☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్రీమద్ భాగవతం*
*(ఏడవ రోజు)*
*(నిన్నటి భాగం తరువాయి)*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*కలిప్రవేశంతో ధర్మదేవత, భూదేవత పొందుతున్న దుఃఖాన్ని తెలుసుకున్నాడు పరీక్షిత్తు. అబ్రాహ్మణులే ముందు ముందు రాజ్యాలు ఏలుతారని తెలుసుకున్నాడు. బాధపడ్డాడు. అంతలోనే తేరుకుని, ధర్మదేవతకూ, భూదేవతకూ అభయాన్నిచ్చాడు. ఓదార్చాడు వారిని. ఆలస్యం చేయదలచలేదు, అసత్యానికీ, అధర్మానికీ నిలయమయిన కలిని కడతేర్చేందుకు ఖడ్గాన్ని ఎత్తాడు పరీక్షిత్తు.*
*వేటు తప్పదనుకున్న కలిపురుషుడు గడగడ వణకిపోయాడప్పుడు. దిక్కుతోచలేదతనికి. చేతులెత్తి నమస్కరించి, శరణంటూ పరీక్షిత్తు పాదాలను ఆశ్రయించాడు.*
*‘‘శరణన్న వారిని చేయెత్తి కొట్టడం కూడా మహాపాపం. అందుకని నేను నిన్ను చంపకుండా వదలి పెడుతున్నాను. పో ఇక్కణ్ణుంచి.’’ అన్నాడు పరీక్షిత్తు.*
*దిక్కులు చూశాడు కలిపురుషుడు. ఎక్కడకి వెళ్ళాలన్నదీ అంతు చిక్కలేదతనికి.‘‘నువ్వు ఉన్న చోట అధర్మం, అసత్యం, అలక్ష్మి, స్వధర్మత్యాగం, చౌర్యం, లోభం, కపటం, కలహం, డంభం అన్నీ తాండవిస్తాయి. పరమ పవిత్రమయిన, ధర్మానికి నిలయమయిన యజ్ఞభూమి లాంటి ఈ బ్రహ్మవర్తదేశంలో నువ్వు ఉండడానికి వీల్లేదు. నువ్విక్కడ కాలు మోపితే నేనొప్పుకోను, ఖండిస్తాను. తక్షణం తప్పుకో ఇక్కణ్ణుంచి.’’ అన్నాడు మళ్ళీ పరీక్షిత్తు.*
*సమాధానంగా మళ్ళీ చేతులు జోడించాడు కలిపురుషుడు. దీనంగా ప్రార్థించాడిలా.*
*‘‘మహారాజా! నిన్ను శరణు కోరాను. ప్రసాదించావు. ధన్యుణ్ణయ్యాను. అయితే నన్ను పొమ్మనడం నీకు భావ్యం కాదు. తప్పదు, నిష్క్రమించాల్సిందే అంటే నేనెక్కడుండాలో, ఏ చోటున నివసించాలో నువ్వే చెప్పు. ఎక్కడికి వెళ్దామన్నా, ఎటు చూద్దామన్నా ఆగ్రహోదగ్రంగా ఖడ్గాన్ని ఎత్తి పట్టుకుని ఎల్లెడలా నువ్వే కనిపిస్తున్నావు. భయం వేస్తోంది. దయచేసి అన్యధా భావించక చెప్పు మహారాజా, నేనెక్కడుండాలో నువ్వే చెప్పు. అక్కడే నా నెలవు ఏర్పరుచుకుంటాను.’’ అన్నాడు కలిపురుషుడు.కన్నీరు పెట్టుకున్నాడు.*
*ఆలోచనలో పడ్డాడు పరీక్షిత్తు.*
*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం)*
*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి