29, జూన్ 2021, మంగళవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*చదువు..సంభాషణ..*


శ్రీ స్వామివారి కి ఆహారం ఇచ్చి రావడమనేది నేను మొగలిచెర్ల లో ఉన్నన్ని రోజులూ నా దినచర్య గా మారిపోయింది..ఒక్కొక్కసారి శ్రీ స్వామివారు పలకరించేవారు..ఒక్కొక్కరోజు శ్రీ స్వామివారి దర్శనం కూడా  అయ్యేది కాదు..ధ్యానం లో ఉండిపోయేవారు..వేసవి సెలవులు పూర్తి కాగానే నేను తిరిగి కనిగిరికి చదువుకోవడానికి వెళ్ళిపోయాను..


1974 వ సంవత్సరం దసరా సెలవుల్లో ఒకటి రెండు సార్లు శ్రీ స్వామివారిని దర్శించుకునే అవకాశం మాత్రం కలిగింది..అమ్మా నాన్న గార్లు మాత్రం శ్రీ స్వామివారితో నిరంతర సంబంధం కలిగి ఉన్నారు..రోజులు గడచిపోతున్నాయి..


1975 వేసవి సెలవులకు నేను మొగలిచెర్ల వచ్చినప్పుడు  ఒకరోజు ఉదయాన్నే శ్రీ స్వామివారి ఆశ్రమానికి వెళ్ళాను..శ్రీ స్వామివారు ఆశ్రమం బైట నిలబడి వున్నారు..నన్ను చూడగానే.."ఎప్పుడొచ్చావు?.." అన్నారు..


"రెండు రోజులయింది స్వామీ.." అన్నాను..


"ఇంత పెందలాడే ఇటొచ్చావు.. మాగాణి కి పోతున్నావా?.." అన్నారు..


"లేదు స్వామీ..మిమ్మల్ని కలుద్దామని అనుకున్నాను..మీరు ధ్యానం లో వుంటే..ఇక్కడే వేచి వుండి కలసి పోదామని అనుకున్నాను.." అన్నాను..


"ఈ సన్యాసి కాడ ఏముందని చూడటానికి వచ్చావు..ఎలాగూ వీలున్నప్పుడు అన్నం డబ్బా తీసుకొస్తున్నావు కదా?..సరేలే..రా!..ఇక్కడ కూర్చో! " అన్నారు..తాను ధ్యానం చేసుకొనే గదిముందు వరండాలో కూర్చున్నారు..నేను కొద్దిగా దూరంగా మెట్ల కింద కూర్చున్నాను..


"ఇప్పుడు ఏం చదువుతున్నావు?.." 


"పదవ తరగతి పరీక్షలు వ్రాసాను..ఇంకా ఫలితాలు రాలేదు.." అన్నాను..


"పెద్దగా చదువు అబ్బినట్లు లేదే.."మొత్తమ్మీద నెట్టుకొస్తావు లే!.." అన్నారు నవ్వుతూ..


తలొంచుకున్నాను..నిజమే..నేను చదువులో వెనుకబడే వున్నాను..అతి కష్టమ్మీద అత్తెసరు మార్కులతో గట్టెక్కుతున్నాను..మా ముగ్గురిలో నేనే చదువులో మొద్దును..సిగ్గుగా అనిపించింది..మౌనంగా ఉండిపోయాను..శ్రీ స్వామివారికి ఈ విషయం ఎలా తెలిసిందా అని కొద్దిగా మథన పడ్డాను కూడా..


కొద్దిసేపు శ్రీ స్వామివారు కూడా  ఏమీ మాట్లాడకుండా వున్నారు..తరువాత లేచి తాను ధ్యానం చేసుకునే గది తలుపులు పూర్తిగా తెరచి పెట్టారు..ఆ గదిలో ఒక మూల ఉన్న పాదుకలను కాళ్లకు వేసుకొని..ఇవతలకు వచ్చి..నా ముందునుంచే నడుచుకుంటూ బావి దగ్గరికి వెళ్లి రెండు నిమిషాల పాటు అక్కడే నిలబడి..ఆశ్రమం చుట్టూరూ ప్రదక్షిణగా ఒకమారు తిరిగి వచ్చి..నాకు కొద్దిదూరంలో నిలబడ్డారు..నేనూ లేచి నిలుచున్నాను..


"అమ్మా నాన్న లను ఒకసారి వచ్చి వెళ్ళమని చెప్పు.." అన్నారు..


"సరే స్వామీ..నేను వెళ్ళొస్తాను.." అన్నాను..సరే నన్నట్లు తల ఊపారు..నాతో బాటు ప్రహరీ ద్వారం దాకా వచ్చి.."మర్చిపోకుండా నాన్నకు అమ్మకు చెప్పు..ముఖ్యమైన విషయం మాట్లాడాలి..వీలైతే ఈరోజు సాయంత్రం రమ్మనమని చెప్పు.." అన్నారు..సరే నని చెప్పి..నేరుగా ఇంటికొచ్చి అమ్మా నాన్న లకు శ్రీ స్వామివారు రమ్మంటున్నారని చెప్పాను..ఆరోజు సాయంత్రమే అమ్మా నాన్న శ్రీ స్వామివారిని కలవడానికి ఆశ్రమానికి వెళ్లారు..


ఆశ్రమం నుంచి తిరిగొచ్చిన అమ్మా నాన్న గార్లు ఏదో తీవ్రమైన సమస్యలో ఉన్నట్లు తోచింది..కొద్దిసేపటికి అర్ధమైన విషయమేమిటంటే..శ్రీ స్వామివారు తనను జీవసమాధి చేయమని కోరారట!..


సాధన..సజీవ సమాధి వివరణ!..రేపటి భాగంలో...


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: