సాయం సంధ్య-పద్మ ముకుళనం!
చ: ఇనుఁడు కరంబులం బొదవి ,యింపుగ సంగమమాచరింపఁ బ
ద్మిని వదనంబునన్నగవు మీఱ వికాస విలాస మూని , లో
నన ద్రవముబ్బి , సొక్కి , నయనంబులు మూయుచు నిద్రచెందెనో
యన , ముకుళీభవించె , దివసాంతమునందుఁ బయోజ షండముల్.
అనిరుధ్ధ చరిత్రము-3 ఆ: 5 పద్యం: కనుపర్తి అబ్బయామాత్యుడు;
కఠిన పదములకు అర్ధము:- ఇనుడు-సూర్యుడు (రాజు లేదా నాయకుడు) కరంబులు-కిరణములు (చేతులు) సంగమము-కలయిక( సంభోగము) వికాస విలాసము- విరసించెడు శోభ;( మనస్సు ఆనందమును పొందినకలుగు ఉత్సాహము) ద్రవముబ్బి-మకరందము స్రవింప( కరగిపోయి) సొక్కి-పరవసించి;( శరీరమును మరచి; ముకుళించె- ముడుచుకుపోయె; పయోజ షండములు-తామరల సముదాయము; దివసాంతము-సాయంత్రము
భావము: ;సూర్యుడు తనకిరణ ప్రసార సంగమముచే పద్మిని నలరింప వికసించి అందమును ప్రకటించుచు రసీ భూతయై యాపరవశమున కనులు మూయుచున్నదా యనునట్లు పద్మములు ముకుళించుచున్నవి;
విశేషాంశములు; ఈపద్యమును బోలిన పద్యమొకటి మనసాహిత్యమున కానరాదు. అంతగొప్ప పద్యము.
ప్రకృతిలో జరుగు నొకమార్పును ఒక లౌకికేతివృత్తముతో నుపమించుచునూహించుట.
యిందలి చిత్రము.
భర్తవలన సంగమ సుఖమంది నగుమోమున విలాసములను ప్రకటించుచు రతిపారవస్యముచే లోస్రవించుచు కనులు మూసి
నిదురించుట వనితాసామాన్యమైన విషయము. ఇది నెల్లరకు అనుభూతమే!
సూర్యస్తమయవేళ పద్మములు ముకుళించుటను కవియాదృశ్యముతో నుపమించుచు,నుత్ప్రేక్షించుట,ఇందలి విశేషము.
పద్మిని- ఇనుడు : అనేపదాల నాధారంగా వానికిగల శ్లేషను ఉపయోగించి ఆదృశ్యమును భర్తృ సుఖితయై పరవసించి కనులు మూయు భామిని వృత్తముతో సమముగా నున్నదనుచున్నాడు.
సంగమము, వికాస విలాసము ,లోద్రవముబ్బుట, సొక్కుట , నయనంబులు మూయుటయు నివియన్నియు శృం గార కృత్యములు. పద్మిని యందును వనితయందును ఇవిసమానమే
ఈరీతిగా ఊహలు సారించి, వేరెవ్వరు చూపని విధముగా భావ ప్రసారణ చేసి భావుకులను మెప్పించిన అబ్బయామాత్యుని ఊహాశక్తికి ఆవిష్కరణమొనర్చిన తీరునకు నమోవాకములు.
అలంకారం: ఉత్ప్రేక్ష స్వస్తి!🙏🌸🌸🌸🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌸🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి