*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - డెబ్బది నాలుగవ అధ్యాయము*
*శ్రీకృష్ణభగవానుని అగ్రపూజ శిశుపాలుని ఉద్ధారము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*74.18 (పదునెనిమిదవ శ్లోకము)*
*సదస్యాగ్ర్యార్హణార్హం వై విమృశంతః సభాసదః|*
*నాధ్యగచ్ఛన్ననైకాంత్యాత్సహదేవస్తదాబ్రవీత్॥11373॥*
సదస్యులలో అగ్రపూజకు అర్హులైన విషయమున ఏకాభిప్రాయము కుదరకుండెను. అచటనున్నవారు ఎవరికివారు తమ అభిప్రాయములను వేర్వేరుగా తెలిపిరి. అప్పుడు మాద్రిపుత్రుడగు సహదేవుడు ఇట్లు వచించెను-
*74.19 (పందొమ్మిదవ శ్లోకము)*
*అర్హతి హ్యచ్యుతః శ్రైష్ఠ్యం భగవాన్ సాత్వతాంపతిః|*
*ఏష వై దేవతాః సర్వా దేశకాలధనాదయః॥11374॥*
"సభాసదులారా! యదువంశ శిరోమణియగు శ్రీకృష్ణభగవానుడే సదస్యులందఱిలో శ్రేష్ఠుడు. అందువలన అతడే అగ్రపూజకు అర్హుడు, సకలదేవతాస్వరూపుడు. అంతేగాదు, దేశకాలధనాది వస్తువులు అన్నియును ఆయన రూపములే.
*74.20 (ఇరువదియవ శ్లోకము)*
*యదాత్మకమిదం విశ్వం క్రతవశ్చ యదాత్మకాః|*
*అగ్నిరాహుతయో మంత్రాః సాంఖ్యం యోగశ్చ యత్పరః॥11375॥*
ఈ విశ్వమంతయును శ్రీకృష్ణుని రూపమే. సకల యజ్ఞములును శ్రీకృష్ణుని స్వరూపములే. ఆ మహాత్ముడే అగ్నిగా, ఆహుతులుగా, మంత్రములుగా విలసిల్లుచున్నాడు. జ్ఞాన, కర్మ యోగములు ఆ ప్రభువును చేరెడి మార్గములు.
*74.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*
*ఏక ఏవాద్వితీయోఽసావైతదాత్మ్యమిదం జగత్|*
*ఆత్మనాఽఽత్మాశ్రయః సభ్యాః సృజత్యవతి హంత్యజః॥11376॥*
సదస్యులారా! శ్రీకృష్ణుడు ఒక్కడే అద్వితీయుడైన పరబ్రహ్మము. చిదచిదాత్మకమైన ఈ సంపూర్ణజగత్తు ఆ స్వామి రూపమే. సమస్త జగత్తునకు అతడే ఆధారము. అతనికి వేఱొకటి ఆధారము కాదు. ఈ లోకములను అన్నింటిని తన సంకల్ప మాత్రమున అతడు సృష్టించును, పాలించును, లయమొనర్చును, అతడు జన్మాది షడ్వికారములు లేనివాడు.
*74.22 (ఇరువది రెండవ శ్లోకము)*
*వివిధానీహ కర్మాణి జనయన్ యదవేక్షయా|*
*ఈహతే యదయం సర్వః శ్రేయో ధర్మాదిలక్షణమ్॥11377॥*
ఈ జగత్తులోని జనులు అందఱును శ్రీకృష్ణుని అనుగ్రహముచేతనే అనేక విధములైన కర్మలను అనుష్ఠించుచు *ధర్మార్థకామమోక్షములు* అను చతుర్విధ పురుషార్థఫలములను పొందుచున్నారు.
*74.23 (ఇరువది మూడవ శ్లోకము)*
*తస్మాత్కృష్ణాయ మహతే దీయతాం పరమార్హణమ్|*
*ఏవం చేత్సర్వభూతానామాత్మనశ్చార్హణం భవేత్॥11378॥*
అందువలన మహాత్ముడైన శ్రీకృష్ణునకే అగ్రపూజను సమర్పింపవలయును. ఆ స్వామిని పూజించినచో సకలప్రాణులను పూజించినట్లేయగును. అంతేగాక, మనలను మనము గౌరవించుకొనినట్లు కాగలదు.
*74.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*
*సర్వభూతాత్మభూతాయ కృష్ణాయానన్యదర్శినే|*
*దేయం శాంతాయ పూర్ణాయ దత్తస్యానంత్యమిచ్ఛతా॥11379॥*
శ్రీకృష్ణుడు సకలప్రాణులలో అంతర్యామియై విలసిల్లువాడు. భేదబుద్ధిరహితుడు, శాంతుడు (రాగద్వేషములు లేనివాడు), పరిపూర్ణుడు.అట్టి శ్రీకృష్ణునకు దానము చేయుట (అగ్రపూజచేయుట) యుక్తము. అట్లొనర్చుటవలన అక్షయత్వము సిద్ధించును".
*74.25 (ఇరువది ఐదవ శ్లోకము)*
*ఇత్యుక్త్వా సహదేవోఽభూత్తూష్ణీం కృష్ణానుభావవిత్|*
*తచ్ఛ్రుత్వా తుష్టువుః సర్వే సాధు సాధ్వితి సత్తమాః॥11380॥*
*74.26 (ఇరువది ఆరవ శ్లోకము)*
*శ్రుత్వా ద్విజేరితం రాజా జ్ఞాత్వా హార్దం సభాసదామ్|*
*సమర్హయద్ధృషీకేశం ప్రీతః ప్రణయవిహ్వలః॥11381॥*
శ్రీకృష్ణుని మహిమను, ప్రభావమును బాగుగా ఎఱిగిన సహదేవుడు ఇట్లు పలికి మిన్నకుండెను. ధర్మరాజు యొక్క యజ్ఞసభలోనున్న సత్పురుషులు అందఱును ఆ మాటలను విని సంతసించుచు 'బాగు బాగు' అనుచు ముక్తకంఠముతో తమ ఆమోదమును తెలిపిరి. అంతట సదస్యుల అభిప్రాయములను ఎఱింగి, ధర్మరాజు పరమానందభరితుడయ్యెను. బ్రాహ్మణోత్తముల ఆజ్ఞను గైకొని భక్తిపరవశుడై జితేంద్రియుడగు కృష్ణపరమాత్మను చక్కగా పూజించెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి డెబ్బది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి