శు భో ద యం 🙏
పోతన రూపచిత్రణ!
మ: త్రిజగ న్మోహన నీలకాంతి తనువుద్దీపింపఁ బ్రాభాత నీ
రజ బంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల , నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్!
ఆం: భాగవతం- ప్రధమస్కంథం- 247: వ: పద్యము;
ముల్లోకాలను మైమరపించే నీలమేఘ ఛ్ఛాయగల తనువుతో, ఉదయారుణ కిరణ కాంతిని
ప్రతిఫలించు నుత్తరీయంబుతో ,గాలికి నూయలలూగు నల్లని ముంగురులతో నొప్పు ముఖారవిందముతో చూడముచ్చటఁ గొల్పుచు మా అర్జును దరికి నరుదెంచుచుండు అందగాడు శ్రకృష్ణుఁ డెల్లవేళల నామదిలో నిలచుగాక! అనిభీష్మ స్తుతి;
నల్లనివాడే గాని యామేనిలో నొక మెఱపున్నది. ఆకర్షణ యున్నది. అదియెంతటిదనగా ముల్లోకములను మోహింప జేయు నంతటిదట! ఆమూర్తి కన్నుల బడెనా అంతే ఆయాకర్షణ ప్రవాహమున గొట్టికొని పోవలసినదే!
ఇఁక నాతఁడు ధరించిన పీతాంబరమా ఉదయారుణ కాంతి రంజితమై చూపరులకు యింపు నింపు చున్నది.
కృష్ణుడు కదలివచ్చుచుండ బాలసూర్యోపమ మైన కాంతిపుంజ వలయమేర్పడుటకా వస్త్రము ఆధారమగుచున్నది. ఎంత యద్భుతము!
మోమా అరవిందమును బోలియున్నది. అది నల్లని ముంగులతో శోభాయమానమై యున్నది.కవి బయటకు చెప్పకున్నను తుమ్మెదలు ముసిరిన పద్మమును బోలియున్నది.
ఇంత యందమును మూటగట్టి వచ్చువాడు వన్నెలాడు (సోకులరాయడు) గాకుండునా?
ఇదీ పోతన గారి యద్భుత రూప చిత్రణా 🌷సామర్ధ్యము!
స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి