7, ఫిబ్రవరి 2023, మంగళవారం

పంచ భూతాలు - తత్త్వాలు*


*పంచ భూతాలు - తత్త్వాలు* 


ఆమె మనసు నిర్మలమైన ఆకాశంలాంటిది; అతను స్వచ్ఛమైన గాలిలాంటివాడు; ఆమె నిప్పులాంటి మనిషి; ఆమె గలగలా పారే నీరులాంటిది; ఆమె సహనం “భూమాత”లాంటిది; ఇట్లా ఎంతో మంది గుణగణాలను, అనేకమంది” పంచభూతా”లతో పోలుస్తూవుంటారు. ఇందులోని విశేషత ఏంటి? ఈ పంచభూతాల తత్త్వం ఏంటి? నా మనసులోని భావాలను మీతో చెప్పాలనుకున్నా. ఆలకించండి:


ఈ విశ్వమంతా పంచభూతాలతో కూడి వున్నది. *ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అనేవి పంచభూతాలు.* జీవులందరుకూడా ఈ పంచభూతాల సమ్మేళనమే. ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క ప్రత్యేక, విశేషమైన గుణం, ఆ గుణానికి ఒక తత్త్వం ఆధారమై వుంటుంది. ఈ గుణాలు కానీ, వాటి తత్త్వాలు కానీ, కాల,మాన పరిస్థితులకు అనుగుణంగా మారవు. మారేదల్లా, ఈ గుణాలు కలిగిన మానవుల మనసు మాత్రమే. ఇప్పుడు, కొంచెం వివరణలోకి వెళ్ళ్దాం.


*ఆకాశతత్త్వం:-* ఆమె మనస్సు నిర్మలమైన ఆకాశంలాంటిది అని అంటారు. అతని హృదయం ఆకాశమంత విశాలమైనది అని అంటాం. అతని గుణాలు ఆకాశంలాగా మహొన్నతమైనవి అని అంటాం. ఏమిటీ ఆకాశతత్త్వం? మన వేదాల పరంగాగానీ, ఇప్పటి ఆధునిక భౌతికశాస్త్ర పరంగాగానీ చెప్పబడింది ఒక్కటే. అది, ఈ విశ్వమంతా ఆకాశంనుండి పుట్టిందని. అటువంటి ఈ ఆకాశానికి హద్దులు లేవు. వైశాల్యంలొగానీ, ఎత్తులొగానీ ఆకాశానికి పరిమితులులేవు. సూర్యగ్రహాది మండలాలను; నక్షత్ర మండలాలను, ఇంకా ఎన్నో తెలియని మండలాలను తనలొ నింపుకున్నదీ ఆకాశం. జీవులకు కావలసిన ప్రాణవాయువుని అందిస్తుంది. ఎన్నిటికైనా, ఎంతవాటికైనా తనలో స్థానమిచ్చి, ఇంకా తనలో చోటు ఇచ్చేందుకు తయారుగావున్న ఈ ఆకాశం బహు వినమ్రతతొ కనిపిస్తుంటుంది. శ్రమతొ అలసిన మనసు, నిర్మలమైన ఆకాశంవైపు చూడగానే ఎంతో శాంతన పొందుతుంది. మరి, మన మనసుకూడా ఈ గుణాలను పుణికి పుచ్చుకుంటే బాగుంటుంది కదా!!


*వాయుతత్త్వం:-* అడిగినా, అడగకపోయినా, వాయువు ప్రాణకోటికి అవసరమైన ప్రాణవాయువును అందిస్తుంది. అది చొరబడలేని ప్రదేశమే లేదు. నీటిలొ కూడా కరిగి, నీటి అడుగుకు చేరుకోగలదు. ఎంత చల్లటి గాలి ఈ గాలి; ఎంత కమ్మని గాలి ఈ గాలి అని పాటలుకూడా పాడుకుంటుంటాం. కానీ, గమనించాలిసిన ముఖ్య విషయమేమిటంటే, గాలి, తనకు తానుగా ఎటువంటి గుణాలను ఆపాదించుకోదు. తాను ఎప్పుడూ ఒకే రకంగా వుంటుంది. ఒక చోటనుంచి, మరొక చోటకు పయనిస్తుంటుంది. ఉదా:- ఒక మల్లె పూతోటపైనుంచి గాలి పయనిస్తుందనుకోండి. ఆ మల్లెల పరిమళాన్ని తనలొ నింపుకొని, తనతో కలుపుకొని, ముందుకు తీసుకువెళ్ళ్తుంది. అంతమాత్రాన గాలి మల్లెలగాలి అయిపోదు. పరిమళం ఎంత దూరం రాగలిగితే, అంత దూరం తీసుకుపోతుంది. ఆ తరువాత, పరిమళం యొక్క ప్రయాణం ఆగాల్సిందేకానీ, గాలి పయనం మాత్రం కొనసాగుతూనే వుంటుంది. ఎటువంటి వాసనలు లేకుండా. అదేవిధంగా దుర్గంధం వెదజల్లుతున్న చెత్త మీదుగా గాలి పయనిస్తుందనుకోండి. చుట్టుపక్కలున్న వారు ఆ గాలిని భరించలేక “చెత్తగాలి, చెడుగాలి” అని ఆడిపోసుకోవచ్చు. గాలి చెడుది కాదు; వాసన మాత్రమే చెడుది. చెత్తలోని చెడు వాసన కొంత దూరమే ప్రయాణించి, ఆగిపోతుంది, కానీ, గాలి మాత్రం ముందుకు సాగుతూ వుంటుంది. అక్కడవారికి, ఆ గాలి మంచి గాలే మరి! అంటే, మంచి, చెడు సాంగత్యం లేదా పొత్తు వలన, తాత్కాలికంగా, గాలి మంచి గాలి/ చెడు గాలి అని పేరు పడిందే కానీ, గాలి ఎప్పుడూ స్వచ్ఛమైనదే. మరి, ఇతరులకు ప్రాణ సహాయం చేసే గుణం, అవసరమైన చోటెక్కడకైనా చొచ్చుకుపోయే గుణం, మంచి, చెడులతొ తనకు బంధంలేకుండా, స్వచ్ఛతతో మనగలిగే గుణాలు, మన మనసులోకి నింపుకుంటే బాగుంటుందికదా!!


*అగ్నితత్త్వం:-* నిజం నిప్పులాంటిది అంటాం. అంటే, నిజాన్ని ఎప్పటికీ దాచివుంచలేం. అట్లాగే, నిప్పును ఎప్పటికి కప్పిపెట్టలేం. నిప్పుని గురించి ఎక్కువగా చెప్పనక్కరలేదు. ఎక్కువసేపు పట్టుకుంటే మన చేయి కాలుతుంది. అగ్నికి, ఒక గొప్ప గుణం వున్నది. తనలోకి ప్రవేశించిన దేనినైనా అది భస్మీపటలంచేస్తుంది. ఏ వస్తువైనా నామరూపాల్లేకుండా పోవాల్సిందే. కానీ, తను మాత్రం దేదీప్యమానంగా వెలుగుతూనే వుంటుంది. ఎటువంటి మాలిన్యాన్ని అంటించుకోదు; కానీ, మాలిన్యాన్ని మంచి నుంచి వేరుచేస్తుంది. అగ్నిని మనం ఎంత ప్రేరేపిస్తే, అది మనకు అంతగా దోహదపడుతుంది. ఉదా:- ముడి బంగారాన్ని అగ్నిలొవేసి, కాలిస్తే, మలినాన్ని తొలగించి, స్వచ్ఛమైన బంగారాన్ని మనకు అందిస్తుంది; వనమూలికలను అగ్నిలొ వేసి కాలిస్తే, వాటిని మండించి, పరిసరాల్ని శుచి చేస్తుంది. మరి, నిప్పులాంటి ఈ గుణాన్ని మన మనసుకు అంటించితే, మన మనసు మేలిమి బంగారమే అవుతుంది కదా!!


*జలతత్త్వం:-* జలం, పుట్టుకతోనే స్వచ్ఛమైనది. ఎట్లా అంటారా? నీరు ఆవిరై, మేఘాలలొ నిభిఢీకృతమై వుంటుంది. తిరిగి, భూమిపైకి చేరే నీరు, కొండలపై పడి, క్రిందకి జారుతూ, కొండలపైవున్న ఔషధ మొక్కలు, లవణాల ద్వారా మరింత శుభ్రపడి, నదులలోకి చేరుకుంటుంది. దాహార్తితో వున్న వారి దప్పికను తీర్చే గొప్ప సుగుణం దీని ప్రత్యేక గుణం. రైతన్నలకు ప్రత్యక్ష దైవం. హనుమంతుడిలాగా, తన స్వయం శక్తి తనకు తెలియనది. ఎవరైనా కోరుకుంటే, తనలో నిభిఢీకృతమైవున్న “బఢబాగ్ని” (విద్యుచ్ఛక్తి) ని బయటకు తీసుకువస్తుంది. అప్పుడు కూడ సహాయపడే గుణమే దానిది. ఏరులు వాగులై, వాగులు చెరువులై, చెరువులు నదులై; నదులు సముద్రాలైనా, జలం తన పరిధులను దాటదు. సముద్రంలొ అలలు అకాశాన్ని అంటినా, తీరాన్ని దాటకుండా తన హద్దులను గుర్తెరిగే వుంటుంది. మరి, దాహార్తితో వున్న వారి దప్పిక తీర్చే గుణంలాంటి గుణం మన మనసు కూడా అలవర్చుకుంటే. మన మనసు జల,జలమని స్వచ్ఛంగా పారదా?!


*భూతత్త్వం:-* అమ్మ తరువాత, అమ్మ స్థానం పొందినవి భూమిమీద రెండే రెండు. ఒకటవది: భూమాత; రెండవది: గోమాత. అమ్మ, తన బిడ్డని పొట్టలో నవమాసాలూ మోస్తుంది. తన బిడ్డ వదిలిన మల,మూత్రాలను తన కడుపులొ వుంచుకుంటుంది. తన బిడ్డకు కావాల్సినవన్నీ ఇచ్చి, పండంటి బిడ్డకు జన్మ నిస్తుంది. పెంచి పోషించిన తనను పెద్దవుతున్న బిడ్డ లెక్క చేయకపోయనా, బిడ్డ చేసిన తప్పులను తన కడుపులోనే వుంచుకొని, తన బిడ్డకు ఉజ్జ్వల భవిష్యత్తును ఇవ్వటానికి కృషి చేస్తుంది అమ్మ. అదేవిధంగా, భూమాత, తన కడుపుని చీల్చినా, తనవారే గదా అని, తనలో దాగివున్న నీటిని, వజ్ర, వైఢూర్యాలను, ఖనిజాలను తన బిడ్డలకు ఇస్తుంది. గింజలు నాటితే. పోషకాలు అందించి, పంటలు పండించి, తన బిడ్డలకు ఆహారాన్ని తయారుచేసి ఇస్తుంది. తనలో నదులను, సముద్రాలను, బడబాగ్నిని అదుముకొని, తన బిడ్డలకు హాని కలుగకుండా చూస్తుంది. తనపై ఎంత భారాన్ని వేస్తున్నా, సహించి, తన బిడ్డలకు ఆధారంగా వుంటుంది. ఇంతటి సహన శక్తి కలది కాబట్టే, ఆమెను భూమాత అన్నారు. మరి, అంతటి సహన శక్తి అనే గుణం మన మనసుకు తోడైతే, యుద్ధాలకు, వైషమ్యాలకు తావెక్కడుంటుంది?


ఉపసంహారం:- పరిశోధకులు, రచయుతలు, విజ్ఞానులైన మన ప్రాచీన ఋషులు వేదాల ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనకు అందించారు. ప్రతి విషయాన్ని, అర్ధం కావటంకోసం, ఎన్నో ఉపమానాలు, కధలు చెప్పి, తత్త్వ జ్ఞానాన్ని మనకు తెలియచేశారు. ఆ తత్త్వ రహస్యాల్ని మనం తెలుసుకొని, మననం చేసుకుంటూ, ఆచరణలొ పెట్టినట్లైతే మానవుడే మాధవుడవుతాడు అని చెప్పటానికి సంశయించే అవసరం లేదనుకుంటాను.


🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: