5, డిసెంబర్ 2024, గురువారం

తిరుమల సర్వస్వం -78*

 **తిరుమల సర్వస్వం -78* 

*శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 17*

*అశ్వవాహనోత్సవం* 

*గక్కున నయిదవనాడు గరుడునిమీదను* 

*యెక్కెను ఆరవనాడు యేనుగుమీద* 

*చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోను* 

*యిక్కున దేరును గుర్ర మెనిమిదోనాడు* 

బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవరోజు రాత్రి మలయప్పస్వామివారు ఒంటరిగా, కలిపురుషుని వేషధారణలో, శిరస్త్రాణభూషితుడై, నడుముకు కత్తి డాలు ధరించి, ఒక చేతియందు చర్నాకోల, మరో చేతితో గుర్రపు పగ్గాలు చేబూని, యుద్ధానికి సిద్ధంగా ఉన్న వీరాధివీరుని వలె, అశ్వవాహనంపై రాచఠీవి ఉట్టిపడేలా ఊరేగుతారు.

అశ్వానికి చారిత్రక, పౌరాణిక, ఆధ్యాత్మిక, సమకాలీన ప్రాశస్త్యం విశేషంగా ఉంది. వేగానికి ప్రతీక అయిన అశ్వం చతురంగబలాలలో ప్రధానమైనది. యుద్ధాలలో సైనికులు గుర్రాలనెక్కి యుద్ధం చేస్తుండగా, దళాధిపతులు, రారాజులు తమతమ హోదాలను బట్టి అశ్వాలు పూన్చిన రథాలపై నుండి సమరం సాగించేవారు. విశ్వాసానికి మారుపేరైన అశ్వరాజాలు తమ యజమానులను కాపాడటం కోసం, తమ ప్రాణాలను పణంగా పెట్టిన ఉదంతాలు చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయి. 

‌ పురాణేతిహాసాల ననుసరించి శ్రీహరి శ్రీనివాసునిగా భూలోకంలోని వేంకటాచలంచేరి పద్మావతిదేవిని పరిణయమాడటం కోసం వేట నెపంతో, ఖడ్గధారియై, అశ్వంమీద నారాయణవనానికేతెంచారు. క్షీరసాగరమథనంలో పుట్టిన ఉచ్ఛైశ్రవము అనే అశ్వరాజ్యాన్ని ఇంద్రుడు తన వాహనంగా స్వీకరించాడు. శ్రీమహావిష్ణువు యొక్క జ్ఞానావతారాలలో మొదటిది "హయగ్రీవుని" అవతారం. హయగ్రీవుడంటే, "గుర్రం ముఖం కలిగిన దైవం" అని అర్థం. హయగ్రీవునికి గుర్రం ముఖం ఉండటం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. 

ఒకానొకప్పుడు పదివేల ఏండ్లపాటు నిర్విరామంగా రాక్షసులతో యుద్ధం చేసి అలసిపోయిన శ్రీమహావిష్ణువు అల్లెత్రాడుతో (వింటినారితో) ఇరుకొనలూ బిగించి కట్టబడిన "శాబ్ధం" అనబడే ధనుస్సు యొక్క ఒక కొనను నేలపై నుంచి, మరొక కొనపై గెడ్డాన్ని ఆన్చి, నుల్చొని ఉండే నిద్రపోతాడు ( *"...శాఙ్గధన్వా గదాధరః"* అన్న 107వ విష్ణుసహస్రనామ శ్లోకాన్ని స్మరణకు తెచ్చుకోండి). ఆయనను నిద్రనుండి మేల్కొలపటానికి దేవతలు భయపడుతుంటే బ్రహ్మదేవుని ఆజ్ఞమేరకు ఓ *"వమ్రి"* (చెదపురుగు), వింటినారిని కొరికి శ్రీహరికి నిద్రాభంగం కావించే ప్రయత్నం చేస్తుంది. కానీ, దురదృష్టవశాత్తూ వింటినారి తెగడంతో, ధనుస్సు యొక్క కోపు అతివేగంగా వెళ్ళి విష్ణువు యొక్క తలను ఛేదించగా, ఆ శిరస్సు వెళ్ళి ముల్లోకాలకు ఆవల పడుతుంది. ఈ హఠాత్సంఘటనకు నివ్వెరబోయిన దేవతలు, లక్ష్మీదేవి యానతి ననుసరించి, ఓ అశ్వరాజాన్ని వధించి దాని శిరస్సును తీసుకుని వస్తారు. దేవశిల్పి గుర్రం తలను విగతజీవియైన విష్ణుమూర్తి మొండానికి అతికించగా, బ్రహ్మదేవుడు తిరిగి ప్రాణం పోస్తాడు. ఇదంతా, లోకకళ్యాణార్థం, పూర్వపు యుగాల శాపాలు-వరాల ననుసరించి జరుగుతుంది. 

సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి హయగ్రీవుని ఆలయం, ఉత్తరమాడవీధి చివరిభాగంలో, స్వామిపుష్కరిణి యొక్క ఈశాన్యదిక్కుకు ఎదురుగా స్థితమై ఉంది. 

బ్రహ్మోత్సవాలలో మొట్టమొదటిదైన "పెద్దశేషవాహనం" కుండలినీ యోగానికి ప్రతీక అయితే, చిట్టచివరిదైన "అశ్వవాహనం" ఓంకారానికి సంకేతం.

 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

99490 98406

కామెంట్‌లు లేవు: