16, మే 2024, గురువారం

శంకర జయంతి ప్రత్యేకం భాగం 5/10

 ॐ     శంకర జయంతి ప్రత్యేకం      

          ( ఈ నెల 12వతేదీ వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి ) 


                             భాగం  5/10


శంకరుల అవతారం 


4.సాంఘిక దురాచారం - అస్పృశ్యత - ఏకాత్మతా వాద పరిష్కారం 


    అస్పృశ్యత అనే దురాచారాన్ని పారద్రోలాలనే విషయం మనం ఎంతోకాలంగా వింటున్నాము. అదొక నిరంతర నినాదంగా రాజకీయవాదుల మధ్య నలుగుతూ ఉంటుంది. 

    ఆ దురాచారం ఎప్పటికి అంతమవుతుందో, అసలు అంతమొందుతుందో లేదో అనే సందేహం కూడా కలుగుతుంది. 

    ఆదిశంకరులు ఈ దురాచారాన్ని రూపుమాపటానికి చేసిన విషయం ఈ కాలంలో ఎంత ఆవశ్యకమో తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. 

    కాశీ నగరంలో శంకరులు - చండాలుని విషయంలో తాను అస్పృశ్యతను పాటిస్తున్నట్లు కనిపిస్తారు. కానీ అదే చండాలుని మాటలనే ఉపదేశంగా పొంది, ఆ చండాలునికి పాదాభివందనం చేసి, స్తోత్రం చేశారు. తద్వారా ఆ దురాచారాన్ని రూపుమాపడానికి తనతోనే నాంది పలికారు. 

    ఆయన చేసిన స్తోత్రమే "మనీషా పంచకమ్"గా ఎప్పటికీ చక్కని మార్గం బోధిస్తుంది. 


ఆ సంఘటన


    కాశీ నగరంలో శంకరులు వెడుతున్నప్పుడు, ఒక చండాలుడు ఎదురయ్యాడు. అప్పుడు శంకరుల అతనిని దూరంగా తొలగిపొమ్మన్నారు. 


దానికి చండాలుని ప్రశ్న 


   "ఆత్మ స్వరూపము అద్వితీయము, అనవద్యము, అఖండము, సత్యబోధము, సురూపమని వేదాంతాలు చెబుతున్నాయి కదా! 

    నీవు దూరంగా పొమ్మంటున్నది దేహాన్నా? దేహినా? 

    దేహాన్నే అంటే సమస్త దేహాలూ అన్నమయాలే. అన్న రక్త మాంసాది ధాతువులు కలవియే. 

    పదార్థము ఒకటే అయినప్పుడు, దేని నుంచి ఏది తొలగిపోవాలి? 

    దేహిని అంటే, సర్వసాక్షి అయిన దేహి అంతటా ఒక్కడే! భేదం లేదు. 

    భేదం లేనప్పుడు తప్పుకోమనే మాటకు అర్థంలేదు. 

    ప్రత్యగాత్మ విషయాన 'అతడు బ్రాహ్మణుడు', 'ఇతడు చండాలుడు' అనే విచారణ ఎల్లా పొసగుతుంది? 

    గంగ యందూ, కల్లు నందూ ప్రతిబింబించే సూర్యబింబానికి భేదమేమి ఉంటుంది?" 

    - అని ఒక చండాలుడు కూడా పలికే పరిస్థితి తెలుపబడింది. 


శ్రుతి చూపిన మార్గం 


"ఏకో దేవస్సర్వభూతేషు గూఢస్సర్వవ్యాపీ సర్వభూతాన్తరాత్మా" 

  - చైతన్య స్వరూపుడగు అన్తరాత్మ, 

    పిపీలికాది బ్రహ్మదేవుని వఱకు ఉండే సర్వదేహములందు ఏకరీతిగ ఉంటూ, 

    సర్వసాక్షియై ఉంటున్నాడు. 


శంకరుల స్పందన 


    పైవిషయాన్నే శంకరులు తీసుకొని, 

    జ్ఞానమార్గంలోని ఏకాత్మతావాదాన్ని తెలుసుకొంటే, 

    ఈ అస్పృశ్యత అనేభావనే కలగదని తెలుపుతూ, సందేశం ఇచ్చారు.  

    ఆ విధంగా తెలిపేవాడు ద్విజుడైనా - చండాలుడైనా తనకు వందనీయుడేనంటూ, 

    కేవలం వందనీయుడే కాదు గురువని ముమ్మాటికీ చెప్పగలనన్నారు. 

   "మనీషా పంచకమ్" అనే ఆశువుగా పలికిన స్తోత్రమ్ ద్వారా ఆ చండాలుని రూపంలో సర్వాత్మకుడైన విశ్వేశ్వరుని దర్శించారు. 


      వారు సాక్షాత్తూ శంకరులే! మనకు తెలుపటానికి ఆ రెండు రూపాలలో విచ్చేసిన స్వామియే! 


      అస్పృశ్యతను పారద్రోలటమే కాక, ప్రతి ఒక్కరూ తమతోపాటు అందరిలోనూ భగవద్దర్శనం పొందే అద్భుత మార్గాన్ని అందించారు. 


https://youtu.be/_bNXGUykMNI 


                కొనసాగింపు ...


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

కామెంట్‌లు లేవు: