేతి* అను నిషిద్ధవచనములద్వారానే నిరూపణ చేయును. అట్టి నిషేదసిద్ధకి గూడ పరమాత్మయే కారణము. అన్నింటినీ నిషేధించుచు పోగాపోగా మిగిలిన తత్త్వమే నారాయణుడు.


*3.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*సత్త్వం రజస్తమ ఇతి త్రివృదేకమాదౌ సూత్రం మహానహమితి ప్రవదంతి జీవమ్|*


*జ్ఞానక్రియార్థఫలరూపతయోరుశక్తి బ్రహ్మైవ భాతి సదసచ్చ తయోః పరం యత్॥12282॥*


సృష్ట్యాదియందు ఉన్నది పరబ్రహ్మ మాత్రమే. దానినుండి సత్త్వము, రజస్సు, తమస్సులనెడి త్రిగుణములతోగూడిన మూలప్రకృతి ఉద్భవించెను. ఆ ప్రకృతియందు ఏర్పడిన సంక్షోభకారణముగా మహత్తత్త్వము ఉత్పన్నమాయెను. దానినుండి సూత్రాత్ముడైన హిరణ్యగర్భుని ఉత్పత్తి జరిగెను. ఈ సూత్రాత్మ నుండి జీవులకు ఉపాధియగు (కార్యరూపమైన) అహంకారము, మనస్సు, ఇంద్రియములయొక్క అధిష్ఠానదేవతలు, ప్రాణములు, ఇంద్రియములు, అట్లే శబ్ధాది విషయములు ఉత్పన్నములయ్యెను. ఆ పరమాత్మయే జీవరూపముగా ఈ తత్త్వములన్నింటిలో ప్రవేశించెను. ఈ విధముగా అన్ని రూపములలోను అనంతశక్తి స్వరూపుడై ఆ పరమాత్మ యొక్కడే ప్రకాశించుచున్నాడు. సత్తు - అసత్తులయందు అనగా కార్యకారణములయందు ఆ పరబ్రహ్మయొక్కడే కలడు. ఐనను అతడు ఈ అన్ని తత్త్వములకంటెను అతీతుడు. అతడే శ్రీమన్నారాయణుడు.


*3.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*నాత్మా జజాన న మరిష్యతి నైధతేఽసౌ న క్షీయతే సవనవిద్వ్యభిచారిణాం హి|*


*సర్వత్ర శశ్వదనపాయ్యుపలబ్ధిమాత్రం ప్రాణో యథేంద్రియబలేన వికల్పితం సత్॥12283॥*


పరబ్రహ్మస్వరూపమైన ఈ ఆత్మ ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము - అను షడ్వికారములు లేనిది. పరివర్తన శీలములైన వస్తువులయొక్క భూత, భవిష్యద్వర్తమానములను, వాటి (ఆ వస్తువులయొక్క) అవస్థా భేదములను ఆ ఆత్మ ఎరుంగును. అది సర్వవ్యాపి, శాశ్వతమైనది, అవినాశి, జ్ఞానస్వరూపమైనది. ప్రాణము ఒక్కటేయైనను, అది స్థానభేదములవలన పెక్కుపేర్లను కలిగియున్నట్లు ఒకే జ్ఞానము ఇంద్రియములభేదకారణముగా వేర్వేఱు పేర్లతో (చూచుట, వినుట, ఆఘ్రాణించుట మొదలగు క్రియానామములతో) వ్యవహరింపబడుచున్నది. అదే విధముగా ఒకే ఆత్మయొక్క ఉనికి వివిధములుగా (వివిధప్రాణులుగా) పేర్కొనబడుచున్నది.


*3.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*


*అండేషు పేశిషు తరుష్వవినిశ్చితేషు ప్రాణో హి జీవముపధావతి తత్ర తత్ర|*


*సన్నే యదింద్రియగణేఽహమి చ ప్రసుప్తే కూటస్థ ఆశయమృతే తదనుస్మృతిర్నః॥12284॥*


జీవులు, అండజములు (పక్షులు, సర్పముల మొదలగునవి), జరాయుజములు (మనుష్యులు, పశువులు), స్వేదజములు (క్రీమికీటకాదులు), ఉద్భిజములు (వృక్షములు) అని నాలుగు విధములు. ప్రాణము ఈ సకలజీవులను అంటిపెట్టుకొనియే యుండును. జీవుడు ప్రగాఢనిద్రలో ఉన్నప్పుడు ఇంద్రియములు, అహంకారము గూడ నిశ్చేష్టములై యుండును. అందువలననే నిద్రనుండి లేచిన పిదప జీవుడు 'నేను గాఢనిద్రలో ఉంటిని' అను స్మృతిని కలిగియుండును. ఈ స్మృతియే సుషుప్త్యవస్థ యందు ఆత్మయొక్క ఉనికిని నిరూపించును.


*3.40 (నలుబదియవ శ్లోకము)*


*యర్హ్యబ్జనాభచరణైషణయోరుభక్త్యా చేతోమలాని విధమేద్గుణకర్మజాని|*


*తస్మిన్ విశుద్ధ ఉపలభ్యత ఆత్మతత్త్వం సాక్షాద్యథామలదృశోః సవితృప్రకాశః॥12285॥*


శ్రీమన్నారాయణుని పాదపద్మముల యందు తీవ్రమైన (నిశ్చలమై) భక్తి కలిగియున్నప్పుడు, ఆ భక్తియే గుణకర్మలనుండి ఉత్పన్నమైన చిత్తజదోషములను అనగా మలవిక్షేప ఆవరణదోషములను ప్రక్షాళన మొనర్చును. ఈ విధముగా చిత్తము పరిశుద్ధమైనప్ఫుడు నిర్మలమైన దృష్టికి సూర్యునివలె ఆత్మతత్త్వము స్వయముగా సాక్షాత్కారమగును" అని ఐదవ యోగీశ్వరుడైన పిప్పలాయనుడు అనెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g


కామెంట్‌లు లేవు: