6, ఆగస్టు 2023, ఆదివారం

వైదిక ధర్మ ప్రభావం

 వైదిక ధర్మ ప్రభావం


ఆచార్యపురుషులకు, తదనుయాయులకు ఆత్మబలం సచ్చరిత్రం, నీతీసంపదా ఉన్నట్టయితే వారి మతములకు సుస్థిరత్వం ఏర్పడుతుంది. అట్టి ఆచార్య పురుషుల వల్లనే వైదిక మతము అనేక గండములు గడచి నేటికి సుస్ధిరంగా వుంటున్నది.


గౌతమబుద్దుడు కపిలవస్తు నగరంలో అవతరించి, 2500 ఏండ్ల గడచినవి. వారి త్యాగనిరతీ, వైరాగ్యనిష్ఠ ప్రజల మనస్సులను లోగొన్నవి. బుద్ధుని జీవితగాథ విన్నప్పుడు దేశమంతటా కానవచ్చే బుద్ధవిగ్రహాలను కన్నప్పుడు మనకు శాంత్యానందములు, కరుణా లభిస్తూవుంటవి. బౌద్ధము నాస్తిక మతమైన కారణాన దానికే దేశంలో నిలువనీడ లేకపోయిందనే అభిప్రాయ మొకటి ఈ వరకు ఉంటూవచ్చేది. కాని, సంస్కృతంలో పాళీభాషలో వున్న బౌద్ధధర్మ గ్రంథాలను, అశోకుని శిలాశాసనాలను పరికిస్తే బుద్ధదేవుని మహానుభావం మనకు తెలిసివస్తుంది. అట్టి మహనీయుని పుట్టుకచే ఈ దేశం ధన్యమయినదనిపిస్తుంది. ''ప్రాగ్దిశాజ్యోతి'' అనే గ్రంథంలో ఎడ్విను ఆర్నాల్డు కవి బుద్ధుని దివ్యజీవనాన్ని కీర్తించాడు. ఈ బౌద్ధమతం తమిళ దేశంలోను వ్యాపించింది. బౌద్ధధర్మాలనేకం తమిళ గ్రంథాలలో కానవస్తున్నవి. ఇంతగా గౌరవాస్పదమైన బౌద్ధమతం మనదేశంలో ఏల నిలువ జాలకపోయిందా అని ఆశ్చర్యం కలుగుతూ వుంటుంది.


తమిళ సాహిత్యంలో ఎక్కడ చూచినా జైనమత ప్రచారం కనిపిస్తుంది. దీనినిబట్టి బౌద్ధముకంటే జైనధర్మానికే తమిళనాడులో ప్రాబల్యం లభించిందనుకోవాలి. ఉత్తర భారతంలో గుజరాతు మొదలైన ప్రాంతాల్లో జైనమతస్థు లధికంగా ఉంటున్నారు. బౌద్ధ జైనములు రెండూ అహింసనే పరమధర్మంగా చెపుతున్నా, బౌద్ధులు ఇతరులు చంపిన మృగముల మాంసం తినేవారు. జైనులు మాంససేవనం చప్పగా నిషేధిస్తారు. జైన విగ్రహాలు, ధర్మశాసనాలుకూడా మన దేశమంతటా కనిపిస్తున్నవి. సాంఖ్యమతమనేది కూడా పురాతనమే. బౌద్ధ, జైనములందు కంటే సాంఖ్యమతంలో జ్ఞానులు, ఋషులు ఎక్కువగా ఉన్నా, వారివారి విగ్రహాలుగాని, వారి మతాన్ని ప్రచారంచేసే గాధలు, గీతములుగానీ ఎక్కడా వినరావు మరి తత్త్వశాస్త్ర గ్రంథాలలో చూడబోతే, బౌద్ధ, జైనముల కంటే సాంఖ్యమతానికి ఎక్కువ ప్రస్తావము కనిపిస్తుంది.


వైదికమతాలలో శైవ వైష్ణవాలు తమిళదేశంలో బహుళప్రచారాన్ని పొందినవి. వైష్ణవసిద్దాంతానికి శ్రీమధ్వమునీ శ్రీ రామానుజులు ఆచార్యపురుషులు, రామానుజుల వైష్ణవాన్ని, శైవసిద్ధాంతమూలకమైన శైవాన్ని అవలంబించినవారు తమిళనాడులో విరివిగా ఉన్నారు. వైష్ణవాలయాలన్నిటా రామానుజులకు, నమ్మాళ్వారులకు, మనవాళమునికి వేదాంత దేశికులకు, మరియెందరో ఆళ్వారులకు అర్చా విగ్రహాలు వెలసినవి. శైవాలయాల్లో అట్లే అప్పయ్య, సుందరయ్య, సంబంధయ్య, మాణిక్యవాచకయ్యవార్ల విగ్రహాలు పూజలందుకొంటున్నవి. అంతేకాదు; శేవదివ్యస్థలాల్లో అరువత్తిమూడు నాయనార్ల విగ్రహాలుకూడా నెలకొన్నవి. వైష్ణవాలయాలలో ప్రబంధాలను, శైవాలయాలలో తిరిమరైలను గానంచేసేవారి కోసం వృత్తులు ఏర్పాటైవున్నవి. మరి అద్వైత స్థాపనాచార్యులైన శంకరుల విగ్రహాలు చూడబోతే శైవ వైష్ణవాచార్య విగ్రహాల్లో వెయ్యోవంతుకూడా కనుపించవు. అద్వైతాచార్యులలో ముఖ్యులైన సురేశ్వరాచార్యులకు, అప్పయ్యదీక్షితులకు ఎక్కడా విగ్రహములే కానరావు. పురావస్తుశాఖాధికారి ఒకరు చెప్పినట్లు శాసనాలు, విగ్రహాలు మెదలైన పురావస్తువులను బట్టి దేశచరిత్ర తిరిగి రచించి నట్లయితే, అద్వైతమతప్రసక్తే ఎక్కడా కనుపించకపోవచ్చు.


బౌద్ధమతం వైదిక మతాన్ని ఖండించింది. జైనమేమో బౌద్ధాన్ని ఖండించింది. ఇట్లే మతాచార్యులందరూ వారి వారి కాలములందు ప్రచారంలో ఉన్న మతాలను ఖండిస్తూ, తమ మతాలను స్ధాపింపజూచారు. శైవం, వైష్ణవం మొదలైన ఈ మతాలన్నిటికీ వేర్వేరు లక్షణాలు స్ఫుటంగా కనిపిస్తూ ఉంటవి. శైవవైష్ణవాలు రెండూ ప్రతిమార్చనను అంగీకరించినవే అయినా, వైష్ణవం ఈశ్వరునకు సుగుణమూర్తిని కల్పిస్తే, శైవం ఈశ్వర సంకేతమాత్రమయిన లింగం చాలునంటుంది. ఇస్లాము, క్రైస్తవమతస్థులు, ఆర్య సమాజికులూ ప్రతిమార్చన మొదలైనవే పనికిరాదంటారు. హిందువులు అంగీకరించే వేద ప్రామాణ్యాన్ని బౌద్ధులు, జైనులు అంగీకరించరు. ఈ మతాచార్యులందరిచుట్టూ శిష్యగణం విస్తారంగా పోగవుతూ వుండేది.


నేడు మతస్థులస్థితిని పరిశీలించిచూస్తే మానవలోకంలో సగంమంది క్రైస్తవమును, ఇంచుమించు తక్కినసగం బౌద్ధమును అవలంబించియున్నారు. ఈ రెంటికీ చెందనివారు తక్కినమతాల నాశ్రయించి ఉన్నారు. మరియెన్నో మతాలు పుట్టి పెరిగి నశించిపోయినవి. ఈ మతాలిలా యెందుకు పుట్టుతున్నవి? ఎలా నశిస్తున్నవి? ప్రతిమతమూ తనకే సత్యదర్శనమైనదనీ, తన్ను మించిన పరమధర్మంలేదనీ చెప్పుకుంటూ వుంటుంది. నిజానికి సత్యమనేది ఒక్కటే. అది యిన్నివిధాల వుండదు. మరి ప్రతిమతానికి ప్రజలు అసంఖ్యాకంగా ఎగబడుతూనే వుంటారు. మతాల ఉత్కృష్టతను, వాని నవలంభించిన జనుల సంఖ్యను బట్టి నిర్ణయించుదామా అంటే సత్యం తమనొసటనే పొడిచిందని చెప్పుకొన్న మతములు క్షీణించిపోవుట ఎందువల్ల?సత్యబలంవల్ల మతములు ప్రజారంజకములవుతున్నవా? ప్రజారంజకములైన మతములే సత్యమతము లవుతున్నవా? ప్రజలు సత్యంకోసం మతాన్ని అవలంబిస్తా రనుకొందామా? అంతరించిపోయిన మతాలన్నీ అసత్యమతములనుకుందామా? ఇలా ఎన్నో ప్రశ్నలుదయిస్తున్నవి. ఇవన్నీ పరిశీలించిచూస్తే, ఒక్కవిషయం స్పష్టమవుతుంది. ప్రజారంజనమునుబట్టి, సంఖ్యాబలాన్ని బట్టి మతాలకు స్థిరత్వంగాని ప్రమాణ్యంగా ని నిలభించదని, మనకండ్లయెదుటనే గాంధిధర్మంకోసమని వేలాది ప్రజలు ఉపవాసంచేసి, బంధిఖానాలు నింపి, ప్రాణాలుకూడా అర్పించారు. మరి ఆ గాంధిధర్మమును, ఆ గాంధీజీ ప్రాయోపవేశాలను పట్టించుకోక ఎగతాళి చేసిన వారినీ మనమే చూచాము. అంతేకాదు, ఆ గాంధి ధర్మానుయాయుల సంఖ్య నానాటికి దిగనాసిల్లటంకూడా మనమే చూస్తున్నాము.


కాబట్టి సత్యప్రతిపాదనంవల్లనే మతాలు సుస్థిరములు, ప్రబలములు అవుతవని చెప్పలేము. మతములు ఏకారణంవల్ల పతనమైనవో తెలిసికొంటే వాని వృద్ధికిగల రహస్యంకూడా తెలిసిపోతుంది. మహాబలిపురంలో గుట్టలను ఆలయాలుగా మలిపించిన మహేంద్రవర్మ అనే రాజు ''మత్తవిలాస'' మనే ప్రహసనం రచించాడు. దానిలో బౌద్ధధర్మచ్యుతులైన భక్షువుల స్వేచ్ఛాచారాన్ని గూర్చిన ప్రస్తావనకనిపిస్తుంది. పురుషులతో పాటు స్త్రీలకు గూడా భిక్షుదీక్షలివ్వడం అపాయకరమని బుద్ధుడు ముందే ఊహించాడు. కాబట్టి తమ సచ్చరిత్రంవల్ల ఇతరులకు మార్గదర్శకులు కాదగిన భిక్షుమండలి ధర్మభ్రష్టమగుటవల్లనే బౌద్ధమతానికి పతనంకలిగిందని ఏర్పడుతున్నది. దీనినే వ్యతిరేకలక్షణతో చెపితే మతపరిరక్షణ కొర కేర్పడిన వారు నిష్కళంక చరిత్రులై తత్వజ్ఞులై ఉదారబుద్ధితో ఆచరణ ప్రచారములు ఎప్పటికప్పుడు చేస్తూవుంటే, మతములు సుస్థిరంగా వర్థిల్లుతవని చెప్పవచ్చు. మతకర్తల మహానుభావం వల్లనే మతాలకు ఆదిలో చోదనలభించుట నిజమే అయినా, తదనంతరం వచ్చే ఆచార్యపరంపరకు ఉత్సాహశక్తి, నియమనిగ్రహాలు, సచ్చరిత్రమూ అలవడాలి. తదనుయాయులకు శ్రద్ధా భక్తులుండాలి. అప్పుడే ఆ మతాలకు సుస్థిరత్వం, ప్రజారంజనం లభిస్తుంది. ప్రజాసామాన్యాన్ని ఆకరించేది ఆచార్యపురుషుల మహానుభావమే. కాని, మత పరమార్థం కాదు. ఎవరో పండితులు మాత్రమే ఆ పరమార్థాన్ని విచారించగలుగుతారు. చిరప్రతిష్ఠితములైన, మతములు గూడా మహనీయులైన ఆచార్యపురుషులు కరవగుటవల్లనే క్రమంగా క్షీణించిపోతవి.


కనుక ఏమతమయినా తదనుయాయులు భక్తిశ్రద్ధలతో ధర్మాచరణం చేస్తూవుంటే సుప్రతిష్ఠితమై వర్ధిల్లుతుంది. ప్రజాబాహుళ్యం ఎగబడి సందడి చేసినంతమాత్రాన చేకూరేది వాపేగాని బలుపుగాదు. నిజానికి సాంఖ్యాద్వైతమతాలకు సందడి చాలాతక్కువ. అనాదియైన వైదికమతానికి కర్తలెవరో ఎరుగము. అయినా, అది నేటికీ బహుజనుల కాలంబమై నిలిచి వున్నదంటే త్యాగధనులు, సచ్చరిత్రులు, భక్తులు అయిన ఆచార్యపురుషు లెందరో దానికాలంబమై ఆచరణ ప్రచారములు చేస్తూవుండటమే కారణం. కనుక, మనయీమతం చిరకాలం ఇలాగే వర్ధిల్లి లోకాన్ని ఉద్ధరించాలనే అభిలాష మనకుండాలి. అట్టి అభిలాషతో మనం సదాచారులమై, ధర్మపరాయణులమై, మనోవాక్కాయములచే సత్కర్మాచరణం చేస్తూవుండాలి.


--- “జగద్గురు బోధలు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: