29, జూన్ 2021, మంగళవారం

సాధకుడి లక్షణాలు..*

 *కార్య సాధకుడి లక్షణాలు..*


దుస్సాధ్యమైన కార్యాలను సాధించాలంటే ఆ ప్రయత్నం చేసే వాళ్లకు కొన్ని లక్షణాలు ఉండాలి. IAS pass అవ్వడము, ఏదైనా కొత్త project కానీ institution కానీ  మొదలుపెట్టి పైకి తీసుకు రావడము, జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో కానీ మరేదైనా విషయంలో గాని గొప్ప గుర్తింపు పొందడం ఇలాంటి పనులు అందరూ చెయ్యలేరు. అటువంటి పనులు చేసేవాళ్లను గొప్ప వాళ్ళు అంటాము.


నిత్యజీవితంలో మామూలుగా చెయ్యవలసిన పనులను కూడా కొంతమంది పాడు చేసుకుంటుంటారు. కొద్దిమంది తాము సాధించవలసిన విషయాలను అనాయాసంగా సాధిస్తుంటారు. వీళ్లను లోకంలో కార్యసాధకులు అంటారు. వాళ్లకుకొన్ని లక్షణాలు ఉంటాయి. 


*ఆత్మ విశ్వాసము* :: అటువంటి పని సాధించడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు పరికరాలు సహాయకాలు (resources) తన దగ్గర ఉన్నాయా లేవా,  అవి సమకూర్చుకో గలమా లేమా అనేవి ముందుగా ఆలోచించుకొని ఆ పని మొదలు పెట్టాలి. ఆత్మ విశ్వాసము అహంకారము రెండూ  చూడడానికి ఒకే లాగా ఉంటాయి. మనకు ఉన్నది ఆత్మ విశ్వాసము, ఎదుటి వాడికి ఉన్నది అహంకారము అనుకుంటాము. మనకు నిజంగా శక్తి నేర్పు ఉండి పని మొదలు పెడితే అది ఆత్మవిశ్వాసము. అవి లేకుండా పని మొదలు పెడితే అది అహంకారము.


*పధకం ప్రకారం ముందుకు వెళ్ళడము* :: College లో చేరి fees కట్టి పుస్తకాలు కొనుక్కోగానే ప్రతివాడు 1st క్లాసులో pass అవ్వాలి అనుకుంటారు. రేపటి నుంచి చదువు మొదలు పెడదాము అనుకుంటారు. Gold Medal తెచ్చుకునేవాడు ఆ college మొత్తానికి ఒకడుంటాడు. వాడు మాత్రం ఆ రోజు నుంచే చదువు మొదలు పెడతాడు. సెలవుల్లో కూడా రోజూ చదువుతూనే ఉంటాడు. వాడికి ఆడుకోడానికి సమయం ఉంటుంది పరీక్షలప్పటికి మానసిక ఒత్తిడి ఏమీ ఉండదు. రేపటి నుంచి చదువుకుందాము అనుకున్న వాడు సరిగ్గా పరీక్షల ముందు పుస్తకాలు తెరుస్తాడు. మొదటి వాడిది structured planning అంటారు. రెండవ వాడిది day dreaming అంటారు.


*వాస్తవ దృక్పధం* :: Resources గురించీ, contingency plans గురించి ముందే ఆలోచించు కోవడం కూడా structured planning లో భాగమే. మొదలు పెట్టబోయే పని యొక్క కష్ట నష్టాలు సరిగ్గా బేరీజు వేసుకొని మన శక్తి సామర్థ్యాలు లెక్కించుకుని అప్పుడు తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం అవుతుంది.  


*లక్ష్య శుద్ధి* :: కొంతమంది చాలా ఉత్సాహంగా సంగీతం క్లాసులలో డాన్స్ క్లాసులో కరాటే క్లాసులలో చేరి పోతుంటారు. చేరే వాళ్ళు వంద మంది అయితే అందులో drop outs 80 మంది ఉంటారు. 20:80 rule  (Pareto Principle) ఇటువంటి విషయాల్లో బాగా work out అవుతుంది. ప్రధానమైన కారణాలు బద్ధకము, మొదలు పెట్టినప్పుడు ఉన్న ఉత్సాహం ఆఖరి దాకా ఉండకపోవడము. దీనిని లక్ష శుద్ధి లేకపోవడము అంటారు. 


*మనోబలము* :: అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. అనుకోని ఇబ్బందులు అడ్డంకులు ఆపదలు మధ్యలో ఎదురవుతాయి.  మనోబలము లేకపోతే మధ్యలో వచ్చే అడ్డంకుల దగ్గర ఆగి పోతుంటారు. మధ్యలో కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు కుంగి పోకూడదు. వీటన్నింటికీ కూడా సిద్దపడి ఉండాలి.  ధైర్యంగా ముందుకు పో గలగాలి. సగం అయిపోయింది ముక్కాలు సాధించాము. 90% చేతిలోకి వచ్చింది. ఇట్లా గా పని పూర్తి కాకుండానే సంతోష పడకూడదు. ఆఖరులో కూడా ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. అఖరు దాకా ఓపిక తో ఉండాలి. 


*సామర్థ్యము* :: మధ్యలో  వచ్చే కొన్ని అడ్డంకులు ఇబ్బందులు అధిగమించడానికి సమయస్ఫూర్తి తెలివితేటలు పట్టుదల మొదలైన మానసిక శక్తులు కావాలి. కొన్ని రకాల అడ్డంకులను అధిగ మించడానికి ఆరోగ్యము, శారీరక బలము  మొదలైన శక్తులు కావాలి.


సుందరకాండ మొదటి సర్గ లో హనుమంతుడు నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి సీతాదేవిని వెతికి కనిపెట్టి తిరిగి రావడానికి సంకల్పించుకుంటాడు. వాల్మీకి ఈ పనిని "దుష్కరం  నిష్ప్రతి ద్వంద్వం" అని వర్ణిస్తాడు. లంకలో సీతను వెతికే టప్పుడు పట్టుబడితే దిక్పాలకులను జయించిన రావణుడి తోనూ ఇంద్రుని జయించిన ఇంద్రజిత్తు తోనూ ఒంటరిగా యుద్ధం చేయాల్సి రావచ్చు. అక్కడికి వెళ్లే వాడు ఇందుకు సిద్ధపడి వెళ్లాలి. ఆంజనేయుడు ఇదంతా ఆలోచించుకొనే వెళ్లడానికి సంకల్పం చేస్తాడు. ఈ సంకల్పం అనేది ధైర్యానికి ఆత్మవిశ్వాసానికి ఉదాహరణము. 


మధ్యలో మైనాకుడి ఉదంతం లక్ష్య శుద్ధి కి అలసత్వం (pro​cras​ti​na​tion) లేకుండా ఉండడానికి పట్టుదలకు ఉదాహరణము. Gold Medal సంపాదించే పిల్లల గురించి ఇందాక చెప్పుకున్నాము. కాస్త గమనించి చూడండి. అటువంటి పిల్లలు మిగతా పిల్లలతో కలిసి TV చూస్తూ కూడా వాళ్ల home work వాళ్లు చేసుకుంటూ  ఉంటారు. అదే వాళ్లకూ, మిగతా పిల్లలకూ  తేడా.  మైనాకుడు ఆంజనేయుడి పని చెడ గొడదాము అనుకోలేదు. కానీ మైనాకుడి మాట విని మొహమాట పడి ఆతిథ్యం స్వీకరించి ఉంటే హనుమంతుడి కి ఆరోజు పని చెడి ఉండేది.   ఆంజనేయుడికి అది బాగా తెలుసు. 


సురసను జయించడం  సమయ స్ఫూర్తి కి తెలివి తేటలకు పరీక్ష. పైగా అది ఆయనకు దేవతలు పెట్టిన పరీక్ష. ఆమె రాక్షసి రూపంలో కనిపించినప్పటికీ ఆమెను గుర్తు పట్టి "దాక్షాయిణి నమోస్తుతే" అని నమస్కరిస్తాడు. అంటే ఆంజనేయ స్వామి రాక్షసుల మాయల కే కాదు దేవతల మాయలకు కూడా లో పడడు. ఆయన వద్ద భ్రమ ప్రమాదాలకు అవకాశం లేదు. సురస నాగమాత. ఆమెను మెప్పించి ఆమె ఆశీస్సులను దేవతల ఆశీర్వాదాన్ని కూడా సంపాదించుకుంటాడు. 


సింహికను సంహరించడం ఆయన శక్తిసామర్థ్యాలకూ నేర్పుకూ ఉదాహరణ. స్త్రీ అని చెప్పి లంకిణి ని చంపకుండా మెల్లిగా ఎడమ చేతితో గుద్దుతాడు. మరి సింహికను ఎందుకు చంపినట్లు. లంకిణి ఆంజనేయుడు దొంగతనంగా లంకలో ప్రవేశింస్తూ ఉంటే అడ్డుకుంటుంది. అది ఆమె బాధ్యత. సింహిక దారే పోయే వాళ్ళను మింగుతుంటుంది. ఈవిడ లోక కంటకి. అందువల్ల తాటికి లాగే  ఈవిడను ను చంపడం కూడా  అధర్మం కాదు.


హనుమంతుడు ఈ అడ్డంకులను అధిగ మించడం చూసి దేవతలు మొదలైన వాళ్ళు హనుమను ప్రశంసిస్తూ ఇలాగంటారు. 


*ధృతి ర్ద్రుష్టి ర్మతి ర్దాక్షం*

*స్వ కర్మసు న సీదతి*

*స తై స్సంభావితః పూజ్యః*

*ప్రతిపన్న ప్రయోజనః*


సుందర కాండ ప్రధమ సర్గ శ్లోకం 201.


పై శ్లోకంలో హనుమంతుడి లో దేవతలు చూసి మెచ్చుకున్న గుణాలు : ధైర్యము (ఆత్మవిశ్వాసము), లక్ష్యశుద్ధి,  సమయస్ఫూర్తి, పటుత్వము. ఇవే కార్య సాధకుడి లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్న వాడు తలపెట్టిన అన్ని పనులను సాధించుకో గలుగుతాడు అని ఆ శ్లోకానికి అర్థము. ఇక్కడితో కథ అయిపోలేదు.


*ఓర్పు* :: లంకలో సీతాదేవి కనపడనప్పుడు ఆంజనేయుడు దిగులు పడతాడు. కానీ ఆశ వదిలిపెట్టడు పట్టుదల వదిలిపెట్టడు. దీన్నే మనం positive thinking అంటాము. చితి  చనిపోయిన మనిషిని దహిస్తుంది. చింత బతికున్న మనిషిని దహిస్తుంది. అందువల్ల చితి చింతల మధ్య చింతయే ఎక్కువ ప్రమాదకారి. మనిషి negetive ఆలోచనలను అదుపులో పెట్టుకుంటేనే ఏదైనా సాధించగలుగుతాడు. పని పూర్తయ్యే దాకా balanced thinking & positive thinking రెండూ ఉండాలి. అసహనం రాకూడదు.  నిరుత్సాహ పడ కూడదు. ఓపికతో ఉండాలి.


*మాట నేర్పు*  ::  ఆంజనేయుడు మొదటిసారి రాముడితో మాట్లాడినప్పుడు ఆయన మాటల నేర్పుకు శ్రీరాముడు ఉబ్బితబ్బిబ్బైయ్యాడు.  సీతాదేవితో పరిచయం చేసుకునే టప్పుడు ఆమెకు ధైర్యం చెప్పేటప్పుడు ఆంజనేయ స్వామి చాలా పొందికగా మాట్లాడతాడు. అంతకుముందు ఏమాత్రమూ పరిచయం లేని సీతకు ఆంజనేయుడు అత్యంత ప్రీతిపాత్రమైన నమ్మకమైన వ్యక్తిగా మారతాడు. పట్టాభిషేకానికి ముందు రాముడు పంపితే వెళ్లి భరతుడు తో అప్పటివరకు జరిగిన  విషయాలన్నీ చెప్పి రాముడు వస్తున్నాడు అనే వార్త తెలియజేస్తాడు. అప్పుడు  భరతుడు కూడా ఈయన మాటలకు పరవశుడై నాకు సోదరుడితో తో సమానము అని పొగుడుతాడు. కార్యసాధకుడు అంటే కొత్తగా పరిచయమైన వాళ్లతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి.  దీనికి మాట నేర్పు చాలా అవసరం. ఇది ఆంజనేయస్వామిని చూసి అందరూ నేర్చుకోవాలి.


*రామాయణం లో ఆంజనేయుడి నడవడిక ద్వారా  మానవాళికి వాల్మీకి  అందించిన personality development పాఠాలు ఇవి.  వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన వేరే పుస్తకాలు  చదివేటప్పుడు కుడా  ఆంజనేయ స్వామిని ఉదాహరణగా తీసుకుని,  రామాయణాన్ని సరిగా అన్వ యించుకుని  చదివితే  విషయం ఇంకా బాగా అర్థం అవుతుంది...*


*పవని నాగ ప్రదీప్.*

కామెంట్‌లు లేవు: