16, మే 2024, గురువారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 16.5.2024 గురువారం


*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*372వ నామ మంత్రము* 


*ఓం భక్తమానస హంసికాయై నమః*


పరమ పవిత్రమైన మానస సరోవరమందున ఉండు హంసవలె భక్తుల మనస్సులనెడి మానససరోవరమందు వసించు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భక్త మానస హంసికా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం భక్తమానస హంసికాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తుల హృదయములనే మానస సరోవరంలో ఆ తల్లి ఒక హంసవలె వసించుచూ, సర్వాభీష్టములను సిద్ధింపజేయును.


పవిత్ర హిమాలయ పర్వతములయందున్న మానస సరోవర జలములు అత్యంత నిర్మలమైనవి. పవిత్రమైనవి. అటువంటి నిర్మల జలములనే ఎల్లప్పుడూ కోరే హంసలు అచట విహరిస్తూ ఉంటాయి. అలాగే నిత్యము పరమేశ్వరీ నామస్మరణతో, భక్తిప్రపూరితమైన ధ్యానముతో ప్రవర్తించు భక్తుల హృదయములు మానససరోవరము వంటివి. పరమేశ్వరి అటువంటి భక్తహృదయాలలో తానొక హంసవలె విలసిల్లుతూ భక్తజనులకు కైవల్యసోపానములను సమీపింపజేయుచుండును గనుకనే ఆ పరమేశ్వరి *భక్తమానస హంసికా* యని అనబడినది.


*హంస* యనగా పరమాత్మ. *హంసిక* యనగా పరమేశ్వరి. నిరంతరము శ్రీమాత ధ్యానముతో ఆ జగన్మాతను స్మరించేవారు, ధ్యానించేవారు అయిన భక్తుల మనసులలో పరమేశ్వరి (హంసిక) ఉంటుంది. గనుక అమ్మవారు *భక్తమానస హంసికా* యని అనబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం భక్తమానస హంసికాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: