29, జూన్ 2021, మంగళవారం

వేదాలు అపౌరుషేయాలు

 వేదాలు అపౌరుషేయాలు అని చెప్పుకున్నాం. అనాదికాలం నుంచీ అవిచ్చిన్నంగా గురు శిష్య పరంపరగా మనకు అంది వస్తున్నాయి. అవి శాశ్వతాలని కొందరు నమ్ముతారు. ఇవి ఎలా మొదలయ్యాయి అనే దాన్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చరిత్రకారులు క్రీస్తు పూర్వం 1500 సవత్సరాల నాటివి అని కొందరు, క్రీ.పూ 3000 నాటివని కొందరూ అభిప్రాయ పడుతున్నట్లు చెబుతారు.


జగత్తును సృష్టించిన పిదప శ్రీమన్నారాయణుడే వేదాన్ని మరీచ్యాది ఋషులకు ప్రవృత్తి ధర్మంగాను, సనకాదులకు నివృత్తి ధర్మంగాను ఉపదేశించగా వారి ద్వారా వేదం ప్రచారమైనట్లు ఆది శంకరులు వ్రాశారు.


వేదంలో జ్ఞానం ; పరా విద్య, అపరా విద్య అని రెండి విధాలుగా ఉంది. పూర్వ భాగంలో కర్మకాండ ప్రతిపాదించ బడింది. ఇది అపరా విద్య- దీన్నే ప్రవృత్తి ధర్మం అనికూడా అంటాం. చివరిభాగంలో ఆత్మజ్ఞానాన్ని బోధించే పరావిద్య ఉంది. దీన్నే నివృత్తి ధర్మం అంటాం. ఇది ఆదికాలం నుంచీ అందివస్తున్న మూలగ్రంధం అవడం చేత - 'నిగమం' అనీ, గురుశిష్య పరంపరగా వినే దివ్యవాణి గనుక - 'శృతి' అనీ , మననం చేసుకోడం ద్వారా నేర్చుకోబడే విద్య అవడం చేత - 'ఆమ్నాయం 'అనీ పేర్లు ఉన్నాయి.


వేదంలో కర్మకాండ ధార్మిక క్రియలనూ, విధులను ఆచారాలనూ చెబుతుంటే, జ్ఞానకాండ ఆత్మ పరమాత్మలను, ప్రకృతి స్వరూపాలను గురించీ చెబుతుంది. మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది. కాల క్రమేణా విద్యార్ధులు అర్ధంచేసుకొని వల్లి౦చడానికి కష్టమవడం వల్ల ద్వాపరయుగం ప్రారంభంలో కృష్ణద్వైపాయనుడు అనబడే వ్యాస మహర్షి దాన్ని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అని నాలుగు భాగాలుగా విభజన చేశాడు. అలా విభజించిన వేదాలను తన శిష్యులకు బోధించేడు. కాలక్రమంలో ఈ గురువుల శిష్యులు వర్ధిల్లి , పరస్పరమూ విడిపోగా అనేక శాఖలు మొదలయ్యాయి. అలా ఏర్పడిన శాఖలకు కఠ, కౌతుమ, వాజసనేయ, మాధ్యందిన అనే పేర్లతో పిలువబడుతున్నాయి.


ప్రతీ వేదాన్నీ తిరిగి నాలుగు భాగాలుగా తీర్చి దిద్దేరు. వీటిలో మంత్ర భాగాన్ని సంహిత అనీ, సంహితలో మూలవిషయాన్ని వివరించడానికి ఉద్దేశించబడిన భాగాలకు బ్రాహ్మణములు అనీ అంటారు. వీటిలో యజ్ఞాలు మొదలైన కర్మకాండ ఎలా చెయ్యాలో తెలుపబడింది. ఇక మూడవది అరణ్యకాలు . ఇవి కర్మ ప్రతిపాదితమైనా కర్మల భౌతికభాగానికి గాక యజ్ఞ నిర్వహణలో ధ్యానానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇవి ఏకాంత వ్రతాన్ని స్వీకరించి వనాలలో నివసించే వానప్రస్థులు వల్లించడం కోసం ఉద్దేశించ బడ్డాయి. ఇక వేదాల్లో చివరి భాగాలకు ఉపనిషత్తులని పేరు. ఇవి వేద విజ్ఞతకంతకూ సారం. వేదాల చివరి భాగం అవడం చేతనూ, వీటిని తెలుసుకుంటే ఇక తేలుసుకోవలసినదేదీ ఉండని కారణంగాను - వేదాంతం అని అంటారు. వేద శాఖలకు అనుగుణంగా అనేక ఉపనిషత్తులు వెలిశాయి. వీటిలో 108 చదువదగ్గవని నిర్ణయించడం జరిగింది. వీటిలో 10 - 12 ఉపనిషత్తులు మాత్రమే ముఖ్యమైనవిగా పరిగణించ బడుతున్నాయి. ఇదే సంగ్రహంగా వేదాల గురించి.

కామెంట్‌లు లేవు: