తిరుమల సర్వస్వం -105
*అంకురార్పణ మంటపం*
"పోటు" ను దర్శించుకుని ఎత్తైన అరుగు మీద ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకు ముందుగా వచ్చేది *"అంకురార్పణ మంటపం".* బ్రహ్మోత్సవాలకు ముందు రోజున ఈ మంటపంలో, సేకరించుకొచ్చిన పుట్టమన్నులో నవధాన్యాలను మొలకెత్తింపజేయడం వల్ల ఈ మంటపానికి *"అంకురార్పణ మంటపం"* అనే పేరు వచ్చింది. అంకురార్పణపర్వం గురించి "శ్రీవారి బ్రహ్మోత్సవాలు" లో వివరంగా తెలుసుకున్నాం.
ఒకప్పుడు దేవాలయ అంతర్భాగం నందున్న రాములవారిమేడలో కొలువుండే రామపరివార దేవతలైన ఆంజనేయుడు, అంగదుడు, సుగ్రీవుని విగ్రహాలు; అలాగే, *"నిత్యశూరులు"* అనబడే శ్రీమహావిష్ణువు పరివారదేవతలైన విష్వక్సేనుడు, ఆదిశేషువు, గరుత్మంతుడు విగ్రహాలను – ప్రస్తుతం ఈ మండపంలో దర్శించుకోవచ్చు. శ్రీవారి దర్శనానంతరం తీర్థం, శెఠారిని ఈ మంటపం ఎదురుగానే భక్తులకు ప్రసాదిస్తారు. రాత్రివేళల్లో స్వామివారి ఏకాంతసేవ పూర్తయి, ఆలయ ద్వారాలు మూసిన తరువాత, బ్రహ్మాది దేవతలు విచ్చేసి స్వామిని కొలుస్తారని ఓ గట్టి నమ్మకం. వారు అర్చించుకోవడం కోసం, ప్రతిరోజు ఆలయద్వారాలు మూసేటప్పుడు ఐదు బంగారు గిన్నెలలో ఆకాశగంగ తీర్థం నింపి ఉంచుతారు. ఉదయం సుప్రభాతం తర్వాత విశ్వరూపసందర్శనం కోసం విచ్చేసే భక్తులకు అంకురార్పణమండపంలో ఇచ్చేది ఈ తీర్థమే!! దీన్నే *"బ్రహ్మతీర్థం"* గా పిలుస్తారు
.
బ్రహ్మ కడిగిన విష్ణు పాదోదకం గనుక, ఈ తీర్థాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. *యాగశాల* అంకురార్పణ మండపానికి ఆనుకుని ఉన్న "యాగశాల" లో పూర్వం హోమాలు, యజ్ఞయాగాదులు వంటి వైదికక్రతువు లన్ని జరుగుతుండేవి. కానీ ప్రస్తుతం స్థలాభావం, భక్తులరద్దీ చేత ఈ క్రతువుల్లో చాలావరకూ సంపంగిప్రాకారం లోని "కళ్యాణమండపం" లో జరుప బడుతున్నాయి. బుధవారం నాడు జరిగే సహస్రకలశాభిషేకం సమయంలో మాత్రం, బంగారువాకిలి వద్ద ఏర్పాటు చేయబడిన తాత్కాలిక యజ్ఞగుండంలో యాగం నిర్వహింపబడుతుంది.
[ రేపటి భాగంలో.. *కళ్యాణమండపం, నోట్ల పరకామణి, చందనపు అర, ఆనందనిలయ విమానం, విమాన వేంకటేశ్వరుడు* ఇత్యాదుల గురించి తెలుసుకుందాం]
* *"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన* *వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*
*కళ్యాణమండపం*
సంపంగిప్రాకార కుడ్యానికి లోపలివైపున అనుసంధానింపబడి, యాగశాలకు ఆనుకొని దానికి పడమరగా, విమానప్రదక్షిణ మార్గంలో ఉన్న విశాలమైన మంటపాన్ని *"కళ్యాణ మండపం"* అంటారు. మూడు, నాలుగు దశాబ్దాల క్రితం వరకు శ్రీవారి నిత్యకళ్యాణోత్సవం ఈ మంటపం లోనే జరుగుతూ ఉండేది. శ్రీవారి మహాభక్తుడు తాళ్ళపాక అన్నమయ్య, తదనంతర కాలంలో వారి వంశీయులు ఈ మంటపంలోనే శ్రీవేంకటేశ్వరుని కళ్యాణోత్సవాలు జరిపేవారు. 1586వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్య ప్రతినిథియైన అయిన చెన్నప్ప అనే అధికారి ఈ మండపాన్ని నిర్మించారు. పూర్తిగా విజయనగరశైలిలో నిర్మింపబడ్డ ఈ మండపం రమణీయమైన శిల్పకళా చాతుర్యంతో కనువిందు చేస్తుంది. ఈ మంటప అంతర్భాగంలో వున్నటువంటి, నాలుగు స్తంభాలతోనున్న *"మధ్యమండపం"* విజయనగరశిల్పుల కళాకౌశల్యానికి మచ్చుతునక. ఈ నాలుగు స్తంభాలు, ఒక్కొక్కటి మరో నాలుగు స్తంభాల సముదాయం ఒక లావాటి స్తంభం మరియు దానికి బాహ్యంగా మరో మూడు సన్నటి స్తంభాలు - ఒకే రాతిలో చెక్కబడి ఉంటాయి. అత్యంత నునుపైన నల్లటి గ్రానైట్ వంటి రాతిపై అందమైన కళాకృతులు అత్యద్భుతంగా మలచ బడ్డాయి. ఈ మధ్యమంటపం లోనే, కళ్యాణోత్సవం జరిగేటప్పుడు ఉభయ నాంచారులతో కూడిన మలయప్పస్వామి వారిని వేంచేపు చేసేవారు.
కళ్యాణమంటపం లోని శిలాస్తంభాల మీదా, కుడ్యాల యందు అనేక ఆకృతులు హృద్యంగా చెక్కబడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి యోగముద్ర లోనున్న నరశింహస్వామి, హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తున్న ఉగ్రనరశింహుడు, సింహవాహనంపై ఆసీనుడై ఉన్న నరశింహుడు, త్రివిక్రమావతారంలో ఉన్న విష్ణుమూర్తి, గరుడవాహనంపై విహరిస్తున్న శ్రీమహావిష్ణువు, ఆదిశేషునిపై శయనించిన శేషసాయి, పదహారు చేతులతో కరందమకుటం ధరించి శిరస్సు చుట్టూ అగ్నిజ్వాలలతో ప్రకాశిస్తున్న అత్యంత అరుదైన సుదర్శనుని ప్రతిమ – మున్నగునవి.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి