16, మే 2024, గురువారం

మహాభాగవతం

 *16.5.2024 ప్రాతఃకాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము - నలుబది రెండవ అధ్యాయము*


*శ్రీకృష్ణుడు కుబ్జపై దయజూపుట - ధనుస్సును విరచి, రక్షకభటులను హతమార్చుట - కంసుడు ఆందోళనకు గురియగుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*


*42.1 (ప్రథమ శ్లోకము)*


*అథ వ్రజన్ రాజపథేన మాధవః స్త్రియం గృహీతాంగవిలేపభాజనామ్|*


*విలోక్య కుబ్జాం యువతీం వరాననాం పప్రచ్ఛ యాంతీం ప్రహసన్ రసప్రదః॥9870॥*


*శ్రీశుకుడు చెప్పెను* పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు సుదాముని అనుగ్రహించిన పిమ్మట ఆత్మీయులతోగూడి రాజమార్గమున సాగిపోవుచుండెను. అప్పుడు ఆ స్వామి ఒకయువతిని జూచెను. ఆమె ముఖము సుందరముగా నుండెను. కాని, ఆమె గూని కలిగి యుండుటవలన *కుబ్జ* అను పేరుతో పిలువబడుచుండెను. ఆమె తన చేతులలో చందనాది అనులేపన ద్రవ్యములుగల పాత్రలను పట్టుకొని పోవుచుండెను. సకలప్రాణులపై కరుణరసమును ప్రసరింపచేయుచుండెడి ఆ కృష్ణప్రభువు ఆమెపై కృపజూపుటకై నవ్వుచు ఇట్లు ప్రశ్నించెను.


*42.2 (రెండవ శ్లోకము)*


*కా త్వం వరోర్వేతదు హానులేపనం కస్యాంగనే వా కథయస్వ సాధు నః|*


*దేహ్యావయోరంగవిలేపముత్తమం శ్రేయస్తతస్తే న చిరాద్భవిష్యతి॥9871॥*


"సుందరీ! నీవు ఎవరు? ఈ చందనానులేపనములను ఎవరి కొఱకు తీసికొని వెళ్ళుచున్నావు? యథార్థమును తెలుపుము. మేలైన ఈ అంగరాగములను మా ఇరువురికిని ఇమ్ము. ఇచ్చితివేని త్వరలోనే నీకు మిగుల శ్రేయస్సు కలుగును".


*సైరంధ్ర్యువాచ*


*42.3 (మూడవ శ్లోకము)*


*దాస్యస్మ్యహం సుందర కంససమ్మతా త్రివక్రనామా హ్యనులేపకర్మణి|*


*మద్భావితం భోజపతేరతిప్రియం వినా యువాం కోఽన్యతమస్తదర్హతి॥9872॥*


*అంతట కుబ్జ ఇట్లనెను* "సుందరా! నేను కంసుని దాసిని. నన్ను *త్రివక్ర* అని యందురు. నేను అనులేపనములను అలదుటకై నియమింపబడితిని. నేను సిద్ధపఱచిన చందనాది - అంగరాగద్రవములనిన కంసునకు మిక్కిలి ఇష్టము. అందువలన ఆ రాజు నన్ను ఎంతగానో ఆదరించును. ఈ అంగలేపనములను అలదుకొనుటకు నిజముగా మీరే అర్హులు".


*42.4 (నాలుగవ శ్లోకము)*


*రూపపేశలమాధుర్యహసితాలాపవీక్షితైః|*


*ధర్షితాత్మా దదౌ సాంద్రముభయోరనులేపనమ్॥9873॥*


శ్రీకృష్ణుని రూపవైభవమునకును, సౌకుమార్యమునకును, రసికత్వమునకును, సుందర మందహాసమునకును, మధురాలాపములకును, ఆకర్షణీయమైన చూపులకును ఆ కుబ్జ ముగ్ధురాలయ్యెను. వెంటనే ఆమె మనస్సు కృష్ణపరమయ్యెను. అంతట ఆమె చొక్కమైన (మనోహరమైన) ఆ అనులేపనములను ఆ ఉభయులకును సమర్పించెను.


*42.5 (ఐదవ శ్లోకము)*


*తతస్తావంగరాగేణ స్వవర్ణేతరశోభినా|*


*సంప్రాప్తపరభాగేన శుశుభాతేఽనురంజితౌ॥9874॥*


పిమ్మట వారు ఆ మైపూతలను నాభికి పైభాగమునగల వక్షస్థలాది అంగములయందు అలదుకొనిరి. శ్రీకృష్ణుడు శ్యామవర్ణశోభితమైన తన శరీరముపై పసుపుపచ్చని అంగరాగములను, బలరాముడు శ్వేతవర్ణరంజితమైన తన దేహముపై ఎర్రని అనులేపనములను పూసికొని తేజరిల్లిరి.


*42.6 (ఆరవ శ్లోకము)*


*ప్రసన్నో భగవాన్ కుబ్జాం త్రివక్రాం రుచిరాననామ్|*


*ఋజ్వీం కర్తుం మనశ్చక్రే దర్శయన్ దర్శనే ఫలమ్॥9875॥*

అనులేపనములను సమర్పించిన కుబ్జపై కృష్ణభగవానుడు ప్రసన్నుడయ్యెను. తనను దర్శించినందులకు ప్రత్యక్ష ఫలమును ప్రసాదించుటకై వంకరలు తిరిగియున్న (మువ్వంకలతోనున్న) ఆమె దేహమును చక్కజేయుటకై (సర్వాంగసుందరముగా చేయుటకై) ఆ ప్రభువు నిశ్చయించుకొనెను.


*42.7 (ఏడవ శ్లోకము)*


*పద్భ్యామాక్రమ్య ప్రపదే ద్వ్యంగుల్యుత్తానపాణినా|*


*ప్రగృహ్య చిబుకేఽధ్యాత్మముదనీనమదచ్యుతః॥9876॥*


*42.8 (ఎనిమిదవ శ్లోకము)*


*సా తదర్జుసమానాంగీ బృహచ్ఛ్రోణిపయోధరా|*


*ముకుందస్పర్శనాత్సద్యో బభూవ ప్రమదోత్తమా॥9877॥*


పిమ్మట ఆ స్వామి ఆమె యొక్క రెండు పాదాగ్రములను తన పాదములతో అదిమిపట్టి, ఆమె చిబుకము (గడ్డము) క్రింద తన రెండు వ్రేళ్ళను చేర్చి, మీదికెత్తెను. అట్లు ప్రేమను, ముక్తిని అనుగ్రహించే శ్రీకృష్ణభగవానుని కరస్పర్శతో పైకెత్తబడగనే వంకరలు అన్నియును తొలగిపోయి, అవయవములు పూర్తిగా చక్కబడి ఆమె ఒక యువతీ లలామగా రూపొందెను. అంతట ఆమె కటి సౌందర్యము ఇనుమడించెను. వక్షస్థల వైభవము ఇంపెసలారెను.


*42.9 (తొమ్మిదవ శ్లోకము)*


*తతో రూపగుణౌదార్యసంపన్నా ప్రాహ కేశవమ్|*


*ఉత్తరీయాంతమకృష్య స్మయంతీ జాతహృచ్ఛయా॥9878॥*


ఒక్క క్షణములో కుబ్జయొక్క రూపలావణ్యములు మిక్కిలి మనోహరములయ్యెను. నడకలలో, చూపులలో అందములు చిందెను. అంతట ఆ సుందరి శ్రీకృష్ణునిపై మఱులుగొని, ఆ స్వామియొక్క ఉత్తరీయాంచలమును పట్టుకొని లాగుచు దరహాసముతో ఇట్లనెను-


*42.10 (పదియవ శ్లోకము)*


*ఏహి వీర గృహం యామో న త్వాం త్యక్తుమిహోత్సహే|*


*త్వయోన్మథితచిత్తాయాః ప్రసీద పురుషర్షభ॥9879॥*


"మహావీరా! మా ఇంటికి వెళ్ళుదము రమ్ము. నిన్ను ఇచట విడిచి వెళ్ళుటకు నా మనస్సొప్పుటలేదు. నీవు నా చిత్తమును కలవరపెట్టితివి (నిన్ను దర్శించినంతగా నా మనస్సు వశము తప్పినది). పురుషోత్తమా! నన్ను అనుగ్రహింపుము".


*42.11 (పదకొండవ శ్లోకము)*


*ఏవం స్త్రియా యాచ్యమానః కృష్ణో రామస్య పశ్యతః|*


*ముఖం వీక్ష్యానుగానాం చ ప్రహసంస్తామువాచ హ॥9880॥*


బలరాముని సమక్షమున ఆ తరుణి తనను ఇట్లు అర్థించుచుండగా, శ్రీకృష్ణుడు తన అగ్రజుని, తన అనుయాయులు ముఖములను గాంచి, దరహాస మొనర్చుచు ఆమెతో ఇట్లువచించెను.


*42.12 (పండ్రెండవ శ్లోకము)*


*ఏష్యామి తే గృహం సుభ్రూః పుంసామాధివికర్శనమ్|*


*సాధితార్థోఽగృహాణాం నః పాంథానాం త్వం పరాయణమ్॥9881॥*


"సుందరవదనా! నేను వచ్చిన పని పూర్తియైన పిమ్మట నీ ఇంటికి తప్పక వచ్చెదను. నీ గృహము సాంసారిక బాధలను గుఱియైన పురుషులయొక్క మనస్తాపములను తొలగించునట్టిది. ఇండ్లు వాకిండ్లను వీడి వచ్చిన మావంటి బాటసారులకు మీ వదనమే ఆశ్రయమేగదా!


*42.13 (పదమూడవ శ్లోకము)*


*విసృజ్య మాధ్వ్యా వాణ్యా తాం వ్రజన్ మార్గే వణిక్పథైః|*


*నానోపాయనతాంబూలస్రగ్గంధైః సాగ్రజోఽర్చితః॥9882॥*


కృష్ణప్రభువు మృదుమధుర వచనములతో సమాధానపఱచి ఆమెను వీడ్కొనెను. పిదప ఆ స్వామి తన వారితోగూడి రాజమార్గమున వెళ్ళుచుండగా వ్యాపారులు వివిధములగు కానుకలను, చందన, తాంబూలములను, పూలమాలలను సమర్పించి, బలరామకృష్ణులను అర్చించిరి.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి నలుబది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

కామెంట్‌లు లేవు: