29, జూన్ 2021, మంగళవారం

సంస్కృత మహాభాగవతం

 *29.06.2021  ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము -  డెబ్బది నాలుగవ అధ్యాయము*


*శ్రీకృష్ణభగవానుని అగ్రపూజ శిశుపాలుని ఉద్ధారము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*74.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*తత్పాదావవనిజ్యాపః శిరసా లోకపావనీః|*


*సభార్యః సానుజామాత్యః సకుటుంబోఽవహన్ముదా॥11382॥* 


పిదప ధర్మరాజు పత్నీసహితుడై నిర్మలజలములతో ఆ పరమపురుషుని పాదపద్మములను  కడిగెను. లోకములను పునీతమొనర్చునట్టి, ఆ శ్రీపాద తీర్థమును ఆ మహారాజు భార్యాసహితుడై తన శిరస్సున దాల్చెను. పిమ్మట ఆయన సోదరులను, అమాత్యులను, బంధుమిత్రులను ఆ తీర్థజలములను తమ శిరస్సులపై చల్లుకొనిరి.


*74.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*వాసోభిః పీతకౌశేయైర్భూషణైశ్చ మహాధనైః|*


*అర్హయిత్వాశ్రుపూర్ణాక్షో నాశకత్సమవేక్షితుమ్॥11383॥*


అనంతరము యుధిష్ఠిరుడు కృష్ణప్రభువునకు పట్టుపీతాంబరములను, అమూల్యమైన ఆభరణములను, సంపదలను సమర్పించెను. నేత్రములు ఆనందాశ్రువులతో నిండియుండుటవలన ధర్మరాజు ఆ పురుషోత్తముని చక్కగా దర్శింపలేకపోయెను.


*74.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*ఇత్థం సభాజితం వీక్ష్య సర్వే ప్రాంజలయో జనాః|*


*నమో జయేతి నేముస్తం నిపేతుః పుష్పవృష్టయః॥11384॥*


నిండుసభలో శ్రీకృష్ణుడు అగ్రపూజను అందుకొనుటను జూచి, సదస్యులెల్లరును జయజయ ధ్వనులను గావించుచు ఆ ప్రభువుయొక్క పాదములకు ప్రణమిల్లిరి. ఆకాశమునుండి పుష్పవర్షములు కురిసెను.


*74.30 (ముప్పదియవ శ్లోకము)*


*ఇత్థం నిశమ్య దమఘోషసుతః స్వపీఠాదుత్థాయ  కృష్ణగుణవర్ణనజాతమన్యుః|*


*ఉత్ క్షిప్య బాహుమిదమాహ సదస్యమర్షీ సంశ్రావయన్ భగవతే పరుషాణ్యభీతః॥11385॥*


ధర్మరాజు శ్రీకృష్ణునకు అగ్రపూజచేయుటను, దానిని సదస్యులు ఎల్లరును సమర్థించుటను శిశుపాలుడు గమనించుచునేయుండెను. అందఱును శ్రీకృష్ణుని గుణములను ప్రశంసించుచుండుటవలన అసూయపరుడైన అతనిలో కోపము కట్టలు తెంచుకొనెను. వెంటనే అతడు తన ఆసనమునుండి దిగ్గున లేచి అసహనముతో ఊగిపోవుచు చేతిని పైకెత్తి, జంకుగొంకులేక నిండుసభలో కృష్ణప్రభువునకు వినబడునట్లుగా ఇట్లు పరుషవచనములను పలికెను.


*74.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*ఈశో దురత్యయః కాల ఇతి సత్యవతీ శ్రుతిః|*


*వృద్ధానామపి యద్బుద్ధిర్బాలవాక్యైర్విభిద్యతే॥11386॥*


"సదస్యులారా! 'సర్వమును శాసించే కాలమును ఎవ్వరునూ ఉల్లఘింపజాలరు' అని శ్రుతివాక్యము వాస్తవమే అనిపించుచున్నది. ప్రస్తుతము మూర్ఖుడైన ఒక బాలుని వచనములముందు జ్ఞానవృద్ధుల, వయొవృద్ధుల బుద్ధులుగూడ పనిచేయకుండుటయే అందులకు ప్రత్యక్ష నిదర్శనము.


*74.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*యూయం పాత్రవిదాం శ్రేష్ఠా మా మంధ్వం బాలభాషీతమ్|*


*సదసస్పతయః సర్వే కృష్ణో యత్సమ్మతోఽర్హణే॥11387॥*


ఈ సభలో అగ్రపూజకు అర్హులైన వారిని నిర్ణయించుటలో మీరు సర్వసమర్థులే. అందువలన 'అగ్రపూజకు శ్రీకృష్ణుడే అర్హుడు' అను బాలుడగు సహదేవుని వచనములకు మీరు సమ్మతింపవద్దు.


*74.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*తపోవిద్యావ్రతధరాన్ జ్ఞానవిధ్వస్తకల్మషాన్|*


*పరమఋషీన్ బ్రహ్మనిష్ఠాంల్లోకపాలైశ్చ పూజితాన్॥11388*


*74.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*సదస్పతీనతిక్రమ్య గోపాలః కులపాంసనః|*


*యథా కాకః పురోడాశం సపర్యాం కథమర్హతి॥11389॥*


ప్రస్తుతము ఈ సభలో గొప్ప తపస్సంపన్సులు, మహావిధ్వాంసులు, వ్రతనిష్ఠాగరిష్ఠులు, తత్త్వజ్ఞానముతో పాపతాపములను అధిగమించినవారు (తత్త్వవేత్తలు), మహర్షులు, లోకపాలురచే గూడ పూజలను అందుకొనునట్టి బ్రహ్మనిష్ఠాపరులు మొదలగువారు ఎందఱో గలరు. వారిని అందఱిని కాదని అగ్రపూజను పొందుటకు కులాధముడైన ఈ ఆలకాపరి ఎంతవఱకు అర్హుడు? పురోదాశమునకు (యజ్ఞపూతమైన అపూపమునకు) కాకి ఎట్లు యోగ్యమగును?


*74.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*వర్ణాశ్రమకులాపేతః సర్వధర్మబహిష్కృతః|*


*స్వైరవర్తీ గుణైర్హీనః సపర్యాం కథమర్హతి॥11390॥*


ఈ గోపాలుడు జాతీ, నీతీ లేనివాడు సమాజములో ఒకస్థాయిలేనివాడు. సద్వంశములో జన్మించినవాడు కాదు. సకల ధర్మములను వదలిపెట్టినవాడు. వేదశాస్త్రమార్గములను, లోకమర్యాదలను ఉల్లంఘించి, విశృంఖలముగా ప్రవర్తించువాడు, ఎట్టి గుణములను లేనివాడు ఇట్టి అవలక్షణములుగల ఈతడు పూజకు ఎట్లు అర్హుడగును?


*74.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*యయాతినైషాం హి కులం శప్తం సద్భిర్బహిష్కృతమ్|*


*వృథాపానరతం శశ్వత్సపర్యాం కథమర్హతి॥11391॥* 


మునుపు ఈతని వంశము యయాతి శాపమునకు గుఱియయ్యెను. అందువలన సత్పురుషులు ఇతని వంశమును బహిష్కరించిరి. ఈ విషయమును మీరును ఎఱుగుదురు. ఈతని కులమువారు ఎల్లప్పుడును మధుపానమునందే మునిగియుందురు. అట్టివంశమునకు చెందిన ఈతడు పూజకు ఎట్లు అర్హుడగును?


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి డెబ్బది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: