6, ఆగస్టు 2023, ఆదివారం

సమాధానమేమిటి

 ప్ర : ' మన దేవాలయాల్లో గర్భాలయాలలోకి అడుగు వర్ణాలను ప్రవేశింపజేయరు. అగ్రవర్ణాలదే ప్రవేశం. కల్యాణోత్సవాలకు కూడా పల్లకీ మోయిస్తారే కానీ వేదిక పైకి రానివ్వరు. కేవలం ఒక్క వర్ణం వారికే పరిమితమైన దేవుళ్ళను ఆరాధించే మతంలో మేమెందుకుండాలీ' అని ప్రశ్నిస్తున్న వారికి సమాధానమేమిటి?

జ : మనం ఆరాధించే దేవుళ్ళు గుడిలో ఉన్నవారు కాదు. వారు సర్వవ్యాపకులు. కానీ గుడిలో ఆ దేవుని ఆరాధించినప్పుడు కొన్ని మర్యాదలుంటాయి. గుడిలో దేవుళ్ళు | అందరినీ కాపాడే శక్తి స్వరూపులు. మన ఆలయవ్యవస్థ, మతస్వరూపం వేరు. ఇతరులతో పోల్చడానికి లేదు.

ఆలయాలలో విగ్రహాలు కేవలం నమ్మకానికి ఆధారాలు కావు. దైవశక్తిని మంత్ర యంత్ర హోమాది పద్ధతుల ద్వారా ప్రతిష్ఠ చేశాక, కొన్ని నియమాలుంటాయి. వాటి పవిత్రతను 'శౌచం' వంటి సదాచారాలతో కాపాడుకోవాలి. అప్పుడు ఆ ఆలయశక్తి అందరినీ రక్షించగలుగుతుంది. అలా కాపాడి అర్చించడానికి ఆ దేవతా మంత్రానుష్ఠానం, యంత్రారాధన విధానం, దానికి తగిన సదాచారం పరంపరగా తెలిసిన వారికి సౌలభ్యం ఉంటుంది.

రోగి మన బంధువైనా డాక్టర్ మాత్రమే చికిత్స చేస్తారు.ఐసియూలో ఉంచినప్పుడు ఆత్మీయులనైనా రానివ్వరు. తగిన సమయంలో అనుమతించినా చెప్పులతో, మామూలు దుస్తులతో అనుమతినివ్వరు. ఎక్కువ సంఖ్యలో రానివ్వరు.

మామూలు కంటికి కనబడని సూక్ష్మవిజ్ఞానం ఇక్కడ ఉంది. అలాగే ఆలయాల్లో దివ్యత్వం అర్చావిధానంతో కేంద్రీకృతమై ఉంది. దానిని కాపాడే బాధ్యత కొందరిది. అది భౌతికోద్యోగాలవలె సాధించలేము. కేవలం అగ్రవర్ణాలలో పుట్టినంత మాత్రాన అందరినీ గర్భాలయంలో ప్రవేశింపజేయరు.

హఠాత్తుగా -'మేమూ స్నానం చేశాం' అనగానే లభించే అవకాశం కాదిది. దానికి తగిన సంస్కారాలు, విద్య అవసరం. ఆ విధంగా వాళ్ళు కొలుచుకుంటుంటే, మరికొందరు పల్లకీ మోసి, డప్పు మోగించి, భూములిచ్చి కొలుచుకుంటారు. ఇక్కడ ధనప్రశక్తి లేదు. దర్శించే వారికంటే నిరుపేదలైన అర్చకులు కూడా ఉంటారు. ఏవో కొన్ని ప్రధాన ప్రముఖాలయాల్లో తప్ప, అన్ని ఆలయాల్లోనూ గొప్ప ఆదాయమేమీ ఉండదు. కేవలం సదాచారాలకు అంకితమైతే తప్ప పూర్తికాలపు అర్చకత్వం సాధ్యం కాదు. అందరూ అలా జీవించడం కుదరదు. అన్ని రకాల వృత్తులవారు, కర్మశీలురు సమాజంలో ఉంటారు. అందరూ సదాచారాలతో పూజానుష్ఠానాలను తీరిగ్గా చేసే అవకాశం ఉండదు. అందుకే కొందరు దానికై అంకితమై ఉంటారు. అందునా

పూర్వీకుల నుండి ఇంటా బయటా అలవాటైన అర్చావిధులూ, మంత్రశాస్త్రాలూ అందరికీ అందేవి కావు.

వైద్య శాస్త్రం వైద్యుల చేతిలో ఉన్నా, ఆరోగ్యం అందరిదీను. అలాగే- అర్చకత్వం ప్రత్యేక వర్గం చేతిలో ఉన్నా, దాని ఫలితాలు అందరివీను. అందుకే ఆలయ మర్యాదల ననుసరించి కొన్ని కట్టు బాట్లతో లోపల అర్చనాదికాలు జరుగుతాయి. కొన్ని చోట్ల విరాళాలిచ్చినవారు, నిర్మించినవారు, కార్యనిర్వాహక వర్గం వారు

అసంఖ్యాకంగా ఉన్నా వారెవ్వరూ ఏనాడూ గర్భగుడిలో ప్రవేశించరు.

మరొక ముఖ్యాంశం- ఇటువంటి కఠిన నియమాలు లేని ఆలయాలు కూడా మనకు ఉన్నాయి. గ్రామదేవతల రూపంలో, మన ఇంట్లో విగ్రహాల, పటాల రూపాలతో దేవతలుంటారు. శ్రద్ధగా పూజిస్తే ఆ దేవతలు సైతం స్పందించి, ఎవరికైనా అనుగ్రహా న్నివ్వగలరు. అర్చనతో కొందరు, నిర్వహణతో ఇంకొందరు, పరిచర్యలకు, సమర్పణ, కైంకర్యాలకు ఇంకొందరు సిద్ధంగా ఉన్నారు. ఎవరి పద్ధతిలో వారు భగవంతుని కొలుచుకొని ధన్యులౌతారు. సరియైన శాస్త్ర, మర్యాదల ననుసరించే వారు వీటిని గౌరవిస్తారు, పాటిస్తారు.

మన దేవుళ్ళను కొలుచుకొనే సామాన్యులు, స్త్రీలు కూడా ఉన్నారు. అందరూ గుడిలోకి అందునా గర్భగుడిలోకి చొచ్చుకు వెళ్ళాలని నియమం లేదు. నైవేద్యం పెట్టేటప్పుడు ఉన్న నియమం, ప్రసాద భక్షణలో లేదు. నైవేద్యం పెట్టేవారు సదాచారంతో ఉండాలి. తినేవారికి ఆ నియమం లేదు కదా!

కొన్ని ఆలయాల్లో అగ్రవర్ణేతరుల నిర్వహణ, అర్చన కూడా ఉన్నాయి. పద్ధతుల్లో వారు అర్చించే విధానాలూ ఉన్నాయి. వైదిక, పౌరాణిక, తాంత్రిక భేదాలతో ఒకే దైవాన్ని వివిధ వర్గాల వారు అర్చించుకొనే రీతులు మనకు ఉన్నాయి. హరిదాసరి, నందనారు, నీలకంఠనాయనారు,ధర్మవ్యాధుడు లాంటి మన ధర్మంలో పూజ్యులైన ఆధ్యాత్మిక తత్త్వవేత్తలు.కేవలం హిందూమతంలో చీలికలు తేవడానికి జరుగుతున్న కుట్రలో భాగమే ఈ కువిమర్శలు.

కామెంట్‌లు లేవు: