15, అక్టోబర్ 2022, శనివారం

సాధకుడు -క్రమబద్ద జీవనం:

 సాధకుడు -క్రమబద్ద జీవనం: 

ముముక్షువులు ఎక్కడో హిమాలయాలల్లోనో, లేక దట్టమైన అరణ్యాలలోనో మాత్రమే వుండరు. నిజానికి నీవు మోక్షార్థివి అయితే నీ ఇంట్లో వుంటూ సాధారణ గృహస్థ జీవనం చేస్తూకూడా సాధన చేయవచ్చు. జనక మహారాజు తాను చెక్రవర్తి అయి ఉండికూడా స్థితప్రజ్ఞత సాధించి మోక్షాన్ని పొందారని మనకు తెలుసు. మోక్ష సాధన అంటే చాలా కష్టమైనది.  కానీ సాధకుడు ఎంత కష్టమైన కూడా తన జీవితాన్ని ఒక క్రమబద్దమైన, క్రమశిక్షణపరంగా సాధన చేయాలి. అప్పుడే మోక్షం పొందగలడు. 

ప్రతి రోజు పరీక్ష: 

ఒక విద్యార్థికి సంవత్సరానికి ఒక పర్యాయం మాత్రమే పరీక్ష  ఉంటుంది. కానీ సాధకునికి ప్రతిరోజూ పరీక్షే.  మానవ శరీరం జరా మరణాలకు లోబడివుంటుంది. వయస్సు పెరుగుతున్నకొద్దీ శరీరం క్షీణించటం మొదలు పెడుతుంది. కానీ సాధకుడు తన నియమ బద్ద జీవనంతో సాధ్యమైనంత వరకు శరీరాన్ని ఆరోగ్యంగా వుంచుకోవలెను. దేహ వ్యామోహాన్ని పూర్తిగా విడనాడాలి.  కానీ శరీరం పట్ల నిర్లక్ష్యం  వహించకూడదు. సమయానికి తగినంత సాత్వికమైన ఆహారాన్ని తినాలి.  రుచులపట్ల ఏమాత్రం మొహం ఉండకూడదు.  కేవలం శరీరాన్ని శుష్కిపకుండా చూసుకోవాలి. 

సాధకుని నియమాలు: 

సాధకుని రోజు ఎప్పుడు ఉషోదయ కాలంతోటే మొదలైతుంది.  అనగా సూర్యోదయం కన్నా 90 నిమిషాల ముందు అంటే సుమారు ఉదయం 4 గంటల సమయంలో నిద్ర లేవాలి. ఎప్పుడు 6,7 గంటలకు నిద్రలేచే అలవాటు వున్నవారు ఇలా 4 గంటలకు నిద్ర లేవాలంటే చాలా కష్టంగా ఉంటుంది.  కానీ మనం మన గమ్యం వైపు నడవాలంటే తప్పకుండ అబ్యాసం చేయాలి. కొంత కాలం అబ్యాసం చేస్తే తరువాత మీరు మీకు తెలియకుండానే నిద్రనుంచి మేల్కొంటారు. ముందుగా రాత్రి భోజనం త్వరగా ముగించి తొందరగా నిద్రకు ఉపక్రమిస్తే తప్పకుండ ఉషోదయకాలంలో నిద్ర లేవగలుగుతాడు. ఈ సాధకుడు  ప్రారంభంలో   అలారంగా పెట్టుకుని  దాని ద్వారా నిద్ర లేవాలి. మీరు మీకు నచ్చిన రీతిలో ఏర్పాటు చేసుకోండి.  కానీ ఎట్టి పరిస్థితిలోను నిద్ర ఉదయం 4గంటలవరకే పరిమితం చేయండి. 

నిద్ర లేవంగానే మలమూత్ర విసర్జన చేసి చక్కగా దంతధావన చేసి ధ్యానానికి ఉపక్రమించండి.  స్నానం చేస్తే మంచిదే కానీ స్నానానికి ఎక్కువ సమయం కాకుండా చూసుకోండి. 

ఉదయం 4గంటల సమయం: 

నిజంగా ఈ సమయం ఎంతో పవిత్రమైనదిగా గోచరిస్తుంది. ఎందుకంటె మీకు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎక్కడో దూరంగా పిట్టల శబ్దాలు వినపడతాయి.  మీకు 5గంటలనుండి శబ్దాలు వినపడతాయి.  కాబట్టి 4నుండి 5 గంటల సమయం చాలా విలువయినది. శ్రీ కృష్ణ పరమాత్మా  చెప్పినట్లు ప్రపంచం మొత్తం నిద్రిస్తుంటే యోగి మాత్రం మేల్కొంటాడు. స్వామి చెప్పింది నిజం యోగి ఈ సమయాన్ని ఎట్టి పరిస్థితిలో వదులుకోరు. ఉదయం 4 గంటల సమయంలో చేసే ధ్యానం చక్కటి ఫలితాన్నిస్తుంది. 

ముక్తికి మార్గం: 

ఇటీవల కొంతమంది కలియుగంలో ముక్తికి కేవలం నామస్మరణ చాలు పూర్వం ఋషులు కష్టపడ్డట్లు కఠోర తపస్సు చేయనవసరం లేదు అంటూ రోజులో రెండు మూడు నిముషాలు దైవజ్యానం చేస్తూ తనకు తానుగా తరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు, ప్రచారం చేస్తున్నారు. అది అస్సలు  నమ్మకండి. ఒక్కవిషయ గుర్తుంచుకోండి ప్రకృతి ధర్మం అన్ని యుగాలకు ఒకే విధంగా ఉంటుంది.  ఎప్పుడు అది మారదు .  ప్రకృతి ధర్మం అంటే ఏమిటంటే మనకు ఈ జగత్తులో కనిపించే నియమాలు ఉదాహరణకు సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది, నీరు పల్లంలోకే ప్రవహిస్తుంది, నిప్పు ముట్టుకుంటే  కాలుతుంది. మేఘాలు వర్షిస్తాయి.  నదులు సముద్రంలోనే కలుస్తాయి. సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడు.  ఇలాంటివి అనేక నియమాలు ఈ ప్రకృతిలో మనం చూస్తున్నాము.  ఇప్పుడు చెప్పిన ప్రకృతి నియమాలు సృష్టి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అదే విధంగా వున్నాయి.ఒక యుగంలోకాని, ఒక కాలంలో కానీ ప్రకృతి తన ధర్మాన్ని మార్చుకోలేదు, భవిష్యత్తులో కూడా మార్చుకోదు.  అటువంటప్పుడు పురుషుని (భగవంతుని) నియమాలు ఎలా  మారుతాయి. ప్రకృతికి నియంత భగవంతుడే కదా. కాబట్టి మిత్రమా కేవలం నామ స్మరణ చేస్తే మోక్షం రాదు.  ఆ మాట కేవలం కఠినమైన తపమొనర్చలేని ఆర్భకులు పలికిందే కాని మరొకటి కాదు. 

ఈ ఉపనిషట్ మంత్రం చుడండి 

ఉత్తిష్ట జాగ్రత ప్రాప్య వరాన్నిబోధత 

క్షురస్య ధార నిశిత దురత్యయా దుర్గం పాదస్తత్కవయో వదన్తి 

తా|| లేవండి! (అజ్ఞానమనే నిద్రనుండి), మేల్కొనండి! ఉత్తమ గురువులను సమీపించి ( జ్ఞానాన్ని) తెలుసుకోండి. ఈ మార్గం మంగలి కత్తి అంచు మీద నడవటం వలె చాలా కష్టమైనది మరియు తీక్షమైనది, కనుక చాలా కష్టంచే దాటదగినది, కష్టంచే పొందదగినదని పండితులు చెబుతారు. కాబట్టి మిత్రమా మోక్ష మార్గం అంటే సులువు అయినది కాదు అది అత్యంత కఠినమైనది. మరియు దుర్భరమైనది ఎంతో కష్టపడితే మాత్రమే మనం మోక్షగాములము  కాలేము. కోటికి ఒక్కడు మాత్రమే ఈ జ్ఞ్యాన మార్గాన్ని  ఎంచుకుంటాడు. చాలా మంది తమకు తెలిసిన మిడి మిడి జ్ఞ్యానమే జ్ఞ్యానం అని అనుకోని దానినే ప్రచారం చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించ  ప్రయతినిస్తారు. తత్ ద్వారా ధన ధాన్యాదికములను పొంది ఐహికమైన సుఖబోగాలను అనుభవిస్తుంటారు. జ్ఞ్యాన మార్గాన్ని ఎంచుకొన్న వారిలో కోటికి ఒక్కడు మాత్రమే కైవల్యాన్ని పొందగలదు .

కామెంట్‌లు లేవు: