7, ఫిబ్రవరి 2023, మంగళవారం

శుభోదయం

 🙏 *శుభోదయం* 🙏 


నేను ఒక పని గురించి ప్రయాణం చేసే క్రమంలో బస్ ఎక్కాను...


బస్ బయలుదేరింది...  కాసేపు ఫోన్స్ మాట్లాడేసి, పిల్లలకు జాగ్రత్తలు చెప్పేసి, సీట్ లో అడ్జస్ట్ అయి, రిలాక్స్ అయ్యాను...  ఫ్రీ అయ్యావా అంటూ నా మనసు నన్ను అడిగింది..  హా... ఇంక కాసేపు రిలాక్స్ అవుతాను అన్నాను దానితో....  అంతకన్నా ఎక్కువ నాతో దానికి మాటలేం ఉంటాయి కానీ,  వెళ్తున్న పని గురించి ఆలోచించడం మొదలు పెట్టాను... ఒక ఐదు నిమిషాలు అయ్యాక అనిపించింది.. రిలాక్స్ అవ్వాలి అనుకుంటూ ఈ ఆలోచనలు ఏంటి అని...  అప్పుడు, ...  లేదు.. ఇక ఈ ఆలోచనలు ఆపేసేయ్యాలి అనుకుని... కళ్ళు మూసుకున్నా...

కళ్ళముందు ఉన్న ప్రపంచం మాయమై పోయి, నాకు నేను కనిపిస్తున్నాను.. ఈ శరీరం తో  పాటు నేను  ట్రావెల్ చేస్తున్నాను...


*ఎవరు ఎవరిని చూస్తున్నారు?* నాతో పాటు అదృశ్యం గా ఉండి ప్రయాణం చేస్తున్నది ఎవరు? ఆ ఎవరు అన్న దానికి  జవాబే *నేను*  కదా...   అదే కదా నా ఉనికి... 

ఉంది అని తెలుస్తుంది... కానీ కనబడటం లేదు... మనసు దానిని గుర్తిస్తుంది . కానీ రూపం లేదు...  ఇవన్నీ నాలో కలిగే ఆలోచనలు.. కాదు కాదు... అనుభూతులు... బయటి ప్రపంచంతో అనుబంధం ఎలా అనుభవం లోకి వస్తుందో, అలాగే  నాలో కలిగే ఈ అనుభూతులు కూడా తెలుస్తున్నాయి... బాహ్యము లోని విషయాలు శరీరానికి అనుభవం అయితే, అంతరం లోని విషయాలు *నేను* కి అనుభూతి...


నాకు నేను ఎప్పుడూ తోడు ..  ఈ దేహం  ప్రాణం పోసుకున్న దగ్గరినుంచి ఈ దేహం దహనం అయిపోయే వరకు నాకు నేను ఎప్పుడూ తోడు .. *నాకు నేను అంటే??* ఈ దేహంగా ఉన్న నేనుకి ఆత్మగా ఉండే నేను తోడు అని అర్థమయ్యింది...  ఇది ద్వైతం... ఒకటి దేహం రెండు ఆత్మ..  ద్వైతం లేదు కదా..అంతా అద్వైతమే కదా  మరి ఈ ద్వైత భావన ఏంటి? అని అనిపించింది... 


దేహము నేను కాదు.. దానికి భిన్నంగా నేను ఉన్నాను.. ఇది నా ఉనికి అనుకున్నప్పుడు, ఆ దేహభావన మాయమై పోతుంది.. కానీ నా ఉనికి మాయం కాదు... అందులో ఏ మార్పూ ఉండదు... 


ఒక్కటి గమనించగలుగు తున్నాను.. అదేంటంటే, కళ్ళు మూసుకున్నప్పుడు మాత్రమే ప్రత్యక్షమయ్యే నేను, ఇప్పుడు కళ్ళు తెరిచి ఉన్నా కూడా నాకు తెలుస్తుంది... నాతో అంటే ఈ దేహంతో పాటు ఉంటుంది.. ఈ దేహం చేసే పనులన్నీ గమనిస్తుంది...  ఒక సీసీ కెమెరా లాగా...  సీసీ కెమెరా ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది... మరి నేను సంగతి?? ఇది ఆఫ్ అయిపోయేది కాదు... ఈ నేను పుట్టింది కాదు.. గిట్టడం ఉండదు.. ఈ *నేను ఉంది*. అంతే... అప్పుడే  ఆ క్షణమే అదే నా ఉనికి అనే సత్యం తెలుసుకున్నాను.... 


🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: