16, మే 2024, గురువారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 16.5.2024 గురువారం


*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*832వ నామ మంత్రము* 


*ఓం ప్రాణదాత్ర్యై నమః*


జీవులకు ప్రాణములను ఇచ్చి జీవింపజేయు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *ప్రాణదాత్రీ* యను నాలుగు అక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం ప్రాణదాత్ర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు సాధకులకు ఆ జగన్మాత అకాలమృత్యువులనుండి, ఆకస్మిక ప్రమాదములనుండి కాపాడును. ఆయురారోగ్యములు ప్రసాదించును. భౌతిక జీవనమునందు శాంతిసౌఖ్యములు ప్రసాదించి అనంతమైన బ్రహ్మజ్ఞాన సాధన దిశగా అడుగులు వేయించును.


జీవుల శరీరంలో ప్రాణములుంటేనే ఇంద్రియవ్యాపారం కొనసాగుతుంది.   ఇంద్రియముల కదలికలు గోచరమవుతాయి. దేహంలోని ప్రాణం చూడడానికి గోచరించదు. ప్రాణం యొక్క ఉనికి ఇంద్రియముల  కదలికననుసరించియే తెలియుచుండును. గనుక ప్రాణము  అంటే ఇంద్రియములు అని కూడా ఇచ్చట చెప్పుకొనవచ్చును. ప్రాణములుఅనగా పంచ ప్రాణములు, ఇంకను పంచ ఉప ప్రాణములను జగన్మాత జీవులకు ఇచ్చును. అలాగే జ్ఞానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములు ఐదు, మనసు (వెరసి పదకొండు ఇంద్రియములను) కూడా ఇచ్చును. శరీరం పుట్టిన తరువాత పదకొండు ఇంద్రియములు ఉంటాయి. మరి అవి అమ్మవారు ఇవ్వడమేమిటి? అనే ప్రశ్న ఉత్పన్నము కవచ్చును. ఇంద్రియములకు ఆయా పనితనములను ప్రసాదించునని భావించదగును. జీవుని పాత్ర తీరిపోగానే ప్రధాన ప్రాణము పయనమై పోవును. ఆ వెంట మిగిలిన ప్రాణములు కూడా తరలిపోవును. ప్రాణములు శరీరమును విడచిన వెంటనే ఇంద్రియములు కూడా చచ్చుబడిపోవును. అప్పుడు ఆ దేహాన్ని శవము అన్నారు. ఒక్క ప్రధాన ప్రాణమును అమ్మవారు జీవునికి పోయగానే మొత్తము ప్రాణములు, ఇంద్రియముల కార్యనిర్వాహకత్వము కూడా శరీరంలో స్థాపింపబడి పంచభూతాత్మకమైన ఆ శరీరము కదలును. లోకములో తనకున్న పాత్రనిర్వహణను కొనసాగించును. అందు చేతనే ప్రాణుల చేతనావస్థకు  వలసిన ప్రాణమును అమ్మవారు ప్రసాదించును గనుక ఆ తల్లి *ప్రాణదాత్రీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం ప్రాణదాత్ర్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: