29, ఆగస్టు 2021, ఆదివారం

సంస్కృత మహాభాగవతం*

 *27.08.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - మూడవ అధ్యాయము*


*భగవదవతారముల వర్ణన*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*రాజోవాచ*


*3.1 (ఫ్రథమ శ్లోకము)*


*పరస్య విష్ణోరీశస్య మాయినామపి మోహినీమ్|*


*మాయాం వేదితుమిచ్ఛామో భగవంతో బ్రువంతు నః॥12246॥*


*నిమి మహారాజు నుడివెను* "మహాత్మా! 'ఈ జగత్తంతయును విష్ణుమాయయే' అని భాగవతోత్తముడు తలంచును' అని నీవు ఇదివరలో తెలిపియుంటివి. పరాత్పరుడు, సర్వశక్తిమంతుడు ఐన శ్రీమహావిష్ణువు యొక్క మాయ గొప్ప మాయావులను సైతము మోహింపజేయును. దానిని ఎవరును గుర్తింపజాలరు' అనునది లోక ప్రశస్తి. కనుక ఆ విష్ణుమాయా స్వరూపమునుగూర్చి తెలిసికొనగోరు చున్నాను - దయతో వివరింపుము".


*3.2 (రెండవ శ్లోకము)*


*నాఽనుతృప్యే జుషన్ యుష్మద్వచో హరికథామృతమ్|*


*సంసారతాపనిస్తప్తో మర్త్యస్తత్తాపభేషజమ్॥12247॥*


మానవుడు సంసార తాపత్రయముచేత పీడితుడైయున్నాడు. ఆ తాపత్రయ నివారణకు భగవత్కథామృతమే దివ్యౌషధము. నీ ద్వారా ఆ భాగవతకథాసుధలను ఎంతగా గ్రోలినను తనివితీరకున్నది. ఇంకను వినవలెనను కుతూహలము పెరుగుచున్నది.


*అంతరిక్ష ఉవాచ*


*3.3 (మూడవ శ్లోకము)*


*ఏభిర్భూతాని భూతాత్మా మహాభూతైర్మహాభుజ|*


*ససర్జోచ్చావచాన్యాద్యః స్వమాత్రాత్మప్రసిద్ధయే॥12248॥*


*అంతట 'అంతరిక్షుడు' ఇఠ్లు నుడివెను* "నిమి మహారాజా! ఆదిపురుషుడైన శ్రీమన్నారాయణుడు సకల ప్రాణులకును ఆత్మ. ఆ స్వామియే ఈ పంచభూతముల ద్వారా అన్నివిధమలైన చిన్న-పెద్ద ప్రాణులను సృష్టించెను. ఆ ప్రాణులు నిరాటంకముగా జీవించుటకొరకై అనేకములైన సామగ్రులను (వస్తువులను) సిద్ధపరచెను. తన జీవితకాలమునందు ఆత్మజ్ఞానమును సాధించి స్వస్వరూపమును పొందవలయును.


*3.4 (నాలుగవ శ్లోకము)*


*ఏవం సృష్టాని భూతాని ప్రవిష్టః పంచధాతుభిః|*


*ఏకధా దశధాఽఽత్మానం విభజన్ జుషతే గుణాన్॥12249॥*


ఈ విధముగా పరమాత్మ సకలప్రాణులను సృష్టించి, పంచమహాభూతముల ద్వారా నిర్మితమైన ఈ శరీరములయందు తానే ప్రవేశించెను. మనస్సుద్వారా, దశేంద్రియములద్వారా తనను విభజించుకొని, స్వయముగా ఆ గుణములను అనుభవించును.


*3.5 (ఐదవ శ్లోకము)*


*గుణైర్గుణాన్ స భుంజాన ఆత్మప్రద్యోతితైః ప్రభుః|*


*మన్యమాన ఇదం సృష్టమాత్మానమిహ సజ్జతే॥12250॥*


ఆయన ద్వారా ప్రకటితములైన ఈ గుణములే గుణములయందు ప్రవర్తించుచున్నవి. కానీ, దేహాభిమానియగు జీవుడు ఈ గుణములద్వారా నిర్మింపబడిన ప్రపంచమునందు ఆత్మబుద్ధిని కలిగి 'ఇది నేను - ఇది నాది' అను సంబంధములను ఏర్పరచుకొని, కర్తృత్వ భోక్తృత్వములను ఆరోపించుకొని బద్ధుడగును. ఇదియే మాయ.


*3.6 (ఆరవ శ్లోకము)*


*కర్మాణి కర్మభిః కుర్వన్ సనిమిత్తాని దేహభృత్|*


*తత్తత్కర్మఫలం గృహ్ణన్ భ్రమతీహ సుఖేతరమ్॥12251॥*


దేహధారియగు జీవుడు కర్మేంద్రియములతో సకామకర్మలను ఆచరించును. ఆ కర్మలను అనుసరించి శుభకర్మలయొక్క ఫలముగా సుఖమును, అశుభకర్మల ఫలమగా దుఃఖమును అనుభవించుచుండును. ఈ విధమగా సుఖదుఃఖములను అనుభవించుచు మరల జన్మలనెత్తుచు శరీరధారియై సంసారమునందు పరిభ్రమించుచుండును. ఇదియే భగవంతుని మాయ.


*3.7 (ఏడవ శ్లోకము)*


*ఇత్థం కర్మగతీర్గచ్ఛన్ బహ్వభద్రవహాః పుమాన్|*


*ఆభూతసంప్లవాత్సర్గప్రళయావశ్నుతేఽవశః॥12252॥*


ఈ విధముగా జీవుడు కర్మఫలములుగా పెక్కుదేహములను పొందుచుండును. వాటివలన పలు దుఃఖములపాలై, త్రిగుణాత్మకమైన ప్రకృతికి అధీనుడై మహాప్రళయపర్యంతము జననమరణచక్రములోబడి తిరుగుచుండును.


*3.8 (ఎనిమిదవ శ్లోకము)*


*ధాతూపప్లవ ఆసన్నే వ్యక్తం ద్రవ్యగుణాత్మకమ్|*


*అనాదినిధనః కాలో హ్యవ్యక్తాయాపకర్షతి॥12253॥*


పంచభూతముల ఉపసంహార సమయమైన మహాప్రళయము ఆసన్నమైనప్పుడు ఆద్యంతములు లేని కాలపురుషుడైన పరమేశ్వరుడు ద్రవ్యగుణాత్మకమైన (పంచభూత శబ్దాది గుణాత్మకమైన) విశ్వమును (స్థూలప్రపంచమును) నామరూప విభాగరహితమైన అవ్యక్తములోనికి (తనలోనికి) లాగుకొనును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

కామెంట్‌లు లేవు: