1, జనవరి 2025, బుధవారం

భజగోవిందం (మోహముద్గరః)

 🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య*.     

              *విరచిత*

*భజగోవిందం (మోహముద్గరః)*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*రోజూ ఒక శ్లోకం (లఘు వివరణతో)*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*శ్లోకం - 6*


*యావత్పవనో నివసతి దేహే*

*తావత్పృచ్ఛతి కుశలం గేహే|*


*గతవతి వాయౌ దేహాపాయే*

*భార్యా బిభ్యతి తస్మిన్కాయే||*


*శ్లోకం అర్ధం : ~*


*శరీరములో ఊపిరి ఉన్నంతవరకు ఇంటిలోనివారు కుశలమును విచారింతురు. ఆ ఊపిరి ఆగిపోయి, మరణము సంభవించినపుడు నీ మృతదేహము చూసి సమీపించుటకు నీ భార్య కూడా భయపడును.*


*వివరణ : ~*


*శరీరంలో ఈ హంస సాగిన వరకే బంధువులు, మిత్రులు నీ క్షేమ సమాచారములు అడుగగా వత్తురు. నీపై అతి ప్రేమ, వాత్సల్యము కురిపింతురు. అది అంతా నీ గుండెలలో ప్రాణ వాయువులు సాగు వరకే. ఒక్కసారి ఉఛ్ఛ్వాస నిశ్వాసములు ఆగి, నీవు విగత జీవుడవై నేల బడియుండ, నీ భార్య కూడా నీదరి చేరుటకు భయపడును. నీవారందరూ నీ శరీరమును తాకుటకు కూడా శంకింతురు. నీవు తనువు చాలించిన కొన్ని క్షణముల వరకే అందరూ శోకము ప్రదర్శింతురు, ఆపై నీ ఊసును కూడా ఎవ్వరూ ఎత్తరు. అందమైనదని ఊహించుకునే మన ఈ శరీరము రోగముతో, రోతతో, మలిన గంధ భూయిష్ఠమగును. శరీరమున ప్రాణ వాయువులు ఆగి పోవగానే, అది పనికిమాలినదై పోవును. ఎంత త్వరగా దానిని వదిలించుకొందామా అని అందరూ భావింతురు. పంచ భూతములతో నిర్మితమైన ఈ దేహం, చివరకు ఈ పంచ భూతములలోనే కలిసి పోవలె. అట్టి ఈ హీన శరీరం పై మమతలు ఏల?*


*ఓం నమో నారాయణాయ।*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*(తిరిగి రేపు మరో శ్లోకంతో కలుద్దాం)*

కామెంట్‌లు లేవు: