🔱 ఏకాంతం-ఓ అద్భుత సాధనం🔱
🍁సంఘజీవి అయిన మనిషి కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉండటాన్ని కోరుకుంటాడు. ఇష్టంతో కోరితెచ్చుకున్న ఒంటరితనమే ఏకాంతం. ఇందులో బాధ, నిరాశానిస్పృహలు ఉండవు. ఓ ఆనందం, ఒక సింహావలోకనం ఉంటాయి. పునరాలోచన, అనుభవాల విశ్లేషణ, నెమరువేత లాంటి భావనలు అంతర్వాహినులవుతాయి.
🍁యోగులకు, సాధకులకు ఈ ఏకాంతం ఎంతో అవసరమైంది, ముఖ్యమైంది. లౌకిక ప్రపంచపు వాసనలకు దూరంగా అంతర్ముఖులై వీరు తమ లోపలకి తాము చూడగలిగే యత్నం చేస్తారు. అప్పుడా స్థితిలో వారికి నిశ్చలత్వం, ఏకాగ్రచిత్తం, స్థితప్రజ్ఞత వస్తాయి. ఇదే సమాధిస్థితి అని పండితుల భావన. జీవితపు లోతుల్లోకి వెళ్లి దాని తత్వాన్ని, సత్యాలను చూసే, ప్రేమభావనను తెలుసుకునే దృష్టి ఏర్పడుతుంది.
🍁ఈ ఏకాంతం జీవిత అర్థ, పరమార్థాలను తెలుసుకునే అవకాశాన్నిస్తుంది. ఆదిశంకరులు బోధించిన 'అహం బ్రహ్మాస్మి' అన్న భావనను అనుభవంలోకి తెచ్చేందుకు సహకరిస్తుంది. సత్వ సాధనకు, సత్యశోధనకు ఇది సుగమమైన మార్గం.
🍁ఒంటరితనం, ఏకాంతం రెండూ ఒకటి కాద ఎవరూ లేకుండా ఒక్కరూ ఉండటమే ఈ రెండింటిలో సామ్యం. అంతే. ఒంటరితనంలో చింత, ఏకాంతంలో చింతన. ఏకాంతమంటే లోచూపు. చేసిన పనులను, వాటి మంచి, చెడులను విశ్లేషించుకోవటం. నడకను, నడతను డేగచూపుతో పరిశీలించటం. అంతవరకు సాగిన జీవితాన్ని ఒక మదింపు వేసుకునే సందర్భం. సరైన మార్గంలో పయనించేందుకు ఏకాంతం ఒక చక్కని అవకాశమిచ్చి, అందుకు మనల్ని సమాయత్తం చేస్తుంది.
🍁రచయిత కలం నుంచి వెలువడిన ఒక సృజనాత్మక రచన పాఠకులను అక్షరజగత్తులో విహరింపచేస్తుంది. కానీ ఆ అద్భుత సృష్టి జరిగే వేళ ఆ రచయిత ఒంటరే. ఒక ఏకాంత సమయంలో ఎంతో అంతర్మథనానంతరమే రచన పుడుతుంది. ఈ ఒంటరితనం రచయిత కావాలనుకున్నదే. ప్రజల బాహ్యదృష్టిలో ఒంటరిగా ఉన్నాడన్న భావన కలుగుతుంది. కానీ అతడు తన ఆలోచనలతో, తన ఊహల సమూహంలో ఉంటాడు.
🍁ఏకాంతమంటే ప్రకృతిలో విహారం, నచ్చిన సంగీతాన్ని వినటం, పుస్తక పఠనం, ధ్యానం ఇలా ఎన్నెన్నో భావనలు. అది ఒంటరితనమే కానక్కరలేదు. సామూహికం కావచ్చు. జీవితపు ఉరుకుల, పరుగులలో తన కుటుంబసభ్యులతో, ఆత్మీయులతో, సంభావ సమయమే చిక్కదు. అప్పుడు వారితో మాత్రమే గడపటం కూడా ఏకాంతమే. ఏకాంతం కలత చెందిన మనసులను తేట పరుస్తుంది.
🍁భగవంతుణ్ని ప్రార్ధించే వేళ ఈ ఏకాంతం భక్తుల దృష్టికి ఏకాగ్రతను, మనసుకు స్థిరత్వాన్ని ఇస్తుంది. మనో నైర్మల్యాన్నిస్తుంది. సర్వోపగతుడైన ఆయనను మనోసీమలలో దర్శించేందుకు ఏకాంతం అద్భుత సాధనం. అంతర్ముఖచిత్తులమై ఆ దేవదేవుని చింతనకు, సృష్టిలోని అణువణువున ఆయన రూపాన్ని కాంచటానికి ఏకాంతం ఎంతగానో తోడ్పడుతుంది. మౌనస్థితిలో లౌకికానందాలను వీడుతూ, అ విశ్వరూప భావనను అవగతం చేసుకుంటాం. అసలైన ప్రేమ అనుభవైకవేద్యమవుతుంది. అది గొప్ప ఆనందయోగం. అదే బ్రహ్మానందస్థితి. అదే దైవం. ఏకాంతానికున్న శక్తి అటువంటిది.🙏
⚜️⚜️🌷🌷🌷🌷🌷🌷⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి