20, సెప్టెంబర్ 2020, ఆదివారం

**సౌందర్య లహరి**

 **దశిక రాము**




**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**


ఐదవ శ్లోక భాష్యం - నాల్గవ భాగం


అంబిక తన కరుణ వలన కామాన్ని సృష్టించి మన్మథుని అధికారంలో ఉంచింది. జనులు ప్రయత్నం చేత జన్మరాహిత్యాన్ని పొందే అవకాశమీయడం ఆమె ఉద్దేస్యం. ధర్మార్థమోక్షములనే పురుషార్థములలో కామాన్ని కూడా చేర్చి ఒక వ్యవస్థ చేసింది. గృహస్థ దశలో క్రమశిక్షణతోనూ, నియంత్రణతోనూ శాస్త్రోక్తరీతిలో కామాన్ని అనుభవించాలి. జీవితాన్ని ఆ విధంగా గడుపుకొంటే కామం బారినుండి ఉద్దరించబడి, పవిత్రుడవయి, తరువాతిదైన సన్యాసదశకు చేరుకోవచ్చు. 


ప్రతి నిబంధనకు కొన్ని అపవాదాలుంటాయి. కొంతమంది, చాలా తక్కువమంది బ్రహ్మచర్యం నుండే నేరుగా సన్యాసులయి ఆజన్మాంతం అలా ఉండిపోతారు.


ఈ వివరణలన్నీ అలా ఉంచండి. జ్ఞానమూర్తి అయిన ఈశ్వరుడు కామంచేత ఎందుకు వికల్పం చెందాడు ? విజితేంద్రియులైన మునులు ఎందువల్ల ప్రమాదం పొందుతున్నారు. మరి ఇటువంటి పనికి కారణమయిన అంబిక పొగడబడుతున్నదేమి?? 


వారు కామమోహితులైనారన్నది కథకు అంతం కాదు. నిజానికి మళ్ళీ వారు పరిశుద్ధులైనారు. ఒకానోక సమయంలో వారు కామమోహితులైనారంటే అది లోకక్షేమం కోసం. హరిహరపుత్రుడు మాత్రమే తనను చంపగలడన్న వరమున్న రాక్షసుని సంహరించడానికి జన్మించాడు. విశ్వామిత్రునికి కామం లేనట్లయితే శకుంతల, భరతులు ఉండేవారే కాదు. మహాకవి అమరకావ్యమైన శాకుంతలముండేది కాదు. వ్యాసుడు ఘృతాచిని చూచి మరులు గొనకపోతే శుకబ్రహ్మవంటి మహావేదాంతి నైష్ఠిక బ్రహ్మచారి జనించేవాడే కాదు.


ఈ విషయాలన్నీ పరాశక్తి అనుగ్రహం, సహాయం లేకపోతే ఎంతట వారయినా పతనంకాక తప్పదన్న విషయం తెలియచేస్తాయి. మన స్వయంకృషితో మనమేదైనా సాధించగలమని విఱ్ఱవీగి పోరాదు. వినయంతో ఆమె కరుణకై అర్థించాలి.


మనమొక విషయం అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఒక వస్తువును సృష్టించే శక్తిగలవారో వారికే ఆ వస్తువును నాశనం చేసే శక్తి ఉంటుంది. చట్టసభకు చట్టం చేసే శక్తి ఉంటే దానిని సవరించే శక్తి దానికే ఉంటుంది. అంబిక ఈ ప్రపంచాన్ని, కామక్రోధాదులను సృష్టించింది. ఆమె ఒక్కతే మనను ఈ ప్రపంచం నుండి, అరిషడ్వర్గాల నుండి రక్షించగలదు. ఆమె మన్మథుని కామానికి అధిపతిగా చేసి మునులను కూడా ఆ పరిధిలోనికి తెచ్చింది. 


ఆమె ఆదేశంతో కొంతమందికి మన్మథుడు దూరంగా ఉంటాడు. మనకు సంబంధించినంత వరకు మన్మథుడు అధికారి. ఆమెకు దాసుడు. మనం మన్మథుని జయించినంత సమర్థులం కాదు. ఆమె ఆజ్ఞ ఉంటేనే అది సాధ్యమౌతుంది. ఈ శ్లోకంలో మునులు సైతం మన్మథుని పరిధిలో ఉంచబడినారని చెప్పడంతో, ఆమె అనుగ్రహం ఉంటేనే మన్మథుని బారినుండి తప్పించుకోగలమని, ఆమె అనుగ్రహంతోనే కామనాశనం జరుగుతుందనీ అర్థం వస్తోంది.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: