నీకర్మ నీచేత ఆపని చేయిస్తుంది!
ధర్మరాజును జూదంవైపు నడిపించింది ఏది?
స్వభావరీత్యా మనిషి తనకు ఇష్టంలేని పనులు ఎందుకు చేస్తాడో భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం వివరించింది.
ఒక పనిని ఆచరించడంగాని, నిరాకరించడంగాని మనిషి చేతిలో లేదని, ప్రకృతిశక్తి లేదా విధికి లోబడి తనకు తెలియకుండానే మనిషి దానికి పూనుకొంటాడని 60వ శ్లోకం చెబుతోంది.
ధర్మజుడు ధర్మాధర్మ విచక్షణ బాగా తెలిసిన ధర్మమూర్తి. పైగా యమధర్మరాజు అంశతో జన్మించినవాడు. అంతటి వివేకి- చెడ్డదని తెలిసీ, వ్యసనమని ఎరిగీ జూదం విషయంలో నిగ్రహం ఎలా కోల్పోయాడు?
ఇదే సందేహం జనమేజయుడికీ వచ్చింది. వ్యాసమహర్షిని అడిగాడు.
దానికి వ్యాసుడు “ప్రకృతి చేయిస్తుంది నాయనా! దానిముందు నీ నిగ్రహం చాలదు... ఇష్టంలేకపోయినా నీ స్వభావం, నీ కర్మ నీచేత ఆ పని చేయిస్తాయి!” అని బదులిచ్చాడు.
జనమేజయుడికి సంతృప్తి కలగలేదు. కాని, మౌనం వహించాడు.
రాజు అసంతృప్తిని ఋషి గమనించాడు. మాట మారుస్తూ “ఓ రాజా! రేపు నీ దగ్గరకు కొన్ని గుర్రాలు అమ్మకానికి వస్తాయి. వాటిలో నల్లదాన్ని మాత్రం కొనవద్దు! కొన్నా, దానిమీద స్వారీ చెయ్యకు... చేసినా ఉత్తర దిక్కుకు మాత్రం పోనేవద్దు. పోయినా అక్కడుండే సుందరితో మాట కలపకు..! కలిపినా ఆమెను పెళ్ళి మాత్రం చేసుకోకు. చేసుకున్నా, ఆమె మాటకు లోబడి ఆమె ఆడించినట్టు ఆడకు... జాగ్రత్త!” అని హెచ్చరించాడు.
మర్నాడు కొందరు వర్తకులు మేలుజాతి అశ్వాలను అమ్మకానికి తెచ్చారు. వాటిలో నల్లగుర్రమే చాలా ఆకర్షణీయంగా ఉంది. ‘దీనివల్ల ఈ గుర్రపుశాలకే కాదు, ఈ రాజ్యానికే శోభ’ అనిపించింది రాజుకు. ఆయనకు వ్యాసమహర్షి మాట వెంటనే గుర్తుకొచ్చింది. ‘ఎక్కవద్దన్నాడు కాని కొనవద్దని చెప్పలేదుగా!’ అని సమాధానపడి పెద్ద ధరకు దాన్ని కొనేశాడు.
రోజూ అశ్వశాలలో దాని సొగసు చూసి మురిసిపోయేవాడు. క్రమంగా ఇష్టం పెరిగిపోయింది. ‘ఉత్తర దిక్కుకు పోవద్దనే కదా మహర్షి హెచ్చరించింది... ఎక్కవద్దని కాదు..!’ అని సరిపెట్టుకొని తక్కిన మూడు దిక్కుల్లో హాయిగా స్వారీ చేయడం ఆరంభించాడు.
కొన్నాళ్లు గడిచాయి. ‘ఉత్తర దిశగా పోదాం... అక్కడి సుందరితో మాట్లాడకుండా తిరిగొచ్చేస్తే ఫరవాలేదు’ అని నిశ్చయించాడు. ఉత్తరం వైపు గుర్రాన్ని నడిపించాడు.
అక్కడొక అందమైన యువతి కనిపించింది. ఆమెతో మాట్లాడకుండా ఉండలేకపోయాడు. ఆ తరవాత ‘ఇంతటి సౌందర్యరాశిని సొంతం చేసుకోకుంటే ఈ జన్మ వృథా!’ అనిపించింది. ‘ఆమె ఏం చెప్పినా పట్టించుకోవద్దు... కేవలం పెళ్ళి మాత్రమే చేసుకొందాం... ఆమె చెప్పినట్లు మాత్రం చేయవద్దు’ అన్న గట్టి నిర్ణయంతో గాంధర్వ వివాహం చేసుకొన్నాడు. అంతఃపురానికి తీసుకొచ్చాడు.
ఒకరోజు ఆ సుందరి ‘దేశంలోని సాధువులను పొలిమేరల్లోని మునులను పిలిచి సంతర్పణలు, సత్కారాలు చేయాలని ఉంది’ అని రాజును కోరింది.
అది భార్య తొలి కోరిక. పైగా చక్కని సత్కార్యం. కాదనడం దేనికనుకొన్నాడు జనమేజయుడు. అన్న సమారాధనకు భారీ ఏర్పాట్లు చేశాడు. వడ్డిస్తుండగా ఆమె లోకోత్తర సౌందర్యాన్ని గమనించిన ఒక యువసాధువు మోహపరవశుడై ఆమెను కామదృష్టితో పరికించాడు.
ఆమె ఏడుస్తూ రాజుకు ఫిర్యాదు చేసింది. దాంతో రాజు పట్టరాని కోపంతో కత్తిదూసి ఆ సాధువు తల నరికేశాడు.
మరుక్షణమే ‘అయ్యో బ్రహ్మహత్యాపాతకానికి ఒడిగట్టానే’ అంటూ వలవల ఏడ్చాడు.
వ్యాసమహర్షి నవ్వుతూ ప్రత్యక్షం అయ్యాడు. తన మాయను ఉపసంహరించాడు.
జనమేజయుడికి కల చెదిరినట్లయింది. మబ్బు విడిపోయింది. ఈ కథలో గ్రహించడానికే తప్ప ఇక చెప్పడానికి ఏమీలేదు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి