15, అక్టోబర్ 2022, శనివారం

ధర్మాకృతి

 ధర్మాకృతి : మహాస్వామి - మహర్షి - 3


రెండవసారి 1944 వచ్చేసరికి రమణ భక్తులకు కంచి స్వామిపై అత్యంత ఆదరభావమేర్పడింది. అప్పటికి కంచిస్వామి అనేకమంది భక్తులను రమణుల సలహాపై ఆధ్యాత్మికోన్నతి సాధించవలసినదిగా సూచించి పంపారు. 1930లో ఒక పంజాబీని, 1929 పాల్ బ్రంటన్ ను, ఇలా తమ మద్రాస్ ఉపన్యాసములలో రమణులకు జీవన్ముక్తులుగా బహుధా ప్రశంసించారు. కంచి భక్తులు రమణుల వద్దకు, రమణ భక్తులు కంచివారి వద్దకు వస్తూనే ఉన్నారు. ఈ రకంగా ఆశ్రమవాసులందరికీ కంచిస్వామిపై ఒక గౌరవభావం ఏర్పడింది.


భగవాన్ ఆశ్రమవాసులందరినీ ఒకవేళ కంచిస్వామి లోపలికి రాకుండా వెళ్ళిపోతే తప్పుగా అనుకోవద్దనీ, వారిని దర్శనం చేయమనీ సంసిద్ధులను చేశారట. స్వామివారు 8-9గం. మధ్య గేటు దరిదాపులకు వచ్చారు. ఆశ్రమవాసులంతా స్వామిని దర్శించడానికి గేటు వద్దకు వచ్చారు. నాగమ్మ గారు తాము ఒక్కరే రమణుల వద్ద మిగిలామని వ్రాశారు. రమణులు తాము మామూలుగా కూర్చుండే స్థలంలోనే కూర్చుని ఉన్నారు. “ఏం నీవు వెళ్ళలేదే” అన్నారట. ఆమెనుద్దేశించి “వారికి నావంటి వారిని (సకేశి బ్రాహ్మణ పూర్వ సువాసినులను) చూడరాదన్న నియమమున్నది కదా! వారి నియమాన్ని నేనెందుకు భంగపరచాలి” అని సమాధానమిచ్చారు. నాగమ్మగారు. అది సరి! అంటూ ఆదరపూర్వకమైన దృష్టితో చూసి మౌనం వహించారు. తరువాత కొంతసేపటికి అందరూ వచ్చి శ్రీవారు గేటువద్ద కొంచెం సేపు నిలబడి పరకాయించి చూసి వెళ్ళిపోయారని భగవాన్ తో విన్నవించారు.


అంతకుముందు కల్లూరు వీరభద్రశాస్త్రిగారు నాగమ్మ గారితో ‘స్వామివారిని చూసి వచ్చారా” అని ప్రశ్నించారట. దానికి ఆమె ‘నాకసలు భగవానుని వదిలి ఎక్కడకూ వెళ్లాలని లేదు. అయినా ఆ మాట బయటపెట్టక నాలాంటి వారిని వారు చూడరుకదా అన్నాను” అంటారు. నాగమ్మ గారి అనన్య భక్తి అతి శ్లాఘనీయమైనది. రమణ భగవానులు కూడా వారిపై అంతటి కృప చూపారని మనకు అనేక గ్రంథాల ద్వారా తెలుస్తోంది. అయితే అయినా “ఆ మాట బయట పెట్టక” పోవడమెందుకో?


రమణుల తండ్రిగారి పేరు సుందరుడు, తల్లి గారి పేరు సుందరమ్మ(అలఘమ్మ) – పుత్రుని పేరు రమణులు. ఎంతో సబబుగా ఉంది – అమ్మగారు అవసాన కాలంలో రమణుల వద్దనే ఉన్నారు. రమణులు ఇద్దరి విషయంలో విషయ వాసనలను లయింప జేసి ముక్తి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. శిరస్సు మీద ఉరము మీదా చేతులుంచి తమ యోగబలంతో విషయ వాసనలన్నీ హృదయంలో లయింపజేశారు. పళని స్వామి విషయంలో భగవాన్ చేయి తీయగానే ప్రాణోత్క్రమణ జరిగింది. ప్రయత్నం ఫలించలేదు. అమ్మ విషయంలో రమణులు మరింత జాగ్రత్త వహించి చాలాసేపు చేతులలానే ఉంచారు.

 

“అమ్మ ముక్తి పొందింది. స్నానాలు అక్కరలేదు, మైల లేదు” అని చెప్పి సన్యాసాశ్రమార్హమైన ఖననం చేయించి శివలింగ ప్రతిష్ఠ చేయించారు. ఆ శివలింగానికి రమణుల సమక్షంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. అక్కడ మహాన్యాసం చెప్పిన వేదపండితులు కంచి పీఠానికి సాయంకాల అర్చనలో పాల్గొనడానికి వచ్చారు. మహాస్వామి వారు వారిని శుద్ధి స్నానం చేసి లోనికి ప్రవేశించమన్నారు, (ఇక్కడ నాగమ్మ గారు స్వామివారు వారికి నిషేధ పత్రికలిచ్చారని వ్రాశారు. శ్రీమఠంలో అట్టి రికార్డులేమీ లేవు. పైన చెప్పింది కుంజస్వామిగారు చెప్పిన భోగట్టా) వారు నిర్ఘాంతపోయారు. మొట్టమొదట స్త్రీలకు సన్యాసార్హత ఉన్నదా! ఒకవేళ ఉన్నదనుకొన్నా రమణుల తల్లిగారికి విధివత్తుగా సన్యాసమెవరిచ్చారు? అందువల్ల ఆమె సమాధి స్మశానం అవుతుంది. శుద్ధి స్నానం చేస్తే కానీ మడి కాదన్నది ఈ సూచన అభిప్రాయం. స్వామివారికి కూడా రమణుల ఆధ్యాత్మికౌన్నత్యాన్ని వారు అంతకు ముందే అనేక పర్యాయాలు వేనోళ్ళ శ్లాఘించారు. అంతెందుకు. గిరి ప్రదక్షిణం నాటి సాయంకాలమే బహిరంగ సభలో “అన్ని ఆశ్రమాలకూ కట్టుబాట్లున్నాయనీ, అవి ఉల్లంగించేందుకు వీలు లేదనీ, అత్యాశ్రమము అవధూతాశ్రమమని ఆ భాగ్యం రమణుల వంటి మహానీయులతో సాధ్యమనీ’ ఉపన్యసిన్చారని నాగమ్మగారు వ్రాశారు.


(సశేషం)


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: