20, సెప్టెంబర్ 2020, ఆదివారం

రామాయణమ్.68

 రామాయణమ్.68

..

ఆమె తండ్రి ఒక రాజర్షి! ఒక చక్రవర్తి

ఆమె మామగారు ధర్మాత్ముడు,ఇంకొక చక్రవర్తి.

ఆమె భర్త జగదేకవీరుడు ! 

అంతఃపురములోని జనులకు తప్ప ఎవరికంటాబడకుండా ఇన్నాళ్ళూ వైభవంగా జీవించింది.

.

మరి నేడో ! నారచీరకట్టటమేరాక భర్తసహాయంతో చుట్టుకొని పదుగురి ఎదుట నిలుచున్నది . 

వనవాసము చేయ సంకల్పించుకున్నది .

ఎంతకష్టం? ఎంతకష్టం? ఎండకన్నెరుగని రాకుమారికి ఎంతకష్టం?

ఎవరికి అపకారంచేసిందని ?ఆవిడకీ శిక్ష!

.

చూసేవారి హృదయం ద్రవించిపోతున్నది .

ఇది తలుచుకొని కైకను తిట్టనివాడులేడు .

.

దశరధుడు హృదయవిదారకంగా రోదిస్తున్నాడు .కైకను చూసి ,"పాపాత్మురాలా రాముని అడవికి పంపి పాపములు మూటకట్టుకుంటున్నావు అవి చాలలేదా నీకు . ఈ సీతను కూడా కష్టపెడుతున్నావు ! 

ఇన్ని పాపాలు అసలెందుకు చేస్తున్నావు?"అని అంటూ కడుదీనంగా విలపిస్తూ మూర్ఛపోతూ ,మరల తేరుకుంటూ ,మరలమరల కైకను తిడుతూ పిచ్చివానివలే ఉన్న తండ్రి సమీపంలోకి వచ్చి రాముడు ,...

.

....తండ్రీ ! నా తల్లి వృద్ధురాలైనది ,నిన్నెప్పుడూ పల్లెత్తమాటకూడ అని ఎరుగదు ,సాధుస్వభావురాలు ,నీచస్వభావమననేమో ఎరుగదు,అందరికీ వరాలిచ్చేవాడవు నా కొక్క వరాన్నీయవయ్యా! నన్నుచూసుకొని ఆవిడ బ్రతుకుతున్నది నేను దగ్గరలేకుంటే ఆవిడ మానసము శోకసముద్రమే ! ఆవిడను కాస్త ఆదరంతో చూసుకో తండ్రీ ! నీ ఆదరమే ఆమె ప్రాణాలు నిలుపుతుంది .అని వినయంగా పలికిన రాముని చూసి అతికష్టం మీద గొంతుపెగుల్చుకుంటూ విపరీతమైన దుఃఖము మనస్సును ,శరీరాన్ని ఆవహించగా అతికష్టం మీద "రామా " అని మాత్రం అనగలిగాడు దశరధుడు.

.


జానకిరామారావు వూటుకూరు గారి 

సౌజన్యం తో ....


*ధర్మధ్వజం*

హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: