శ్రీవారి అభిషేక సేవతో పులకించిన హైదరాబాద్ భక్తజనం
హైదరాబాద్, 2022 అక్టోబరు 14: హైదరాబాద్‌లో టిటిడి తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీవారికి అభిషేక సేవ నిర్వహించారు. స్వామి వారికి జరిగిన అభిషేక సేవను దర్శించిన భక్తులు పులకించిపోయారు.
శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం 6 గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు తోమాలసేవ, కొలువు, అర్చన, నివేదన, శాత్తుమొర నిర్వహించారు. ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు అభిషేకం నిర్వహించారు .
అభిషేకం ప్రాశస్యం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలమూర్తికి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున అభిషేకం చేస్తారు.
భగవద్రామానుజుల వారు శ్రీస్వామివారి వక్షఃస్థలంలో ”బంగారు అలమేలుమంగ” ప్రతిమను అలంకరించిన శుక్రవారం నాటితో మొదలుపెట్టి ప్రతి శుక్రవారం అభిషేకం జరిగేలా ఏర్పాటుచేశారట. పునుగు, కస్తూరి, జవ్వాది తదితర సుగంధ పరిమళాలతో కూడిన పవిత్రజలాలతో సుమారు గంట పాటు అభిషేకం జరుగుతుంది.
ఆ తర్వాత పసుపుతో శ్రీవారి వక్షఃస్థలంలో ఉన్న మహాలక్ష్మికి కూడా అభిషేకం చేస్తారు.
శ్రీనివాసుని యథాతథమైన రూపాన్ని వక్షఃస్థల లక్ష్మితో కలిసి ఈ శుక్రవారాభిషేక సమయంలో మాత్రమే దర్శించేందుకు వీలవుతుంది. స్వామి వారి భక్తులు జీవితంలో ఒక్కసారైనా అభిషేకం చూసి తరించాలనుకుంటారు. ఇలాంటి భక్తుల కోరిక తీరుస్తూ హైదరాబాదులో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం భక్తులందరిపై తీర్థాన్ని సంప్రోక్షించడంతో అభిషేక దర్శనం ముగిసింది.
అనంతరం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిజపాదదర్శనం కల్పించారు. మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు అర్చన, రెండో నివేదన, శాత్తుమొర చేపట్టారు. మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
.
.
#abhishekaseva #Tirumala #vaibavotsavalu #Tirupati #tirupatibalaji #tirumalatemple #tirumalatemple #Abhishekam #suprabatham #tomala #koluvu #Namoona #alamelumanga #venkateswaraswamy #venkateswara
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి