మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
అన్నదమ్ములు..ఆస్తిపంపకం..
"మీకు తెలిసిన మంచి లాయర్ ను నాకోసం మాట్లాడతారా?..ఒక సలహా కావాలి.." అని నన్ను అడిగాడు రాజగోపాల్..
రాజగోపాల్ వాళ్ళ నాన్న గారు లక్ష్మీనరసారెడ్డి గారితో నాకు బాగా దగ్గర స్నేహం ఉన్నది..లక్ష్మీనరసారెడ్డి గారికి ఇద్దరూ మొగపిల్లలే..వివాహం జరిగిన ఏడు సంవత్సరాల దాకా పిల్లలు పుట్టకపోతే..మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి సమాధి వద్ద లక్ష్మీనరసారెడ్డి మొక్కుకున్నారు..ఆ మరుసటి సంవత్సరమే సంతానం కలిగింది..మొగపిల్లవాడు..అతనికి వేణుగోపాల్ అని పేరు పెట్టుకున్నారు..ఆ మరుసటి సంవత్సరం మళ్లీ మొగపిల్లవాడు పుట్టాడు..అతనికి రాజగోపాల్ అనీ పేరు పెట్టుకున్నారు..శ్రీ స్వామివారి దయవల్లే తనకు సంతానం కలిగిందని చాలా సార్లు చెప్పుకునేవారు లక్ష్మీనరసారెడ్డి.. ప్రతి సంవత్సరం శ్రీ స్వామివారి దర్శనానికి ఖచ్చితంగా వచ్చి వెళ్లేవారు లక్ష్మీనరసారెడ్డి..
లక్ష్మీనరసారెడ్డి వ్యవసాయం చేసేవారు..తల్లుదండ్రుల నుంచి సంక్రమించిన ఐదు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ..అంచెలంచెలుగా కష్టపడి దానిని పాతిక ఎకరాలకు పెంచుకోగలిగారు..ఇద్దరు కుమారులనూ ఉన్నంతలో బాగానే చదివించారు..ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు..పెద్దవాడు హైదరాబాద్ లో..రెండవవాడు బెంగళూరు లో వుంటున్నారు..ఇద్దరికీ వివాహాలు జరిగాయి..ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నారు..
లక్ష్మీనరసారెడ్డి గారు తనకున్న ఆస్తిని మూడు భాగాలు చేసి, తనకూ తన భార్యకు ఒక భాగం ఉంచుకొని..మిగిలిన రెండు భాగాలూ ఇద్దరు కుమారులకూ సమానంగా వచ్చేటట్లు వీలునామా వ్రాసారు.. చిన్నవాడైన రాజగోపాల్ తన అన్నయ్య వాటాకు వచ్చిన భూమి తనకు కావాలని..తన వాటాకు వచ్చిన దానిని అన్నయ్యకు ఇవ్వమని కోరాడు..ఈ చిన్న విషయం కారణంగా ఆ కుటుంబంలో మనస్పర్థలు వచ్చాయి..అన్నదమ్ములిద్దరూ పంతాలకు పోయారు..లక్ష్మీనరసారెడ్డి గారికి మనసుకు కష్టం వేసింది..
సరిగ్గా ఆ సమయంలోనే రాజగోపాల్ నన్ను సలహా అడిగాడు..అంతకుముందే లక్ష్మీనరసారెడ్డి నాతో చెప్పివున్నారు కనుక, అతనిని కూర్చోబెట్టి నచ్చచెప్ప బోయాను..కానీ ఆ పిల్లవాడు వినలేదు..తాను కోర్టుకు వెళతానని ఖరాఖండిగా చెప్పేసాడు..ఇక చేసేదేమీలేక మౌనంగా ఉండిపోయాను..
ఆ తరువాత ఆదివారం నాడు లక్ష్మీనరసారెడ్డి గారు భార్యతో సహా మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..శ్రీ స్వామివారి విగ్రహానికి పూజలు చేయించుకొని..శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి.."స్వామీ!..సంతానం లేని నాడు నిన్ను వేడుకుంటే..నాకు సంతానాన్ని ప్రసాదించావు.. ఈనాడు ఆ సంతానమే నాకు మనోవేదన కలిగిస్తున్నారు..ఈ సమస్యను నువ్వే పరిష్కరించాలి..నా చేతుల్లో ఏమీ లేదు..నిన్నే నమ్ముకున్నాను..నా కుటుంబంలో వచ్చిన ఈ పొరపొచ్చాలు సమసిపోయి..అందరూ కలిసిమెలిసి ఉండేటట్లు నువ్వే అనుగ్రహించు.." అని వేడుకున్నారు..సమాధి మందిరం నుంచి బైటకు వచ్చి.."ఇక అంతా ఆ స్వామివారిదే భారం ప్రసాద్ గారూ..నేను పూర్తిగా ఆ మహానుభావుడి మీదే నమ్మకం పెట్టుకున్నాను.." అన్నారు..
మరో వారం గడిచింది..మళ్లీ ఆదివారం నాడు..లక్ష్మీనరసారెడ్డి గారు మందిరం లోపలికి వస్తూ కనిపించారు..నేరుగా నేను కూర్చున్న చోటుకు వచ్చి.."స్వామివారు నా మొర ఆలకించారు ప్రసాద్ గారూ..రెండురోజుల్లో సమస్య తీరిపోయింది..చిన్నవాడు మనసు మార్చుకున్నాడు..మొన్న బుధవారం నాకు ఫోన్ చేసి.."నాన్నగారూ మీ ఇష్టప్రకారమే పంపకాలు చేయండి..నాకేమీ అభ్యంతరం లేదు..ఇప్పుడే అన్నయ్య తో కూడా మాట్లాడాను..నేను శనివారం మన ఊరికి వస్తున్నాను..ఆదివారం అందరం కలిసి మొగలిచెర్ల వెళ్లి, శ్రీ స్వామివారిని దర్శించుకుని వద్దాము.." అన్నాడండీ.. వాడిలో ఈ మార్పు తీసుకొచ్చింది స్వామివారే.." అన్నారు..ఇంతలో లక్ష్మీనరసారెడ్డి గారి ఇద్దరు కుమారులూ, భార్యా..వచ్చేసారు..అందరూ కలిసి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొన్నారు..
నేను కుతూహలం పట్టలేక, రాజగోపాల్ ను ప్రక్కకు పిలచి, " లాయర్ సలహా కావాలన్నావు కదా..ఈలోపల ఏమి జరిగింది?.." అన్నాను..అతను ఏమీ మాట్లాడకుండా..శ్రీ స్వామివారి పటం వైపు చూపించి..ఒక నమస్కారం పెట్టాడు.."పోయిన సోమవారం రాత్రి నిద్ర పెట్టలేదండీ..ఎవరో వచ్చి నేను చేస్తున్నది తప్పు అని పదే పదే చెప్పినట్లు ఆలాపన వచ్చింది..ఆ ప్రక్కరోజూ అదే జరిగింది..తట్టుకోలేకపోయాను..బుధవారం నాడు అన్నయ్య తో..నాన్నగారితో మాట్లాడిన తరువాతే నాకు మనసుకు శాంతి కలిగింది..ఆస్తి కోసం పంతాలకు పోతే..అనుబంధాలు దెబ్బతింటాయని తెలిసొచ్చింది.." అన్నాడు..
లక్ష్మీనరసారెడ్డి గారికి సంతానాన్ని ప్రసాదించిన శ్రీ స్వామివారు..ఆ కుటుంబం లో వచ్చిన మనస్పర్ధలనూ దూరం చేశారు..ఆ మాటే లక్ష్మీనరసారెడ్డి గారు చెప్పుకుంటూ వుంటారు..
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి