*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 56 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఆత్మ విచారణ పద్ధతి - 20 🌻*
బుద్ధి ఇంద్రియాల పరిధిలో పని చేస్తూ, ఇంద్రియ విషయములను మాత్రమే గ్రహిస్తూ, తెలుసుకుంటూ శబ్దాది శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే ఐదు విషయాలను గ్రహించేటటువంటి స్థాయికి మాత్రమే పరిణామం చెందినటువంటి బుద్ధి కలిగినటువంటి వారు ఎప్పటికీ దీనిని తెలిసికొనలేరు. ఎవరైతే స్పష్టంగా చెప్తున్నారు. “సనాతనమైన ఈ ఆత్మను, ధీరుడైన విద్వాంసుడు, అధ్యాత్మ యోగము చేత తెలుసుకొనును” - సనాతనమైన ఈ ఆత్మను అనంటే, సృష్టికి ముందు నుంచీ వున్నది.
సృష్టి లేకుండా పోయినా కూడా వుంటుంది. ఈ అనంతమైన విశ్వం రాకముందుకూడా వుంది. అనంతమైన విశ్వం లేకుండా పోయినా వుంటుంది. ఈ బ్రహ్మాండం రాకముందు వుంది. ఈ బ్రహ్మాండం అంతా లయమైపోయినా కూడా అది వుంది. ఈ రకంగా ఏదైతే ఉన్నదో అది సనాతనము. అట్టి సనాతనమైనటువంటి దానిని ‘ధీరత’, ‘విద్వాంసత’ - ఈ రెండూ వుండాలి.
ధీరుడైన వారు - అంటే జగత్తు యొక్క అశాశ్వతమును, అశాశ్వతత్వమును తెలుసుకొన్నటువంటి వాడు ఎవడైతే వున్నాడో, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగినటువంటి వాడు ఎవడైతే వున్నాడో, వైరాగ్యాన్ని కలిగినటువంటి వాడు ఎవడైతే వున్నాడో, వాడు అధ్యాత్మ యోగము చేత తెలిసికొనును. అనగా శబ్ద స్పర్శాది విషయములనుండి, ఇంద్రియములను మరల్చి, చిత్తమునందు ప్రవేశ పెట్టి, అట్టి చిత్తమును ఆత్మయందు ప్రవేశ పెట్టుటయను యోగము ద్వారా... ఇది “యోగం” అంటే! బాగా గుర్తుపెట్టుకోండి.
‘యోగము’, ‘యోగము’ అని బయట ఏదైతే మనకి బోధించబడుతూ, అనుభవించబడుతూ, తెలియబడుతూ, బోధించబడుతూ, తెలుసుకొనుట అనేటటుంవంటి ప్రక్రియ ద్వారా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనే అష్టాంగ యోగ విద్య గా చెప్పబడుతున్న యోగము ఏదైతే వున్నదో, ఆ యోగ లక్ష్యము ఏమిటయ్యా అనంటే, ఆత్మోపరతి. చిత్తమును ఆత్మయందు ప్రవేశపెట్టుట - అనేటటువంటి ప్రధాన లక్ష్యం దిశగా, బోధించబడుతూ వున్నది.
కాబట్టి మౌళికార్థములో అధ్యాత్మయోగం అంటే ఏమిటంటే, ఇంద్రియములను ఇంద్రియార్థముల నందు ప్రవేశింప నివ్వక, ఇంద్రియములను చిత్తమునందే నిలబెట్టి, అట్టి చిత్తమును చిత్తశుద్ధి, త్రిగుణ మాలిన్యమునకు లోబడనివ్వక, గుణాతీత పద్ధతిగా, సాక్షిత్వ పద్ధతిగా, నీవు ఆత్మయందు, చైతన్యము నందు వాటిని ప్రవేశపెట్టుట. చిత్తము ‘చిత్’ గా మారిపోవాలి. సచ్చిదానందములో వున్నటువంటి చిత్ స్వరూపమే నీలో చిత్తముగా వున్నది. కాబట్టి, నీ యందు వున్నటువంటి చిత్‌ని గ్రహించాలి.
చైతన్యాన్ని గ్రహించాలి. చైతన్యాన్ని అనుభూతమొనర్చుకోవాలి. నీలోపలే జరుగవలసినటువంటి గొప్ప పరిణామమిది. అట్టి ఆత్మసాక్షాత్కార మైనటువంటి వారు, హర్షశోకములు మొదలైన ద్వంద్వములను విడచి, నిర్వికార స్థితియందు ఉండెదరు. ఇది చాలా ముఖ్యం.
‘నిర్వికారము, నిర్విచారము’ - ఈ రెండూ ఒకేసారి లభిస్తాయి.
‘నిర్వికారము, నిర్విచారము’ - ఎవరైతే దేనికీ విచారించరో, ఎవరైతే దేనికీ వికారిత్వమును పొందరో... అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధముల చేత ప్రేరేపించబడరో, అనుభవనీయములైనటువంటి జగత్ భోగములయందు ప్రేరణను పొందరో, జగదాకార వృత్తిని పొందరో, అటువంటి వాడు మాత్రమే ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానమును పొందినటువంటి వాడు అవుతున్నాడు. - విద్యా సాగర్ స్వామి
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి