1, జనవరి 2025, బుధవారం

పుష్యమాసం ప్రాధాన్యం

 🌹 *పుష్యమాసం ప్రాధాన్యం*


శనిదేవుని జన్మ నక్షత్రం పుష్యమి. 

అందుకే పౌర్ణమితో కూడిన పుష్యమి నక్షత్రం ఉండే పుష్య మాసం శనికి ప్రీతికర మాసంగా పేరొందింది.

 ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తా డని పురాణాలు తెలుపుతున్నాయి. 

గరుడపురాణం ప్రకారం శని ధర్మదేవత. మానవులు చేసిన పాపపుణ్యాలు లెక్కించి తత్ఫలితాలను ఇచ్చేవాడు శని భగవానుడు.

పుష్యమి చాలా అద్భుత మైన నక్షత్రం. పుష్యమాసంలో సూర్యోదయ సమయంలో ప్రసరించే సూర్య కాంతి అద్భుత మైన యోగచైతన్యాన్ని ప్రసరిస్తుంది. 

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం నుంచి ఏర్పడే ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు దక్షిణదిశ నుంచి ఉత్తరదిశగా పయనిస్తాడు. 

ఈ సమయంలో సూర్యకిరణాలలో ఒక ప్రత్యేక మైన తేజస్సు ఉంటుంది.

 ఈ కాంతి మన బుద్ధిని ప్రచోదనం చేసి, మనస్సు లోని చెడు ఆలోచనలు, చెడు స్వభావాన్ని, అశుభాలను హరిస్తుంది. బుద్ధి బలం, ప్రాణబలం పుష్టిగా లభించే మాసం పుష్యమాసం.

*పుష్య* అనే మాటకు పోషణశక్తి కలిగినది అని అర్థం. 

పుష్యమాసం  శీతకాలం. ఆధ్యాత్మికంగా జపతపాదులు, ధ్యానపారాయణలకు శ్రేష్ఠ మైన మాస మిది. 

పితృదేవతలను పూజించి అందరు దోషరహితు లయ్యే పుణ్యమాసం పుష్యం. 

పుష్యపౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్ట మైన దని చెబుతారు. 

శ్రావణపౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు  వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అను వైన సమయం. 

ఈ మాసం రైతులకు

పంట  చేతికి వచ్చే కాలం కనుక ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి రూపంలో లక్ష్మీదేవిని విష్ణుమూర్తి సమేతంగా పూజిస్తారు.

పంచాయతన పూజావిధానంలో గణపతిని భాద్రపద మాసంలో, అంబికా అమ్మవారిని ఆశ్వయుజ మాసంలో, 

శివుణ్ని కార్తీక మాసంలో, 

విష్ణువును మార్గశిర మాసంలో, సూర్యనారాయణుణ్ని పుష్యమాసంలో విశేషంగా కొలుస్తారు.

గోపికలు *కాత్యాయనీ వ్రతం* చేసి శ్రీకృష్ణుణ్ని వివాహం చేసుకుంది పుష్య మాసంలోనే. పెళ్లి కాని ఆడపిల్లలు వివాహం కోసం ఈ మాసంలో కాత్యాయనీవ్రతాన్ని ఆచరిస్తారు.

పుష్యమాసానికి అధిపతి అయిన శని, నక్షత్రాధిపతి అయిన గురువును పూజించడం వలన విశేషఫలితం లభిస్తుంది. పుష్య మాసం శనైశ్చరుడికి ప్రీతికర మైన మాసం. పుష్యమాసంలో శని గ్రహానికి అమావాస్య రోజున తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శనిబాధా నివృత్తి జరుగుతుంది. వీటితో పాటు వస్త్రదానం, తిలదానం, అన్నదానం చేయడం వలన శనిదోషాలు తొలగి శుభఫలితాలు పొందవచ్చు. శనైశ్చరునికి ప్రీతికర మైన నువ్వులు, బెల్లం ఆహారంలో తీసుకోవడం మంచి ఫలితాల నిస్తుంది, ఇదే అంశాన్ని శాస్త్రీయకోణంలో పరిశీలిస్తే

ఈ రెండు పదార్థాలు ఒంట్లో వేడిని కలిగించి చలి నుండి రక్షణ కలిగిస్తాయి. పుష్య పౌర్ణమి రోజున నదీస్నానం చేయడం వలన సకలపాపాలు తొలగుతాయి.‌‌ ఈ రోజు చేసే దానాల వలన పుణ్యఫలితం అధికంగా ఉంటుంది.

ఈ మాసంలో వస్తద్రానం విశేష ఫలితాల నిస్తుం దని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశ్యం.

పుష్యశుక్ల విదియ నుంచి పంచమి దాకా శ్రీహరిని తులసీదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుం దని ఒక నమ్మకం. 

అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాల తోనూ, ఆదివారాల్లో సూర్యుణ్ని జిల్లేడు పూల తోనూ అర్చిస్తారు. 

శుక్లపక్ష షష్ఠినాడు అయ్యర్ తమిళులు కుమారస్వామిని పూజిస్తారు.

ఇక, శుక్లపక్షంలో వచ్చే అష్టమినాడు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని *పుత్రదా ఏకాదశి* అంటారు. ఈ రోజున ఏకాదశీ వ్రతం ఆచరిస్తే పుత్రసంతానం కలుగుతుం దని విశ్వాసం.

తెలుగువారి పెద్ద  పండుగ సంక్రాంతి వచ్చేది పుష్యమాసం లోనే, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించేది ఈ మాసం లోనే. సూర్యుడు ధనూరాశి నుండి మకరరాశిలో ప్రవేశించడమే మకర సంక్రాంతి.

ఈ మాసంలో గృహ ప్రవేశాలు, పెళ్లిళ్లు, శంకుస్థాపనల వంటి   శుభకార్యాలు  చేయడానికి వీలు లేనప్పటికీ సాధారణ పూజలు, పెద్దలను స్మరించుకొని చేసే అన్ని పుణ్య కార్యాలకూ విశేషమాసంగా చెప్పవచ్చు.

విష్ణువుకు ఇష్ట మైన మాసం మార్గశిరం. 

శివునికి కార్తికం. 

అలాగే పుష్యమాసం శనైశ్చరునికి పరమ ప్రీతికరం. 

ఎందు కంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. 

ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తా డని పురాణాలు తెలుపుతున్నాయి. 

ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనైశ్చరుణ్ని భక్తితో ప్రార్థిస్తారు. 

పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దాన మిస్తారు. ఆయనకు ఇష్ట మైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. 

దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ రెండు పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి.

శని ధర్మదర్శి. న్యాయం, సత్యం, ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వప్రాణుల సమస్త విశ్వప్రేమను, పవిత్రతను ఉద్ధరిచేవాడు అతడే.

మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి, నియమనిష్ఠలు పాటించి నట్లయితే శని అనుగ్రహం పొందవచ్చు. అంతేగాక గరుడ పురాణంలో నాభిస్థానం శనిస్థానం అని ఉంది. ఎప్పుడు శరీరం లోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్య మంతటికీ శని ప్రభావమే కారణం అని మనం గ్రహంచాలి. 

*పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాది ఆచారం.


విశేష మేమంటే దక్షిణాయనం పుష్య మాసంతో ముగుస్తుంది. ఉత్తరాయణం కూడా పుష్య మాసంలోనే ప్రారంభమవుతుంది. పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. 

సంక్రాంతి ముందు జరుపుకునే పండుగ భోగి. 

చీకటి తోనే లేచి చలి మంటలతో చీకట్లను పారద్రోలుతారు.  దక్షిణాయనానికీ, ధనుర్మాసానికీ ఆఖరు రోజు ఇది. భోగినాడు వైష్ణవాలయాల్లో   గోదారంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండువుగా జరుపుతారు. మర్నాడు సూర్యుడు మకరరాశి లోకి ప్రవేశించే దినమే మకరసంక్రాంతి.

పుష్యమాసంలో సూర్యోదయ సమయంలో ప్రసరించు సూర్య కాంతి అద్భుత మైన యోగచైతన్యాన్ని ప్రసాదిస్తుంది. 

పుష్యమి చాలా అద్భుత మైన నక్షత్రం. 

ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు దక్షిణం నుండి ఉత్తరదిశగా పయనం సాగిస్తాడు. 

అనగా ఊర్ధ్వ ముఖంగా ప్రయాణం.

మనలోని ప్రాణశక్తి బలాన్ని సమకూర్చుకొనే సమయం. సూర్యకిరణాలలో ఒక ప్రత్యేక మైన హిరణ్మయ మైన కాంతి ఉంటుంది. ఇది మన బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. మనస్సును అంటిపెట్టుకున్న స్వభావం లోని అశుభాలను ఆ కాంతి హరిస్తుంది. బుద్ధిబలం, ప్రాణబలం పుష్టిగా లభించే మాసం పుష్యమాసం. 

ఈ మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. 

గోదావరి ఏడు పాయలలో ఒక టైన *తుల్యభాగ* తూర్పుగోదావరి లోని చొల్లంగిలో సముద్రంలో కలుస్తుంది.

 ఆ రోజున అక్కడ స్నానం చేయడంవల్ల విశేషపుణ్యఫలం లభిస్తుం దని భక్తుల విశ్వాసం.


*(సేకరణ)*


          🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు: