శ్రీ దత్త ప్రసాదం - 18 – మోగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయా స్వామి వారి మందిరాన్ని దర్శించుకున్న వ్యాసాశ్రమంలో శ్రీ స్వామివారి సహాధ్యాయి
2004 వసంవత్సరం మహాశివరాత్రి మరో పదిరోజులు ఉన్నదనగా...నేనూ మా సిబ్బంది మహాశివరాత్రి కి చేయాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించుకుంటూ ఉన్నాము..మధ్యాహ్నం నైవేద్యం హారతి కాగానే అర్చకస్వాములు మందిరం తలుపులు మూసేసి భోజనానికి వెళ్లిపోయారు..నేనొక్కడినే మందిరం లో కూర్చుని వున్నాను..ఇంతలో కాషాయ వస్త్రాలు ధరించిన సాధువు ఒకరు లోపలికి వచ్చారు..
బావి వద్దకు వెళ్లి, బకెట్ తో నీళ్లు తోడుకొని..కొన్ని నీళ్లు దోసిలి లోకి తీసుకొని నెత్తిన చల్లుకున్నారు..మరికొన్ని నీళ్లతో కాళ్ళు కడుక్కున్నారు..అక్కడినుంచి నేరుగా ప్రధాన మంటపం లోకి వచ్చి, శ్రీ స్వామివారి సమాధి గదికి ఎదురుగా నిలుచున్నారు..వారిని గమనిస్తూ ఉన్న నేను..వారి వద్దకు వెళ్లి..
"స్వామీ..ఇలా తిరిగి రండి..ఈ గర్భాలయపు మంటపం లో కూర్చోండి..అర్చకులను పిలిపిస్తాను..శ్రీ స్వామివారి మందిరం తలుపులు తీస్తారు..మీరు స్వామివారి సమాధిని దర్శించుకోవచ్చు.." అన్నాను..
నా వైపు సాలోచనగా చూసి..తలవూపి..నా వెనుకే వచ్చి..సమాధి మందిరపు మంటపం లో నిలుచున్నారు..అర్చకస్వామి ని పిలువమని మనిషి చేత చెప్పి పంపించి.."స్వామీ మీరెక్కడినుంచి వస్తున్నారు.."? అని అడిగాను.."హృషీకేష్ నుంచి"..అన్నారు..ఆయన వాలకం చూస్తుంటే ముభావంగా వున్నారు..ఏ ప్రశ్న అడిగినా ముక్తసరిగా సమాధానాలు ఇస్తున్నారు..చివరగా "భోజనం చేసారా..ఇక్కడ ఏర్పాటు చేయమంటారా?.." అన్నాను.."ఈరోజు మేము ఆహారం తీసుకోము..మీ భాషలో చెప్పాలంటే..ఉపవాసం.." అన్నారు..ఇక నేను ప్రశ్నలు వేయదల్చుకోలేదు..కొద్దిసేపటికే పూజారి గారు వచ్చి, శ్రీ స్వామివారి సమాధి మందిరపు తలుపులు తీశారు."మీరు వెళ్లి సమాధి దర్శనం చేసుకోండి.." అన్నాను..
దానికి అంగీకారంగా తలవూపి..సమాధి మందిరం గడప ఇవతల నిలబడి నమస్కారం చేసుకున్నారు..ముందుకు వంగి ఆ గడపకూ నమస్కారం చేశారు..మెల్లిగా కుడిపాదం లోపలికి పెట్టి..సమాధి వద్దకు వెళ్లారు..నేను ప్రక్కకు వచ్చేసాను..సమాధి వద్ద సుమారు పదిహేను నిమిషాల పాటు వున్నారు..
సమాధి దర్శనం చేసుకొని ఇవతలికి వచ్చి..మళ్లీ గడప దగ్గర నిలబడి మరొక్కసారి నమస్కారం చేసుకొని..నా దగ్గరకు వచ్చి..ప్రక్కనే ఉన్న చాపమీద పద్మాసనం వేసుకొని కూర్చున్నారు..కొద్దిగా అవతల వైపు నేను కూర్చున్నాను..నన్ను దగ్గరకు రమ్మని సైగ చేశారు.."నువ్వూ...?" అంటూ సందేహంగా అడిగారు..
నా పేరు చెప్పి..నేను శ్రీధరరావు ప్రభావతి గార్ల కుమారుడిని..అని చెప్పాను..ప్రస్తుతం ఈ మందిరం నిర్వహణ చూస్తున్నాను అనికూడా చెప్పాను..
అలాగా అన్నట్లు తలవూపి..నా దగ్గరగా జరిగి, నా ప్రక్కనే కూర్చుని.."ఈ స్వామివారు, నేనూ వ్యాసాశ్రమం లో ఒకే సమయం లో ఉన్నాము..సాధనా పద్ధతుల గురించి..మోక్షప్రాప్తి గురించి..అక్కడ మాకు బోధ జరిగేది..ఈయన చాలా చురుకుగా ఉండేవారు..గురువుగారు చేసిన బోధ లోని మర్మాలను ఇట్టే పసికట్టేవాడు..మళ్లీ మాకందరికీ విపులంగా చెప్పేవాడు..చక్కటి కంఠస్వరం..మా కందరికీ ఆశ్చర్యం గా ఉండేది..ఎటువంటి విషయమైనా ఒక్కసారి వింటే చాలు..తిరిగి యధాతధంగా అప్పచెప్పేవాడు..ఒకానొక సందర్భం లో ఆ ఆశ్రమానికి ఉత్తరాధికారిగా నియమిస్తే బాగుండునని మేమందరమూ తలపోసాము..ఆ మాటే చెప్పాము కూడా..ససేమిరా వద్దన్నాడు.."నేను ఆశ్రమ నిర్వహణ చేయను..చేయలేను..నాకు అతి త్వరగా మోక్షం కావాలి..నా సాధన అంతా అందుకొరకే"..అని తేల్చి చెప్పేసాడు..మహానుభావుడు..తన లక్ష్యం ఏమిటో చక్కగా తెలిసిన వాడు..అందుకనుగుణంగా తన జీవితాన్ని మలచుకున్నాడు.." అన్నారు..
"స్వామీ మీ పేరేమిటి..? ప్రస్తుతం మీరెక్కడ వుంటున్నారు..? స్వామివారి గురించి మరింత వివరంగా చెప్పగలరా..? " అన్నాను.."నేను ప్రస్తుతం హృషీకేశ్ లో ఒక ఆశ్రమం లో ఉంటున్నాను..వ్యాసాశ్రమం లో ఈ స్వామివారు గడిపింది చాలా కొద్దికాలమే..బహుశా రెండేళ్ల కాలం కాబోలు..మాలకొండలో తపస్సు చేసుకునే రోజుల్లో ఒకటి రెండుసార్లు కలిశాను..సిద్ధిపొందిన తరువాత ఒక్కసారి వచ్చి వెళ్ళాను..మళ్లీ ఇదే రావడం..ఈ స్వామివారికి కొంతకాలం సహాధ్యాయిగా ఉన్నానని ఒక తృప్తి ఉంది..మాలాంటి వారికి మార్గదర్శనం చేసాడు..సాధకుడి నడవడిక ఎలా ఉండాలో ఆచరించి చూపాడు..మళ్లీ ప్రాప్తం ఉంటే..మరోసారి వస్తాను..సాయంత్రం దాకా ఇక్కడ ధ్యానం చేసుకొని..రాత్రికి ఇక్కడే బస చేసి..రేపుదయం బయలుదేరి వెళ్లిపోతాను.." అన్నారు..వారికి అవసరమైన ఏర్పాట్లు చేసాను..తెల్లవారి మళ్లీ ఒకసారి స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..వెళ్లిపోయారు..
స్వామివారి గురించి వారు చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు బాగా గుర్తుండిపోయాయి..
సర్వం..
దత్తకృప!
రచన : శ్రీ పవని నాగేంద్రప్రసాద్
(మందిర వివరముల కొరకు :
పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)
----
మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును :
-----
*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 :
---
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి