1, జనవరి 2025, బుధవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము*


*243 వ రోజు*


*మసేనుని భీకర యుద్ధం*


సుయోధనుని సైగను గ్రహించిన కళింగ రాజు తన సైన్యంతో భీముని మీదకు వచ్చాడు. ఇంతలో ద్రోణుడు విజృంభించి విరాటుని పైన, ద్రుపదుని పైన బాణములు సంధించాడు. ధర్మరాజు ఇంతలో ధృష్టద్యుమ్నునికి సాయం వచ్చాడు. ఛేది, కురుదేశాల రాజులు భీమునికి అడ్డుగా నిలిచాడు. కేతుమంతుడు భీముని మీదకు ఉరికాడు. కేతుమంతునికి ధాటికి పాండవ సైన్యాలు మంటలలో పడిన పురుగులులా భస్మం అయ్యారు. మిగిలి వారు పారి పోయారు. కేతుమంతుడు విజయోత్సాహంతో భీమునిపై ముందు వెనుకలు చూడక బాణవృష్టి కురిపించాడు. కేతుమంతుడు భీముని హయములు చంపగా భీముడు కుపితుడై గదను తీసుకుని వాడి పైన విసరగానే ఆ గదాఘాతానికి వాడి రథం విరిగి, కేతనం విరగటమే కాక నిముషాలలో కేతుమంతుని స్వర్గలోకానికి పంపింది. భీముడు తన కత్తిని తీసుకుని వీరవిహారం చేసాడు. అది చూసిన కళింగ రాజు కుమారుడు శక్రదేవుడు ఆగ్రహంతో భీముని మీదకు వచ్చి కరకు బాణాలతో భీమసేనుని రథాశ్వాలను వధించి భీముని శరీరమంతా బాణములతో కొట్టగా భీమసేనుడు బెదరక ఒక్క గదా ఘాతంతో శక్రదేవుని సంహరించాడు. కుమారుని చావు చూసి కుపితుడైన కళింగరాజు భీమునిపై పదునాలుగు తోమరములు విసిరాడు. భీమసేనుడు వాటిన అన్నిటినీ తన కరవాలంతో తుత్తునియలు చేసాడు. కళింగ రాజు సోదరుడు భానుమంతుడు తన గజబలంతో భీముని ఎదుర్కొని భీమునిపై శరవర్షం కురిపించాడు. ఒక ఏనుగును భీమునిపై నడిపించాడు. భీమసేనుడు చేసిన సింహనాదానికి దిక్కులు దద్దరిల్లాయి. భీముడు ఆ ఏనుగును పట్టుకుని దంతములు, తొండము నరికి భానుమంతుని నరికి వేసి అతని ఏనుగును నరికాడు. అది చూసిన కళింగరాజు ఒక్క సారిగా భీమసేనుని పైన పడమని తన గజ సన్యాలను పురికొల్పాడు. ఒంటరిగా నేలపై ఉన్న భీముడు కత్తితో ఏనుగుల తోడములు నరక సాగాడు. రథికులను, సారధులను, రథములకు కట్టిన అశ్వములను నరక సాగాడు. ఇంతలో భీముని సారథి భీముని రథాన్ని తీసుకు వచ్చి అతని ముందు నిలుపగా భీమసేనుడు అతడిని శ్లాఘిస్తూ రథం ఎక్కి విల్లు తీసుకున్నాడు. కళింగుని అయిదు బాణాలతో కొట్టగా అతడు మూర్చిల్లాడు. కళింగుని చక్రరక్షకులు అయిన సత్యుడు, సత్యదేవులను చంపాడు. కౌరవ సేన కకావికలై పోయింది. కళింగుని సారథి అతడిని పక్కకు తీసుకు వెళ్ళాడు. భీమసేనుడు తన శంఖమును పూరించాడు. అది విన్న భీష్ముడు తిరిగి శంఖాన్ని పూరించి కౌరవ సైన్యాలను ఉత్సాహపరిచాడు. ఇంతలో ధృష్టద్యుమ్నుడు, సాత్యకి, శిఖండి భీమునికి తోడుగా వచ్చి భీష్ముని ఎదుర్కొన్నారు. భీష్ముడు శిఖండిని వదిలి మిగిలిన వారితో యుద్ధం చేస్తున్నాడు. భీష్ముడు భీముని రథానికి కట్టిన హయములను చంపగా భీముడు కోపించి రథం దిగి భీష్మునిపై ఉరికాడు. సాత్యకి భీమునికి భీష్మునికి మధ్యగా నిలిచి భీష్ముని రథసారథిని చంపాడు. రథాశ్వాలు సారథి లేని రథాన్ని భీష్ముని పక్కకు తీసుకు వెళ్ళాయి. అదను చూసి భీముడు కౌరవ సేనను దనుమాడాడు. భీముని ధాటికి తాళలేని కౌరవ సేనలు పలాయనం చిత్తగించాయి. ధృష్టద్యుమ్నుడు వచ్చి భీమసేనుని తన రథం పైకి ఎక్కించాడు. ఇంతలో సాత్యకి రథంపై వచ్చి భీమసేనా " ఒంటరిగా కళింగుని బలం అణిచావు. అతని పుత్రులను సోదరులను, ఆప్తులను ఒంటరిగా దునుమాడావు " అని భీమసేనుని ప్రశంసించాడు


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: